భాగ్యనగరం విశ్వనగరంగా మారాలంటే మెట్రో విస్తరణ అవసరం: కేటీఆర్

నవతెలంగాణ -హైద‌రాబాద్: హైద‌రాబాద్ భ‌విష్య‌త్తు కోసం మెట్రో విస్త‌ర‌ణ చేప‌ట్టాల్సిన అవసరముందని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం మెట్రో రైల్ మాస్ట‌ర్ ప్లాన్‌పై మెట్రో రైల్ భవన్‌లో స‌మీక్ష నిర్వ‌హించారు. ఎయిర్ పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంపై చ‌ర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… హైద‌రాబాద్ భ‌విష్య‌త్తు కోసం భారీగా మెట్రో విస్త‌ర‌ణ అవసరమన్నారు. న‌గ‌రంలో ర‌ద్దీ, కాలుష్యం త‌గ్గాలంటే, భాగ్యనగరం విశ్వ‌న‌గ‌రంగా మారాలంటే, ప్ర‌జా ర‌వాణా బ‌లోపేతం కావాలంటే విస్తరణ అవసరమన్నారు. మెట్రో విస్తరణకు కావాల్సిన పనులు వేగంగా చేయాలని అధికారులకు సూచించారు. 48 ఎక‌రాల భూమిని మెట్రో డిపో కోసం అప్ప‌గించాల‌ని ఆదేశించారు. మ‌రిన్ని కోచ్‌ల‌ను అందుబాటులోకి తీసుకురావాల‌న్నారు. ఫీడ‌ర్ సేవ‌ల‌ను మెరుగుప‌ర‌చ‌డంతో పాటు ఫుట్‌పాత్‌ల‌ను అభివృద్ధి చేయాలన్నారు. మల్టీ లెవల్ కార్ పార్కింగ్ కాంప్లెక్స్‌ల కోసం ఇప్పటికే ఉన్న, ప్రతిపాదిత మెట్రో స్టేషన్‌లకు సమీపంలోని ఖాళీ ప్రభుత్వ భూములను గుర్తించాలన్నారు.

Spread the love