హైదరాబాద్ నుంచి విమానంలో షిర్డీకి.. టికెట్ ధర ఎంతంటే..?

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ నుంచి షిర్డీ వెళ్లాలా..? ట్రైన్, బస్సు ప్రయాణం ధర తక్కువ అయినా కాస్త శ్రమతో కూడుకున్నది. మరోవైపు సమయం కూడా చాలా ఎక్కువ తీసుకుంటుంది. రోజుల ప్రయాణాన్ని గంటలకు కుదిస్తూ సులభంగా హైదరాబాద్ నుంచి షిర్డీ వెళ్లాలనుకుంటే విమాన ప్రయాణం ఒకటే మార్గం. అయితే ఫ్లైట్ టికెట్​కు వేలకు వేలు పెట్టే అంత స్తోమత లేదని బాధపడుతున్నారా..? మీ కోసం విమాన పర్యాటకాన్ని సరసమైన ధరల్లో అందుబాటులోకి తెచ్చింది తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ). కేవలం రూ.12,499 టికెట్‌ ధరతో టీఎస్‌టీడీసీ.. షిర్డీ యాత్రను ప్రారంభించింది. ప్రతిరోజూ హైదరాబాద్‌ నుంచి బయలుదేరే ఏసీ బస్సులకు అదనంగా విమాన యాత్రను అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్‌లో విమానాశ్రయానికి చేర్చడం.. షిర్డీలో స్థానికంగా పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లడం కూడా వీరే బాధ్యత తీసుకుంటారు. భోజనం, వసతి కూడా ఇందులోనే ఉంటుంది. ఈ ప్యాకేజీలో.. భక్తులు హైదరాబాద్‌ నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు విమానంలో బయల్దేరి 2.30 గంటలకు శిర్డీ చేరుకుంటారని టీఎస్‌టీడీసీ ఎండీ మనోహర్‌ తెలిపారు. హోటల్‌లో బస, సాయంత్రం 4.30 గంటలకు శిర్డీ సాయి దర్శనం.. సాయంత్రం ఆరతి కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత మరుసటి రోజు షిర్డీలోని పలు ప్రాంతాల సందర్శనలకు తీసుకువెళ్తామని మనోహర్‌ చెప్పారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు విమానంలో బయలుదేరి సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటారని వెల్లడించారు. పూర్తి వివరాలకు 98485 40371, 98481 25720 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.

Spread the love