హాస్టల్‌లో ఒక్క పూట విడిదీ పొందవచ్చు..!

– త్వరలో పిగోలో అవకాశం
– ఫౌండర్‌ హరి క్రిష్ణ వెల్లడి
– స్మార్ట్‌ మీటర్ల కోసం రేడియస్‌తో ఒప్పందం
నవతెలంగాణ – బిజినెస్‌ బ్యూరో
విద్యార్థులు, ఉద్యోగులు సాధారణంగా ఒక్క నెల లేదా అంతకంటే ఎక్కువ రోజులు హాస్టల్‌లో ఉండటానికి వీలుంటుంది. కానీ.. ప్రయివేటు హాస్టళ్ల అగ్రిగేటర్‌ అయినా పిగో ఒక్క పూట లేదా అంతకంటే ఎక్కువ రోజులు కూడా విడిది చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతోందని.. ఈ సౌలభ్యాన్ని తమ అనుసంధానిత హాస్టళ్లలో త్వరలోనే తీసుకురానున్నామని పిగో ఫౌండర్‌, సీఈఓ హరి క్రిష్ణ తెలిపారు. విద్యా, ఉద్యోగార్థులకు, ఇతరులకు ఇప్పటి వరకు ఇలాంటి సదుపాయం లేదన్నారు. బుధవారం హైదరాబాద్‌లో విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్ల టెక్నాలజీ సంస్థ రేడియస్‌తో పిగో, ఐటీ కారిడార్‌ హాస్టల్స్‌ అసోసియేషన్‌ (ఇట్చా) ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ఈ సందర్బంగా హరి క్రిష్ణ మీడియాతో మాట్లాడుతూ.. పిగో 200 నగరాలు, పట్టణాల్లో విస్తరించి ఉందన్నారు. దాదాపుగా 20వేల హాస్టల్స్‌లో ఒప్పందాలు చేసుకుందన్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే 4వేల పైగా హాస్టళ్ల భాగస్వాములతో కలిసి పని చేస్తుందన్నారు. ఇందులో మెజారిటీ ఐటి కారిడార్‌లోనే ఉన్నాయన్నారు. పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే 15వేల గదుల్లో స్మార్ట్‌ విద్యుత్‌ మీటర్లను అమర్చామని, మరో తొలి దశలో రెండు లక్షలు, రెండో దశలో మరో 2 లక్షల యూనిట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామ న్నారు. వీటి వల్ల కనీసం 15 శాతం విద్యుత్‌ ఆదా కానుందన్నారు. దాదాపు 70 లక్షల యూనిట్ల వినియోగం తగ్గనుందన్నారు.ఇట్చా జనరల్‌ సెక్రెటరీ తాతా కరుణాకర్‌ మాట్లాడుతూ.. కరోనా కాలంలో హాస్టల్‌ రంగం కుదేలయ్యిం దన్నారు. భారీ నష్టాలు చవి చూశామన్నారు. తిరిగి ఇప్పుడు పుంజుకుందన్నారు. హైదరాబాద్‌ మహానగరంలో 10వేల హాస్టళ్లు ఉంటే.. అందులో 4వేల మేర ఐటీ ప్రాంతాల్లోనే ఉన్నాయని తెలిపారు. వీటిల్లో దాదాపు 4 లక్షల మంది అతిథులు ఉంటారన్నారు. ఈ ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లను విద్యార్థులు లేదా ఉద్యోగులే రీచార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి.. విద్యుత్‌ వాడకం పట్ల పొదుపుగా ఉంటున్నారన్నారు. ప్రస్తుతం 30 శాతం మేర వాడకం తగ్గిందన్నారు. ఒక్కో మీటర్‌ ఏర్పాటుకు రూ.5వేల మేర వ్యయం అవుతుందని రేడియస్‌ ఎండీ హరి సింగ్‌ తెలిపారు.

Spread the love