దీపావళి చేసుకొనేదెలా..? : ప్రియాంకా గాంధీ

నవతెలంగాణ న్యూఢిల్లీ: ధరల పెరుగుదలపై కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు ప్రియాంకా గాంధీ మోడీ సర్కార్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. దీపావళి పండుగకు వారం రోజుల ముందు నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతుంటే ప్రజలు దీపావళి ఎలా చేసుకుంటారని ఆమె ప్రశ్నించారు. ఈ పరిస్థితిపై మోడీ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఉల్లిపాయలు, చక్కెర, పప్పుల ధరల పెరుగుదలను ప్రస్తావిస్తూ ప్రియాంకా శుక్రవారం ట్వీట్‌ (ఎక్స్) చేశారు. ‘‘దీపావళి వారం రోజులే ఉంది.. కానీ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఉల్లి ధరలు అకస్మాత్తుగా పెరగడం మొదలైంది. అదే సమయంలో ఉల్లిని ఉత్పత్తి చేసే రెండో అతిపెద్ద దేశం మనది. గతేడాది రైతు సోదరులు 31లక్షల మెట్రిక్‌ టన్నుల ఉల్లిని ఉత్పత్తి చేశారు. అదంతా ఎక్కడుంది? ఆ బడా వ్యాపారి గిడ్డంగిలోనా? లేదంటే నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ గోదాముల్లోనే కుళ్లిపోయిందా?’’ అని ప్రియాంక ప్రశ్నించారు.
మరోవైపు, చక్కెరతో పాటు పప్పులు సైతం పౌరులకు అందుబాటులో లేకుండా పోయాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లేం తింటారు?  మిగతా వాళ్లకు ఏం పెడతారు? ఈ దీపావళి పండుగను ప్రజలు ఎలా సంతోషంగా చేసుకోవాలో ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు.

Spread the love