జాతీయ రహదారిపై కారు ప్రమాదం… మద్యం బాటిళ్లు జనం పరుగులు

నవతెలంగాణ హైదరాబాద్: జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న ఓ కారు ప్రమాదానికి గురైంది. అయితే కారులో మద్యం బాటిళ్లు ఉండటంతో కారులోని వ్యక్తులు దాన్ని అక్కడే వదిలి పారిపోయారు. దారిన వెళ్లే వారు సహాయం చేసేందుకు వచ్చారు. తీరా చూస్తే కారులో జనం లేరు… మద్యం బాటిళ్లను చూశారు. ఇదే అదనుగా తీసుకున్న ప్రజలు కారులోని బాటిళ్లను తీసుకొని పరారయ్యారు. మరికొందరు పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లారు. అసలే 2016వ సంవత్సరం నుంచి బీహార్ రాష్ట్రంలో సంపూర్ణమద్య నిషేధాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో కారులో దొరికిన బాటిళ్లను తీసుకొని తాగేందుకు ఇండ్లకు పారిపోయారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కారు ప్రమాద సంఘటన గురించి సమాచారం అందుకున్న దోభి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లేందుకు జనం గుమిగూడారు. పోలీసులు ఉన్నప్పటికీ ప్రజలు మద్యం బాటిళ్లను తీసుకుంటూనే ఉన్నారు. కాగా, కారులోని మద్యం బాటిళ్లను తీసుకుంటూ వీడియోలో ఉన్న వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని, వారిని గుర్తిస్తున్నామని ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రేమ్ ప్రకాశ్ తెలిపారు. సంపూర్ణ మద్య పాన నిషేధం అమలులో ఉన్న బీహార్ రాష్ట్రంలో మద్యం తాగిన, తరలిస్తున్నా నేరమే. మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లిన వారి కోసం ఎక్సైజ్ శాఖ గాలింపు చేపట్టింది.

Spread the love