వినూత్నమైన వజ్రాభరణాలనూ ఆవిష్కరించిన హెచ్‌జెఎఫ్‌

నవతెలంగాణ – హైదరాబాద్‌: భారతదేశంలో బీ2బీ ఎగ్జిబిషన్‌ల నిర్వహణలో ఖ్యాతి గడించిన ఇన్‌ఫార్మా మార్కెట్స్‌ , ఆభరణాల ప్రేమికులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న హైదరాబాద్‌ జ్యువెలరీ, పెరల్‌, జెమ్‌ ఫెయిర్‌ (హెచ్‌జెఎఫ్‌) 15వ ఎడిషన్‌తో వచ్చింది. ఈ సంవత్సరపు ప్రదర్శనలో దాదాపు 200 మందికి పైగా అగ్రశ్రేణి ఎగ్జిబిటర్లు తమ వినూత్నమైన డిజైన్లను ప్రదర్శిస్తున్నారు. దాదాపు 8000 మంది వాణిజ్య కొనుగోలుదారులు పాల్గొన్నారు. దాదాపు 600 ఎక్స్‌క్లూజివ్‌ బ్రాండ్లు ఈ ఎక్స్‌పో లో దాదాపు ఒక లక్షకు పైగా తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. హైదరాబాద్‌ జ్యువెలరీ, పెరల్‌, జెమ్‌ ఫెయిర్‌ (హెచ్‌జెఎఫ్‌) 2023 ను విశిష్ట అతిధులు, పరిశ్రమ ప్రముఖుల సమక్షంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణా రాష్ట్ర ఐటీ, వాణిజ్య,పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్‌ రంజన్‌ ; తెలంగాణా బులియన్‌, జెమ్‌ అండ్‌ జ్యువెలరీ ఫెడరేషన్‌ అధ్యక్షులు శ్రీ జగ్దీష్‌ పెర్షాద్‌ వర్మ, ఐబీజెఏ జాతీయ ఉపాధ్యక్షులు శ్రీ చేతన్‌ మెహతా ; ఇండోనేషియన్‌ ట్రేడ్‌ ప్రొమోషన్‌ సెంటర్‌ (ఐటీపీసీ) డైరెక్టర్‌ శ్రీ నుగ్రోహో ప్రియో ప్రటోమో ; హెచ్‌ఐజెఎంఏ కన్వీనర్‌ శ్రీ ముఖేష్‌ అగర్వాల్‌, ఏఓజె డైరెక్టర్‌ శ్రీ సుమేష్‌ వధేరా ; ఎస్‌వీఏఆర్‌ గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ రాజేంద్ర జైన్‌ ; ఇన్‌ఫార్మా మార్కెట్స్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ యోగేష్‌ ముద్రాస్‌ ; ఇన్‌ఫార్మా మార్కెట్స్‌ ఇండియా గ్రూప్‌ డైరెక్టర్‌ శ్రీమతి పల్లవి మెహ్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖల ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్‌ రంజన్‌ మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిన 14 రంగాలలో జెమ్స్‌ అండ్‌ జ్యువెలరీ ఒకటన్నారు. మిగిలిన రంగాలన్నీ అద్భుతమైన ప్రగతి సాధించినప్పటికీ, జెమ్స్‌ అండ్‌ జ్యువెలరీ రంగంలో మాత్రం కోర్టు కేసులు సహా పలు కారణాల రీత్యా తాము ఆశించిన ప్రగతి సాధ్యం కాలేదన్నారు. ఈ రంగాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, తమ వర్క్‌షాప్‌లు, ఫ్యాక్టరీలు పెట్టే ఆభరణాల వర్తకులకు తగిన ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. ఇన్‌ఫార్మా మార్కెట్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ యోగేష్‌ ముద్రాస్‌ మాట్లాడుతూ “ తమ తొలి ప్రయాణం హైదరాబాద్‌లోనే ప్రారంభమైంది. గత 15 సంవత్సరాలుగా ఈ ప్రదర్శనను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నాము. ఈసారి ప్రదర్శనలో 200కు పైగా స్టాల్స్‌ ఉంటాయి. ఈ మూడు రోజుల ప్రదర్శన విజయం సాధించగలదని ఆశిస్తున్నాము”అని అన్నారు.

Spread the love