యూఎన్ కమిటీ తీవ్ర ఆందోళన..నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి
న్యూఢిల్లీ : భారత్‌లోని ఎస్సీ, ఎస్టీ, రోహింగ్యా శరణార్థులు, తదితరులపై జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనపై ఐక్యరాజ్యసమితి(యూఎన్)కి చెందిన ఒక కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని నివారించడానికి, పరిష్కరించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ ఉల్లంఘనలకు “జవాబుదారీతనం ఉండేలా చూడాలని” కూడా స్పష్టం చేసింది. జాతి వివక్ష నిర్మూలనపై ఐరాస కమిటీ (యూఎన్‌సీఈఆర్‌డీ) ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. రోహింగ్యా సంక్షోభం తలెత్తి తొమ్మిదేండ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం ఈ ప్రకటన వచ్చింది. పైన తెలిపిన వీరంతా జాతి ప్రేరేపిత హింస, మితిమీరిన బలప్రయోగం, హత్యలు, సరైన విచారణ లేకుండా ఏకపక్షంగా, సుదీర్ఘకాలం నిర్బంధించడం, చిత్రహింసలు, లైంగిక హింసకు గురయ్యారని కమిటీ ఈ ప్రకటనలో పేర్కొంది. వీటిపై తక్షణ, సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరిపి, బాధ్యులను శిక్షించాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టు ఈ ప్రకటనలో తెలిపింది.
బెంగాలీ మాట్లాడే ముస్లిలం పైనా దాడులు…
ఎస్సీ, ఎస్టీలతో పాటు బెంగాలీ మాట్లాడే ముస్లింలను లక్ష్యంగా చేసుకుని దాడులు పెరిగాయనీ, వీరిపై జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనకు సంబంధించిన నివేదికలతో తాము తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు ఈ ప్రకటనలో వివరించింది. ముఖ్యంగా 2017 హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు, కాశ్మీర్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తరువాత ‘‘రోహింగ్యాలు, బెంగాలీ మాట్లాడే ముస్లింలు, వలసదారులు, ఆశ్రయం కోరుకునేవారు, పౌరసత్వం లేనివారు’’ను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వ నేతృత్వంలోనే వేధింపులు పెరిగాయని విమర్శించింది. చెక్‌పోస్టుల వద్ద జాతి వివక్షాపూరిత పరిశీలన జరిపారనీ, ఇది “సరైన విచారణ లేకుండా ఏకపక్ష అరెస్టులు, నిర్బంధాలకు” దారితీసిందని ఆరోపించింది. వీటిని అదుపులోకి తీసుకొని రావాలని కోరింది. కాగా, ఈ నెల 11, 12 తేదీల్లో భారత్‌లోని ప్రస్తుత పరిస్థితిపై కమిటీ సమీక్షించింది. ఈ సమీక్షకు కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా నేతృత్వంలోని బృందం హాజరైంది. ఈ సమీక్ష జరిగిన 15 రోజుల తరువాత కమిటీ ఈ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. యూఎన్‌సీఈఆర్‌డీలో 18 మంది నిపుణులు ఉంటారు.
ఎస్సీ, ఎస్టీ, రోహింగ్యా శరణార్థులపై మానవ హక్కుల ఉల్లంఘన
- Advertisement -
- Advertisement -



