గొడవ పడకుండా ఉండాలంటే ఎలా?

Part of lifeనమస్కారం మేడమ్‌… నా పేరు సరిత. నా పెళ్ళి జరిగి 6 నెలలు అవుతుంది. నేను మా అత్తగారితో ఎంత ప్రేమగా వుందామన్నా ఆమె నాతో ఎప్పుడూ గొడవ పెట్టుకోవాలని చూస్తుంది. అప్పుడప్పుడూ మంచిగా వున్నా సడన్‌గా కోపం తెచ్చుకుంటుంది. నాకు ఆమెతో ఎలాంటి గొడవలూ లేకుండా మంచిగా వుండాలని వుంది. ఆమెను ఎలా మార్చుకోవాలో సలహా ఇవ్వండి.
హల్లో సరితగారు! మీ పెళ్లయి ఆరు నెలలు అయింది అంటున్నారు. మీ సమస్యకి సమాధానం ఇవ్వాలంటే మీ నుంచి మరికొన్ని వివరాలు అవసరమవుతాయి.
మీరు జాబ్‌ చేస్తున్నారా? Home maker గా వున్నారా? ఒకవేళ జాబ్‌ చేస్తుంటే work timings ఏంటి? మీ అత్తగారు single woman నా లేక మీ మామగారు వున్నారా? మీ ఇంట్లో మీతో పాటు ఇంకా ఎవరు వుంటారు? మీ అత్తగారికి మీ వారితో పాటు ఇంక ఎంత మంది సంతానం? ఈ వివరాలన్నీ తెలిస్తేనే మీ సమస్యని సరైన కోణం నుంచి అర్థం చేసుకోవటానికి వీలుంటుంది.
ప్రతి కుటుంబంలో అత్తాకోడళ్ళ మధ్య సమస్యలు రావటం చాలా సహజం. కానీ అందరి సమస్యలకి కారణాలు మాత్రం ఒకటి కాదు. ఇంటి ఆర్థిక పరిస్థితులు, వాతావరణం, మనుషుల ఆలోచనా విధానం, కుటుంబ సభ్యుల మధ్య వుండే అనుబంధం… వీటన్నిటి మీదా ఆధారపడి వుంటుంది.
మీరు ఫేస్‌ చేస్తున్న సమస్యల గురించి కనీసం ఒక్క ఎగ్జాంపుల్‌ అయినా ఇచ్చి వుంటే మీ సమస్య కొంచెం క్లియర్‌ గా అర్థం అయ్యేది.
ఏది యేమైనా ఏ ఇంట్లో అయినా అత్తా కోడళ్ళ మధ్య వచ్చే సమస్యలకి మొదటి కారణం పొసెసివ్‌ నెస్‌. అది మనందరికీ తెలిసిందే. ఇరవై యేళ్లు ఒక రకమైన వాతావరణంలో పెరిగిన అమ్మాయి పెళ్లయి, కొత్త ఇంటికి వచ్చినప్పుడు అడ్జస్ట్‌ అవటానికి కొంత టైం పడుతుంది. ఆ విషయాన్ని ఆ కుటుంబ సభ్యులందరూ అర్థం చేసుకుని ఆమెకి మంచి సపోర్ట్‌ ఇవ్వాలి. కేవలం భర్తే కాదు. ఆ బాధ్యత కుటుంబ సభ్యుల అందరిదీ. కానీ అంత అవగాహన మన సమాజంలో ఎక్కడ వుంది? కోడలి నుంచి expectations ఎక్కువగా ఉండే అత్తలు, అత్తగార్ని అమ్మలతో పోల్చి చూసుకుంటూ వాళ్ళు ఏది చెప్పినా దాన్ని పెత్తనంగా భావించే కోడళ్ళు ఎక్కువగా ఉండే సమాజం మనది.
ఇంక మీ విషయానికి వస్తే పెళ్లయి ఆరు నెలలయింది అంటున్నారు. మనం ఒక కొత్త పని మొదలు పెట్టినప్పుడు, కొత్త జీవితంలోకి అడుగుపెట్టినప్పుడ teething troubles అనేవి సహజం. ప్రస్తుతం మీ సమస్యని అలాగే తీసుకోండి. అంటే భరించమని నా ఉద్దేశ్యం కాదు. కొద్దిగా ఓర్పు పట్టండి. సమస్య అనుకుంటే ఆలోచన ఆగిపోతుంది. ఇవన్నీPart of life అనుకుంటే పరిష్కారం అనేది మీకే దొరుకుతుంది. దానికి మార్గాలు మాత్రం సూచించగలను.
‘మా అత్త గార్ని ఎలా మార్చుకోవాలో చెప్పండి’ అని అడిగారు. ఎదుటి వారిని ఎలా మార్చాలి అనే ఆలోచన కన్నా, పరిస్థితుల్ని ఎలా హ్యాండిల్‌ చేయాలి అన్న ఆలోచన సరైనది. బహుశా మీ అత్తగారు కూడా మీలాగే గొడవలు లేని ప్రశాంతమైన జీవితాన్నే కోరుకుంటూ వుండవచ్చు. అందుకని మీరెలా వుంటే ఆవిడకి నచ్చుతుందో, మీలో ఆవిడకి కనిపిస్తున్న లోపాలు ఏమిటో తెలుసుకోవటానికి ప్రయత్నించండి. అలాగే మీ అత్తగారిలో కూడా మీకు నచ్చినవి, నచ్చనవి రెండు అంశాలపట్ల మీరొక క్లారిటీకి రండి.
చాలా కుటుంబాల్లో వాళ్లకి తెలియనిది, వాళ్ళు ఆలోచించని విషయం యేమిటంటే అత్తా కోడళ్ళ మధ్య వచ్చే సమస్యలకి కారణం వాళ్లిద్దరే అనుకుంటారు కానీ, మిగిలిన కుటుంబ సభ్యుల పాత్ర కూడా వుంటుందని ఆలోచించరు. ఆ ఇద్దరికీ సంబంధించిన వ్యక్తిది కూడా ప్రధాన పాత్ర ఉంటుంది. అతను కూడా కొడుకుగా, భర్తగా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించ గలగాలి. మీ వారి విషయంలో కూడా ఒకసారి ఆలోచించండి. అంతే గానీ అత్తగార్ని మార్చాలా, నేను మారాలా అన్న ఆలోచన మీదే స్టాండ్‌ అయి వుండద్దు.
కొంచం సమస్యలు సద్దుమణిగే దాకా మీ భర్తని మీ అత్తగారితో ప్రేమగా, సన్నిహితంగా మసలమనండి. దానివల్ల ఆమెకి పెళ్లి అయిన తరువాత కూడా తన కొడుకులో ఏమీ మార్పు రాలేదు అన్న భరోసా ఏర్పడుతుంది. ఆ ప్రేమ చిన్నగా మీమీద కూడా ఏర్పడవచ్చు. కాబట్టి మీ వారితో ఈ విషయాలన్నీ చర్చించండి. మీ మామగారు కూడా వుంటే ఆయన కూడా ఇంట్లో ఏ చిన్న సమస్య వచ్చినా బాధ్యత వహించేలా వుంటే ఎలాంటి సమస్యలైనా చక్కగా పరిష్కరించుకోవచ్చు.
సమస్య ఎలాంటిదైనా కారణం అత్తా కోడళ్ళదే అన్నట్టు మీ మీద వదిలేసి వాళ్ళు రిలాక్స్‌ అయిపోవటం ఎంతమాత్రం కరెక్ట్‌ కాదు. అలా చేస్తే చిన్న సమస్యలు పెద్ద గొడవలకి దారి తీస్తాయి. అత్తా కోడళ్ళు మాత్రమే కాదు, తల్లీ కూతుళ్లు కూడా కలిసి ఒకే ఇంట్లో ఉంటే వాళ్ళ మధ్య వుండే బంధం కూడా ఇలాగే వుంటుంది.
కుటుంబ సభ్యులందరూ పంతాలకి, పట్టింపులకి పోకుండా ‘ఇది మన కుటుంబం’ అనుకుని సమస్యల్ని పరిష్కరించుకోండి.
– అమ్మాజి,
ఫ్యామిలీ కౌన్సిలర్‌, 7989695883

Spread the love