– మల్టీ పర్పస్ విధానం రద్దు చేయకుంటే సమ్మెకైనా సిద్ధమే
– సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లాలో గ్రామపంచాయతీ సిబ్బంది జీతాలు ఇవ్వకుంటే ఎలా బతకాలని, మాట తప్పినందుకే పోరాటం తప్పదని, మల్టీపర్పస్ విధానం రద్దు చేయకుంటే సమ్మె కైనా సిద్ధమని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ తెలిపారు. ఈ మేరకు బుధవారం గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ధర్నా చౌక్ లో ఒకరోజు దీక్ష, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. దీక్షను సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా కార్యదర్శి జంగం గంగాధర్ కు పూలమాలవేసి దీక్షను ప్రారంభించారు. దీక్షను ఉద్దేశించి సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా కార్యదర్శి జంగం గంగాధర్ లు మాట్లాడుతూ.. రాష్ట్రం లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామి అమలు చేయలేదన్నారు. కార్మికులను పర్మినెంట్ చేస్తామని, కనీస వేతనం రూ.26 వేల ఇస్తామని, మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేస్తాం అని అనేక హామీలు ఇవ్వడమే కాక,కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో కూడా పెట్టారని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటై దాదాపు సంవత్సరం కావస్తున్నప్పటికి నేటి వరకు ఒక్క హామీ కూడా అమలు చేయలేదని అన్నారు. హామీల అమలుకోసం మంత్రి సీతక్క, కమీషనర్ అనితా రామచంద్రన్ లను అనేక సార్లు కలిసి విన్నవించినా.. ఏదో ఒక సమాధానం చెప్పి దాటవేస్తున్నారని అన్నారు. సమస్యలను పరిష్కారం చేయకపోగా, పని భారాన్ని మరింతగా పెంచుతున్నారని అన్నారు. ఆదివారాలు, పండుగ సెలవులు కూడా లేకుండా బానిస చాకిరీ చేయించుకుంటున్నారన్నారు. ఈ కాలంలో అనేక ప్రమాదాలు జరిగి కార్మికులు ప్రాణాలు కోల్పోయారని, ఒక్కరికీ కూడా ఒక్క రూపాయి నష్ట పరిహారం ఇవ్వలేదని అన్నారు.
నెలల తరబడి వేతనాలను పెండింగ్ లో పెట్టారని అన్నారు.గ్రామ పంచాయతీ లలో పంప్ మెకానిక్ లుగా పని చేస్తున్న వారిని మిషన్ భగీరథ కి మార్పు చేసి ట్రైనింగ్ లు ఇచ్చి విలేజ్ వాటర్ అసిస్టెంట్లుగా పేరు పెట్టీ వారితో పని చేయిస్తున్నారని అన్నారు.ఇప్పటి వరకు పని చేసిన సీనియారిటీ మొత్తం కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని అన్నారు.గడచిన పదకొండు నెలల కాలంలో ముఖ్యమంత్రి మొదలు మంత్రి,కమీషనర్ తదితర అధికారులకు సమస్యల గురించి మొర పెట్టుకున్నా,పరిష్కరించలేదని అన్నారు.మండల కార్యాలయం ముందు ధర్నాలు,దీక్షలు చేశామని,కలక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు ,హైద్రాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా చేసినా ప్రభుత్వం నుండి ఏమాత్రం స్పందన లేదన్నారు.ఇప్పటికైనా కార్మికుల తక్షణ సమస్యలను పరిష్కరించాలని లేని యెడల నిరవధిక సమ్మెకి సిద్దమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గమని అన్నారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం లో ఆరోగ్య మిత్రాలు సమ్మె చేసి వేతనాలు పెంచుకున్నారని అన్నారు.వీరి స్ఫూర్తి తీసుకుని నేటి తరం పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి నన్నే సాబ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రాజేష్, జిల్లా ఉపాధ్యక్షులు సాగర్ జిల్లా నాయకులు పద్మ రేఖ పోశెట్టి పసియోదిన్ లాలు గంగారం సాయిలు లక్ష్మి భూమయ్య అనిత సాయమ్మ పద్మారావు రాములు తదితరులు పాల్గొన్నారు.