ఈ ఏప్రిల్ 14న డాక్టర్ అంబేద్కర్ 135వ జయంతిని దేశవ్యాప్తంగా ఒక పండుగలాగా జరుపుకుంటారు. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలు వేయడం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించు కోవడం పరిపాటి. ప్రభుత్వయంత్రాంగం కూడా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అంబేద్కర్ లక్ష్యాలని, ఆశయాలని ముందుకు తీసుకపోదామని ప్రతిజ్ఞలు కూడా చేస్తుంది. అంబేద్కర్‌కు నిజమైన నివాళి ఇవ్వట మంటే, ఆశయాలని సాధిస్తామని ప్రతిజ్ఞ చేయట మంటే కుల నిర్మూలన కార్యక్రమాన్ని భుజాన వేసుకోవటమే. ఆయన జీవితాంతం పోరాడింది భారతీయ సమాజంలోని కుల వివక్షతతో, పేదరికంతో, అవమానాలతో జీవనాన్ని కొనసాగించిన బడుగు బలహీన వర్గాల గురించే. భారతీయ సమాజంలో ప్రత్యేకించి హిందూమతంలో ఉన్న అమానుషమైన కుల వ్యవస్థను రద్దు చేయాలని నిర్మూలించాలని జీవితాంతం కృషి చేశాడు. హిందూమతంలో ఉన్న అంటరానితనం భారతీయ సమాజాన్ని ముందుకు పోకుండా చేస్తుందని, బాధలు పడేవారంతా ఐక్యం కాకుండా అడ్డుపడు తుందనే నిర్ణయానికి వచ్చాడు. ఈ సమాజం మారకుండా అడ్డుపడే కలలు కులవ్యవస్థ కూడా ఒక ప్రధానమైనదని ఆయన సిద్ధాంతరీకరించాడు. ఆయన రాసిన చారిత్రాత్మక పుస్తకం ”కుల నిర్మూలన”లో ఇది ప్రతిబింబిస్తుంది.
ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో కులాన్ని రద్దు చేయడమెలా? నిషేధించడమెలా? అనే చర్చలు విపరీతంగా జరుగుతున్నాయి. ఈ చర్చలకు నేపథ్యం సుప్రీంకోర్టు క్రిస్టియన్స్‌గా మారిన దళితులకి ప్రభుత్వమిచ్చే సౌకర్యాలు వర్తించవని తీర్పు చెప్పటమే. దీనిపై దళిత నాయకుల ప్రెస్‌మీట్, బ్రాహ్మణుల జోక్యం, దీనిపై చర్చోపచర్చలు సోషల్‌మీడియాలో ఊపందు కున్నాయి. అసలు అంబేద్కర్ కులాన్ని నిర్మూలించడానికి ఏం చెప్పాడు? అన్నది ఈ సందర్భంగా చరించాల్సిన అంశం.
భారతీయ సమాజంలో, ప్రపంచంలో అనేక రకాల రుగ్మతలున్నాయి. వాటికితోడు దేశంలో అదనంగా ఒక జఠిలమైన కులవ్యవస్థ వుంది. కులం పుట్టినప్పుడు వస్తుంది. చచ్చినాపోదు. మతం మార్చుకోవచ్చు, వర్గం మార్చుకోవచ్చు, ప్రాంతం మార్చుకోవచ్చు, భాష మార్చుకోవచ్చు, వృత్తి మార్చుకోవచ్చు. కానీ, మార్చుకో లేనిది కులమొక్కటే. మతం మారితే కులం మారదు. దళితుడు బ్రాహ్మణుడు కాలేడు. దళిత హిందూ అయినా, దళిత క్రైస్తవుడైనా, దళిత బౌద్ధుడైనా, దళిత ముస్లిం అయినా సమాజం చూసే చూపు ఒకే రీతిగానే ఉంటుంది. మతాలు మారినంత మాత్రాన సామాజిక హోదాలు మారవు. కులాలున్నంతకాలం ఈ పరిస్థితుల్లో గుణాత్మకమైన మార్పురాదు. కులాలున్నంతకాలం కుల విపక్ష ఉంటుంది. వివక్ష ఉన్నంతకాలం సమాజంలో కులాల మధ్య స్పర్ధలు, ఘర్షణలుంటాయి.
కులవ్యవస్థ ఉన్నంతకాలం వివిధ కులాలలో ఉన్న శ్రామిక వర్గాల మధ్య ఐక్యత అంత సులభం కాదు. ఈ కులవ్యవస్థ యొక్క ప్రభావం ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాలపై విస్తృతంగా ఉంది. ఇది భారత సమాజ పురోగమ నానికి ఆటంకంగా ఉంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే అనేక రంగాలలో వెనుకబడటానికి ఇదే ఒక ప్రధాన కారణం. కులాలుండొద్దని చెప్పని వారుండరు. కులాలు అంతం కావాలని అందరు బహిరంగంగా చెబుతుంటారు. కానీ, నూటికి తొంభైతొమ్మిది మంది కులాలని ఆచరిస్తుం టారు. ఎంత చదువు చదివినా కుల ఆచారాలు, సంప్రదా యాలు, కట్టుబాట్లను ఎదిరించలేక పోతున్నారు.
మూడు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ అమానుష కులవ్యవస్థ ఇంతకాలం ఉండటా నికి, ప్రస్తుతం కొనసాగటానికి, భవిష్యత్తులో నిలిచి ఉండటానికి కారణం ఏమిటో ఆలోచిం చాల్సిన అవసరమెంతో ఉన్నది. సామాజిక శాస్త్ర వేత్తల పరిశోధనలలో తేలుతున్నది ఏమిటంటే కులానికి మూలం వివాహ వ్యవస్థయేనని. ఎవరు ఏ కులములో పుడితే ఆ కులం వారినే పెళ్లి చేసుకోవాలనే కఠినమైన నిబంధనలే కుల వ్యవస్థని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుందని అర్థమవుతుంది.
కులం అంటే రక్తసంబంధీకుల సమూహం. సమీప రక్త సంబంధికుల సమూహం కుటుంబమైతే, దూరపు రక్తసం బంధికుల సమూహమే కులం. కులంలోని వ్యక్తులు అంతా దగ్గర లేదా దూర బంధువుల సమూహమే. కులవ్యవస్థ రక్షణ కోసమే అంతర్వివాహాల పద్ధతిని బలవంతంగా రుద్దారు. కులాలున్నంత కాలం కులాంతర వివాలు చేసుకోవడం చాలా కష్టం. కుల ప్రభావం సాధారణమైంది కాదు, ఇది ప్రపంచంలో ఇతర ప్రాంతాలకు వలస పోయేవారు భారతీయ కులవ్యవస్థను ప్రపంచ సమస్యగా మారుస్తారని డాక్టర్ అంబేద్కర్ ఎప్పుడో చెప్పింది మనం ఇప్పుడు చూస్తున్నాం. కులవ్యవస్థను కాపాడేది అంతర్వివాహాలేనని సామాజిక ఉద్యమకారులు, మేధావులు ఎప్పటినుంచో చెబుతూనే వస్తున్నారు.
ఒకే మూలపురుషున్ని కలిగి ఒకే అనువంశిక వృత్తిని పాటిస్తూ అంతర్ వివాహాలు మాత్రమే చేసుకునే ఒకే పురుషునితో చాలామణయ్యే కుటుంబాలు లేదా ఆ బంధుత్వ సధర్మ సమూ హాలనే” కులము అన్నారు. ”ముందే నిర్ణయించబడిన సామాజిక అంతస్తుకు మానవుడు తన పుట్టుక ద్వారా మార్చుకోలేనప్పుడు వర్గమే కులం రూపం తీసుకుం టుంది” అని నిర్వచించారు సర్ హెర్బర్ట్ రిస్లే.
దాదాపు ఇదే అభిప్రాయాన్ని మరో విదేశీ సామాజిక శాస్త్రవేత్త ఖేల్కర్ చెప్పాడు.వారి ప్రకారం కులం అంటే రెండు లక్షణాలున్న ఒక సామాజిక సమూహం.1) కులము సభ్యత్వం ఆ కులంలో పుట్టిన వ్యక్తులకు, ఆ కులంలో పుట్టబోయే వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుంది 2)ఒక కులంలోని సభ్యులు అదే కులములో పుట్టని వారిని పెళ్లి చేసుకోకూడదు. తాను ఏ కులములో పుడితే ఆ కులం వారినే పెళ్లి చేసుకోవాలి.
అంబేద్కర్ కూడా కులం ఇంతకాలం అస్తిత్వంలో ఉండటా నికి, ప్రస్తుతం నిలిచి వుండటానికి, భవిష్యత్తులో కొనసాగటానికి అంతర్ వివాహ వ్యవస్థయే కారణం అవుతుందని చెప్పారు. అందుకోసమే ఆయన ”బాహ్య వివాహం ఒక నియమమైతే కులమనేది ఉండదు”అంటారు.
”భారతదేశంలో కులాలు” అనే అంబేద్కర్ ప్రఖ్యాత రచన పేజీ 11లో ఈ విషయం స్పష్టంగా చెప్పారు.”భారతదేశంలో కులము అంటే జనాభాను ఒక స్థిరమైన విభాగాలుగా, కృత్రిమంగా వేరుచేసి పెట్టి, అవి మళ్లీ ఒకదానితో ఒకటి కలవకుండా అంతర్వివాహాల ద్వారా నిరోధించుటమే దీనికున్న ప్రత్యేక లక్షణము” అని అంటాడు.
భారతదేశ మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్ ”కుల సమస్యని పరిష్కరించకుండా భారతదేశం పురోగతి సాధించలేదంటారు. ఈ కుల సమస్య పరిష్కారం చేయటానికి ఉన్న ఒకే ఒక మార్గం స్వకుల వివాహాలని నిషేధించడమే. అందుకు స్వకుల వివాహాలను నిషేధిస్తూ చట్టం చేయాలం టాడు”
కుల సమస్య కేవలం వ్యక్తిగత సమస్య కాదు. అది సమాజ సమస్య. కాబట్టి కులాంతర వివాహాలు చేసుకునేవారంతా సామాజిక విప్లవ కారులే. కులాంతర వివాహం తెలిసి చేసుకున్నా, తెలియక చేసుకున్నా, ఆదర్శంగా భావించి చేసుకున్నా, ఆకర్షణతో చేసుకున్నా అది సమాజాభివృద్ధికి తోడ్పడేదే. 2002లో సుప్రీంకోర్టు జస్టిస్ ఖర్జూ కులాంతర వివాహాలు జాతి ప్రయోజనాల కొరకేనని చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారు. కానీ, బూజుపట్టిన సనాతన సమాజమంతా కులాంతర వివాహాలు చేసుకున్న వారికి అనేక ఇబ్బందులకు గురిచేస్తోంది. అనేక ఆటంకాలు కలిపిస్తోంది. అమానుషమైన కుల కట్టుబాటుకు భయపడి కుటుంబాలు కూడా వారిని దరిచేరనియ్యవు. కులాంతర వివాహం చేసుకునే వారికి శత్రువులు తల్లిదండ్రులే అవుతున్నారు. కులాంతర వివాహం చేసుకున్న వారిని అమానుషంగా, నిర్ధాక్షిణ్యంగా చంపుతున్నారు. కులం వెలివేస్తోంది. సమాజం చిన్నచూపు చూస్తోంది. పోలీసు వ్యవస్థ, న్యాయవ్యవస్థ కూడా విశాల దృక్పథంతో ఆలోచించటం లేదు.సనాతన వాదులమని, సంప్రదాయవాదులమని అని చెప్పేవారే నిర్ధాక్షిణ్యంగా వ్యవరిస్తున్నారు, ధర్మం తప్పినట్లుగా భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా రక్షణ ఇవ్వడం లేదు.
కుల నిర్మూలన సంఘాలు,కులాంతర -మతాంతర వివాహితుల సంఘాలు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘాలు కుల వ్యతిరేక సంస్థలు కృషి చేస్తున్నారు. అయినా వాటి ప్రభావం చాలా పరిమితమే. ప్రజాసంఘాలు, రాజకీయ సంస్థలు, ప్రభుత్వము ఈ అంశాన్ని ప్రధానమైనదిగా భావించిన ప్పుడే ఈ సమస్య త్వరగా పరిష్కారమవుతుంది. ఇది ఒక వ్యక్తి సమస్య కాదు. వివాహం చేసుకొనేవారి సమస్య కాదు. ఒక కుటుంబం సమస్య కాదు.ఒక కులం సమస్య కాదు. మొత్తం సమాజ సమస్య. కులాంతర వివాహం ఏ రెండుకులాల మధ్య జరిగినా అది సమాజానికి ప్రయోజనమే.
ఇప్పుడు మన భారతీయ సమాజంలో కులాంతర వివాహాలు చేసుకున్న వారు ఒక పర్సంటేజ్ కూడా ఉండరు. కులాంతర వివాహాలు చేసుకున్న దంపతులు గ్రామీణ ప్రాంతాలలో జీవించటం దాదాపు అసాధ్యమే. ఇది కాదనలేని సత్యం. కులం నిర్మూలించాలన్నా, రద్దు చేయాలన్నా, కులరహిత సమాజం ఏర్పాటుకావాలన్నా స్వకుల వివాహావ్యవస్థను తిరస్కరించాల్సిందే. కుల నిర్మూలనకి ఒక దీర్ఘకాలికమైన ప్రణాళిక ఉండాల్సిన అవసరం ఉంటుంది.
ఏ సంస్కరణ అయినా, ఏ ఉద్యమమయినా, ఏ విప్లవం అయినా జయప్రదం కావాలంటే భావజాల రంగంలో జరగాల్సిన సాంస్కృతిక విప్లవం పైలెట్‌లాగా ముందు నడవాలి. పొగ తాగటం, మద్యం సేవించటం, డ్రగ్స్ తీసుకోవడం, దొంగతనం చేయటం తప్పు అని ఏ విధంగా అయితే సమాజం, ప్రభుత్వం ప్రచారం చేస్తుందో అదే విధంగా స్వకులాలలో వివాహాలు కూడా తప్పు అని ప్రచారం జరగాల్సిన అవసరం ఉన్నది. స్వకుల వివాహాల వలన కలిగే నష్టాలని చెబుతూ, కులాంతర వివాహాల ప్రయోజనాలను వివరించేలాగా పాటలు, కథలు, వ్యాసాలు, నాటకాలు, నవలలు తదితర సాహిత్యం ద్వారా కులవివాహాలు తప్పని కులాంతర వివాహాలే ఒప్పని విరివిగా ప్రచారం కావలసిన అవసరం ఉన్నది. అది ప్రజల భావాలలోకి క్రమంగా చొరబడితే అదే భౌతిక శక్తిగా మారుతుంది. కులాంతర వివాహాలు సర్వసాధారణమైతే ఒకటి రెండు జనరేషన్‌లోనే సమాజంలో కులం నిర్మూలించబడు తుంది. ఆ విధంగా కులం రద్దవుతుంది. ఇదే అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మనం తీసుకోవలసిన ప్రతిజ్ఞ.
అందుకే స్వకుల వివాహాలను నిరసించుదాం! బహిష్క రిద్దాం!! నిషేధిద్దాం!!! రద్దు చేద్దాం!! అనే నినాదాలు మారు మోగాల్సిన అవసరం ఉన్నది.
జి.రాములు
9490098006
కులవ్యవస్థను నిర్మూలించడం ఎలా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



