నా వెంటే ప్రజలు ఓటు అడిగే హక్కు నాకే ఉంది

– గూడెంలో ఎక్కడ చూసినా నేను చేసిన అభివృద్ధే
– దాహార్తిని తీర్చేందుకు గోదావరి నీళ్లు
– పట్టాలిచ్చాను… ఇండ్ల స్థలాలు పంచాను
– మాత శిశు ఆస్పత్రి … మెడికల్‌ కళాశాలను కట్టించాను
– 80 శాతం సర్వేలు నాకే అనుకూలం
– గెలిచాక ఛాలెంజ్‌గా అభివృద్ధి చేస్తా
– నవతెలంగాణ ఇంటర్వ్యూలో కొత్తగూడెం ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వనమా
నవతెలంగాణ-పాల్వంచ
నియోజకవర్గ ప్రజల సమస్యలు తనకే తెలుసని, తాను తొలిసారి ఎమ్మెల్యే అయిన నాటి నుంచి ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ వచ్చానని, ఈ నియోజకవర్గంలో ఓటు అడిగే హక్కు ఏ పార్టీకి లేదని, తను ఒక్కడికే ఆ హక్కు ఉందని, ఈ గడ్డ నా అడ్డా అని బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వనమా బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు సీఎం కేసీఆర్‌ మళ్ళీ వనమాకే శాసనసభ టికెట్‌ ఇచ్చిన సందర్భంగా శనివారం ఆయన స్వగృహంలో నవతెలంగాణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ఏ గల్లీలో చూసిన తాను వేసిన శిలాఫలకాలు, అభివృద్ధి కనిపిస్తుందన్నారు. వార్డు మెంబర్‌, సర్పంచ్‌, మున్సిపల్‌ చైర్మెన్‌గా పనిచేసిన కాలంలోనూ సైతం వృద్ధి లక్ష్యంగా పని చేశాను అన్నారు. 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంలోని ఏ గ్రామానికి వెళ్లిన పొంగుతున్న వాగులు వంకలు, రోడ్లు, డ్రైన్లు, పక్క గృహాలు లేక, మంచినీటి సౌకర్యం లేక ప్రజలు ఎంతగానో ఇబ్బందులు గురయ్యేవారని అన్నారు. గ్రామాల చుట్టూ ఉన్న వాగులు పొంగితే రాకపోకలు లేక తిండి తిప్పలు లేక ప్రజలు నరకయాతన గురయ్యేవారని ఆ ఇబ్బందులు లేకుండా ప్రతి గ్రామానికి బ్రిడ్జిలను నిర్మించానన్నారు. గ్రామాలలో రోడ్లు వేయడంతో పాటు డ్రైలను నిర్మించి సుందరంగా తీర్చిదిద్దానన్నారు. ప్రజల దాహర్తిని తీర్చేందుకు కిన్నెరసాని జలాలను పట్టణాలతో పాటు గ్రామాలకు తీసుకువచ్చానని, ప్రతి గ్రామంలో బోర్లను వేసి ఓవర్‌ హెడ్‌ ట్యాంకులను కట్టించి నీటి వసతిని కల్పించానన్నారు. ఇక్కడ నీటి ఎద్దడి అనే మాట వినపడకుండా చేశాను అన్నారు. పక్క ఇండ్లు కట్టించానని, గ్రామ గ్రామన విద్యుత్‌ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడంతో పాటు అనేక సమస్యల పరిష్కరించిన ఘనత తనకే దక్కుతుందన్నారు. నియోజకవర్గంలోని వర్గంలోని రామవరం శివారు ప్రాంతంలో మాత శిశుఆసుపత్రిని కట్టించి ఉచిత వైద్యాన్ని అందిస్తున్న ఘనత తనతోపాటు బీఆర్‌ఎస్‌ పార్టీకే దక్కుతుందన్నారు. కోట్ల రూపాయలు చెల్లించి వైద్య విద్యను అభ్యసించ లేక అనేకమంది విద్యార్థులు విద్యకు దూరమయ్యేవారని మరి సౌకర్యార్థం మెడికల్‌ కళాశాలను సైతం నిర్మింపజేసి తక్కువ ఖర్చుతో వైద్య విద్యను నేర్చుకునేందుకు కృషి చేశానన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీతో పాటు పాల్వంచ మున్సిపాలిటీ, పాల్వంచ మండలం, కొత్తగూడెం మండలాల్లో అనేక మంది పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతోపాటు ఇండ్ల పట్టాలను సైతం ఇప్పించడం జరిగిందన్నారు. రుద్రంపూర్‌లోని భూ నిర్వాసితులకు సైతం పట్టాలు ఇప్పించిన ఘనత తనదేనన్నారు. రైల్వే అండర్‌ బ్రిడ్జి నిర్మించి ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చూశాను అన్నారు. వేల కోట్ల నిధులను తీసుకువచ్చి పాల్వంచ కొత్తగూడెంలను హైదరాబాద్‌ సికింద్రాబాద్‌లా తీర్చిదిద్దానన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన వెంటనే గోదావరి జలాలను తీసుకువచ్చి ప్రజల దాహార్తిని తీర్చేందుకు అనేక విధాలుగా కృషి చేస్తున్నానని అన్నారు. 80 శాతం సర్వేలు తనకే అనుకూలంగా ఉన్నాయని, ప్రజలు సైతం తనవైపే ఉన్నారని గెలుపు ఖాయమని అన్నారు. ఇది నా జన్మభూమి కర్మభూమి అని తాను చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందన్నారు. ప్రచారంలో భాగంగా ఏ గ్రామానికి వెళ్ళినా మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలుకుతున్నారని వారి ఆదరణకు ధన్యుడినని ఎల్లకాలం రుణపడి ఉంటాను అన్నారు. నియోజకవర్గంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సైతం ఎంతగానో ప్రేమ ఉందని తను అడిగిన వెంటనే వేలాది కోట్ల నిధులను మంజూరు చేశారని ఆ నిధులతో అభివృద్ధి జరిగిందన్నారు. నియోజకవర్గంలో ప్రజలు వనమా కావాలని కోరుకుంటున్నారని తనను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రజల ఆశీస్సులతో తిరిగి మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తున్నారని, గెలిచిన వెంటనే ప్రతి గ్రామానికి తిరిగి పరిష్కారం కాని సమస్యలను పరిష్కరిస్తానన్నారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే మరింత చాలెంజిగా నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. నవంబర్‌ 5వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొత్తగూడెం పర్యటనను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

Spread the love