– ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్
– 27కోర్టులు, 51 జడ్జి చాంబర్లతో సుప్రీం విస్తరణకు ప్రణాళిక
న్యూఢిల్లీ : గత 76 ఏండ్లలో భారతీయ న్యాయ వ్యవస్థ చరిత్ర అంటే భారతీయుల రోజువారీ జీవన పోరాటాల చరిత్రేనని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డి. వై చంద్రచూడ్ మంగళవారం వ్యాఖ్యానించారు. మన చరిత్ర అంటూ మనకేమైనా నేర్పించింది అంటే అది ఇదేనని అయన చెప్పారు. సుప్రీం కోర్టు లాన్స్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్ర చూడ్ న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కోర్టులకు ఏ విషయమూ పెద్దది కాదు, చిన్నదీ కాదని అన్నారు. అదనంగా మరో 27 కోర్టులు, 51 న్యాయమూర్తుల ఛాంబర్లతో సుప్రీం కోర్టును విస్తరించేందుకు తమ వద్ద ప్రణాళిక వున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం సుప్రీం కోర్టుకు 16 కోర్టు రూమ్‌లు, రెండు రిజిస్ట్రార్ కోర్టులు వున్నాయి. న్యాయమూర్తుల సంఖ్య 32గా వుంది. న్యాయస్థానాలు మరింత అందుబాటులోకి వచ్చేలా చూసేందుకు, అందరినీ కలుపుకుని పోయేందుకు ప్రాధాన్యతా ప్రాతిపదికన న్యాయస్థానాల మౌలిక సదుపాయాల వ్యవస్థను ప్రక్షాళన చేయడం అవసరమని అన్నారు. జ్యుడీషియల్ వ్యవస్థను ఆధునీకరించడమే కొత్త ప్రాజెక్టు ముఖ్యోద్దేశమని చెప్పారు. ”27 అదనపు కోర్టులు, 51 న్యాయమూర్తుల ఛాంబర్లు, నాలుగు రిజిస్ట్రార్ కోర్టు రూమ్‌లు, 16 రిజిస్ట్రార్ ఛాంబర్లు, న్యాయవాదులు, కక్షిదారులకు అవసరమైన ఇతర సదుపాయాలకు వెసులుబాటు కల్పిస్తూ కొత్త భవనాన్ని నిర్మించడం ద్వారా అత్యున్నత న్యాయస్థానాన్ని విస్తరించాలన్నది మా ప్రణాళికగా వుంది” అని చంద్రచూడ్ తెలిపారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రకటనకే తన ప్రసంగాన్ని పరిమితం చేయకుండా జ్యుడీషియరీ పోషించే ముఖ్యమైన పాత్ర గురించి కూడా ఆయన మాట్లాడారు. రాజ్యాంగ పరిమితులకు లోబడే పాలనా వ్యవస్థల కార్యకలాపాలకు’ హామీ కల్పించడంలో న్యాయవ్యవస్థ ముఖ్య భూమిక పోషిస్తుందన్నారు.
తమ హక్కులు, స్వేచ్ఛలకు రక్షణ కల్పించాలని కోరే వ్యక్తులకు సురక్షితమైన ప్రజాస్వామ్య స్థలాన్ని కోర్టులు అందిస్తాయని చెప్పారు. న్యాయాన్ని ఆకాంక్షిస్తూ ప్రజలు రావడానికి తగిన అవకాశాలను కల్పించడంతో పాటూ భారత ప్రజల రాజ్యాంగ ఆశయాలు, నమ్మకాలు, ప్రాధాన్యతలను కొత్త భవనం ప్రతిబింబిస్తుందని చంద్రచూడ్ చెప్పారు. న్యాయావకాశాలను మెరుగుపరచడం, రాజ్యాంగ విలువలను పెంపొందించడం ద్వారా వ్యవస్థాగత పాలనలో సుప్రీం కోర్టు అగ్రగామిగా వుందన్నారు.