వీలైనంత త్వరగా ప్రత్యేక హోదా ఇవ్వండి: సీఎం నితీశ్‌

నవతెలంగాణ – పాట్నా: వీలైనంత త్వరగా తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ప్రారంభిస్తామని బీహార్ సీఎం నితీశ్ కుమార్  కేంద్రాన్ని హెచ్చరించారు. బీహార్‌ అభివృద్ధి పథంలో సాగాలంటే ప్రత్యేక హోదా అవసరమని చెప్పారు. దీనికి మద్దతివ్వనివారు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేరేనని అభివర్ణించారు. ప్రత్యేక హోదా కోసం జేడీయూ ఎన్నో ఏండ్లుగా పోరాడుతున్నదని తెలిపారు. ‘కేంద్రం బీహార్‌కు త్వరగా ప్రత్యేక హోదా ఇవ్వకపోతే, రాష్ట్రవ్యాప్త ఉద్యమం ప్రారంభిస్తాం. ఉద్యమంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి మూలకు ఈ డిమాండ్‌ని తీసుకెళ్తాం. దీనికి మద్దతివ్వని వారు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేరే. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పలు సంక్షేమ పథకాలు అందించాలని నిర్ణయించాం. దీనికోసం బీహార్‌లాంటి పేద రాష్ట్రానికి అనేక కోట్ల రూపాయాలు అవసరమవుతుంది. వాటిని ఐదేండ్లలో ఖర్చు చేస్తాం. అయితే రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కల్పిస్తే ఆ సదుపాయాలన్నీ ప్రజలకు రెండున్నరేండ్లలోనే అందించగలుగుతాం. అందుకే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తక్షణమే అవసరం’ అని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో అణగారిన కులాల కోటాను 50 నుంచి 65 శాతానికి పెంచుతూ రూపొందించిన బిల్లును శాసనసభ ఇటీవల ఆమోదించింది. అదేవిధంగా కులాల సర్వే ఆధారంగా మొత్తం రిజర్వేషన్లను 75 శాతానికి పెంచింది.

Spread the love