నాకో కులం కావాలి

I want casteఅర్జెంటుగా ఇప్పుడు
నాకో కులం కావాలి..

కొంత రొమ్ము విరుచుకునేందుకు
కొంత కాలర్‌ ఎగరేసేందుకు
నాయకులంతా నా ముందు మోకరిల్లెందుకు
నాకో కులం కావాలి.

కార్పొరేషన్ల కమిషన్లు పొందేందుకు
కమ్యూనిటీ హాలు కట్టుకునేందుకు
నాకు ఇప్పుడు ఓ కులం కావాలి.
నాకేమీ చరిత్ర వద్దు
నాకేమీ పోరాట పటిమ
గతాలు వద్దు
నాకేమీ సమాజ అవగాహన లాంటి
చెత్త పదాల ఊక దంపుల్లు వద్దు
నాకో కులం కావాలి ప్లీజ్‌

శాసన వ్యవస్థలను శాసించడానికి
సరాసరి రాజ్య రాజకీయ
రంకుల సమరంలో
నా రంకుబొంకునంత వలకబోసుకోవడానికి
గననీయమైన నాయకుల సంఖ్యను
పెంచుకునేందుకు
నాకో కులం కావాలి

నా కులాన్ని చూస్తే మిగతా కులాల
లో దుస్తులు తడిసి ముద్ద అవ్వాలి
నాయకులు.. సినిమా నటులు..
లక్షాధికారులు. బిచ్చగాల్లు
అందరూ నా కులపోల్లే ఉండాలే

ఊసిల్ల పుట్టోలే చీమల వరస వోలె
గబ్బిలాల గుంపు వోలె
మిడతల దండోలే
నా కులం నేల నేలంతా పరచుకోవాలే
కుల విస్తరణకు కుటుంబ నియంత్రణ పరిధి నుండి నా కులాన్ని తొలగించాలే

కింద ఏడు లోకాలు
పైన ఏడు లోకాలు
నా కుల సంఖ్యను చూసి దద్దరిల్లాలే
నా కులానికి రాజకీయ పార్టీలన్నీ
వంగి సలాములు చేయాలే
చక్రం తిప్పేందుకు..
చంకలు గుద్దుకునేందుకు.
నాకు ఓ కులం కావాలే.

కావాలంటే నా గుణాన్ని తీసుకోండి
కానీ ఓ కులాన్ని ఇవ్వండి
ప్లీజ్‌ ప్లీజ్‌ నాకో కులం కావాలి
– చెమన్‌, 9440385563

Spread the love