– ఢిల్లీ వర్సిటీలో లా కోర్సు ఫీజు పెంపుపై ఆందోళన
న్యూఢిల్లీ : ఢిల్లీ విశ్వవిద్యాలయం ఐదు సంవత్సరాల బీఏ ఎల్‌ఎల్‌ఎం కోర్సు ఫీజును భారీగా పెంచేసింది. వార్షిక ఫీజును రూ.1.90 లక్షలుగా నిర్ణయించింది. దీంతో పేద విద్యార్థులు న్యాయ శాస్త్రాన్ని అభ్యసించే పరిస్థితి ఉండదని, అలాంటప్పుడు వారు న్యాయవాదులు, న్యాయమూర్తులు ఎలా అవుతారని అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని ప్రతిష్టాత్మక కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో ఢిల్లీ వర్సిటీ ఒకటి. అయితే అక్కడ నిర్వహిస్తున్న సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సులపై చాలా కాలంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఐదు సంవత్సరాల బీఏ ఎల్‌ఎల్‌ఎం ఇంటిగ్రేటెడ్ కోర్సు ఈ జాబితాలో చేరింది. దీనిలో ప్రవేశానికి ఉమ్మడి లా ప్రవేశ పరీక్ష (క్లాట్) నిర్వహిస్తారు. ఫీజు పెంపు నేపథ్యంలో కోర్సు ఏ మేరకు విద్యార్థులను ఆకర్షిస్తుందోనని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎల్‌ఎల్‌బీ కోర్సు కాలపరిమితి ఆరు సంవత్సరాలు. అయితే బీఏ ఎల్‌ఎల్‌ఎం కోర్సు తీసుకుంటే ఒక సంవత్సరం కలిసొస్తుంది. కానీ ఫీజును పేద విద్యార్థులు భరించలేని స్థాయిలో నిర్ణయించారు.
ప్రవేశ పరీక్ష ఫీజునే నాలుగు వేల రూపాయలుగా నిర్దేశించారు. తక్కువ ఫీజుతో ఉమ్మడి యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష (సీయూఈటీ) రాసే అవకాశం ఉన్నప్పుడు క్లాట్‌ను ఎందుకు నిర్వహిస్తున్నారని పలువురు విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు యూనివర్సిటీలు వసూలు చేసే ఫీజులను ప్రభుత్వ యూనివర్సిటీలు వసూలు చేస్తున్నాయని, అలాంటప్పుడు వాటి అవసరం ఏముందని నిలదీస్తున్నారు. ప్రభుత్వ విద్యను ప్రైవేటీకరించే దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగానే ఇదంతా జరుగుతోందని ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి మయుక్ బిస్వాస్ విమర్శించారు. నూతన విద్యా విధానంలో భాగంగా విద్యను ప్రైవేటీకరించాలని, వ్యాపారమయం చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని, విద్యార్థి వ్యతిరేక విద్యా విధానాన్ని అమలు చేసేందుకే ఐదు సంవత్సరాల న్యాయ శాస్త్ర కోర్సును ప్రవేశపెట్టి అధిక ఫీజులు వసూలు చేస్తోందని దుయ్యబట్టారు.