బీజేపీ మరోసారి గెలిస్తే దేశానికే విపత్తు

బీజేపీ మరోసారి గెలిస్తే దేశానికే విపత్తు– లౌకికశక్తులు త్వరగా సీట్ల సర్దుబాటు చేసుకోవాలి : సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రానున్న లోక్‌సభ ఎన్నికలు దేశానికి అత్యంత కీలకమనీ, ప్రజాస్వామ్య, లౌకికశక్తులు సాధ్యమైనంత త్వరగా సీట్ల సర్దుబాటు చేసుకోవాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా అన్నారు. తమపార్టీ తమిళనాడులో డీఎమ్‌కేతో ఇప్పటికే సంప్రదింపులు మొదలు పెట్టిందని తెలిపారు. తమపార్టీ దేశవ్యాప్తంగా సముచిత స్థానాల్లో పోటీచేస్తుందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి గెలిస్తే దేశానికి పెద్ద విపత్తు సంభవించినట్టేననీ, ఆ ప్రమాదం నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్‌ మగ్ధూంభవన్‌లో మూడ్రోజులు జరిగిన సీపీఐ జాతీయ సమితి సమావేశాలు ఆదివారం ముగిశాయి. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు, తీర్మానాలు తదితర అంశాలను ఆపార్టీ జాతీయ కార్యదర్శులు రామకృష్ణ పండా, డాక్టర్‌ కే నారాయణ, సయ్యద్‌ అజీజ్‌, లోక్‌సభా పక్షనేత బినారు విశ్వం, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతిపక్షాల హక్కు అనీ, ప్రధాని మోడీ, బీజేపీలు మాత్రం ప్రతిపక్షమే ఉండకూడదని భావిస్తున్నారని విమర్శించారు. రానున్న లోక్‌సభ ఎన్నికలకు తమపార్టీ సన్నద్ధమవుతున్నదనీ, మణిపూర్‌ నుంచి మహారాష్ట్ర, తమిళనాడు నుంచి బీహార్‌ వరకు సీట్ల సర్దుబాటు ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని ఆయా రాష్ట్రాల నాయకత్వానికి సూచించామన్నారు. ఇండియా కూటమి కామన్‌ ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందిస్తామనీ, పార్టీ తరపున మ్యానిఫెస్టో రూపకల్పనకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని చెప్పారు. అయోధ్యలో రామాలయ అంశాన్ని బీజేపీ దూకుడుగా ప్రచారం చేస్తున్నదనీ, బాబ్రీ మసీదు కూల్చివేతలో నేరస్థునిగా ఉన్న అద్వానీకి భారతరత్న ఇచ్చారన్నారని విమర్శించారు. కేంద్ర కార్మిక సంఘాలు, కిసాన్‌ సంయుక్త మోర్చా ఆధ్వర్యంలో ఈనెల 16న చేపట్టనున్న సమ్మెకు తమపార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హౌదా ఇవ్వాలనీ, విశ్వవిద్యాలయాల్లో డి రిజర్వేషన్స్‌ ఇవ్వాలని జాతీయ కౌన్సిల్‌ సమావేశాల్లో తీర్మానం చేశామన్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ఇండియా కూటమి నేతలకు ఒక గుణపాఠం కావాలని అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో సక్రమంగా సీట్ల సర్దుబాటు జరగలేదని ఆయన అభిప్రాయపడ్డారు. బీహార్‌ ప్రజలు నితీష్‌కుమార్‌కు గుణపాఠం చెప్తారని అన్నారు.
మ్యానిఫెస్టో కమిటీ ఏర్పాటు
వచ్చే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సీపీఐ జాతీయ సమితి ‘ఎన్నికల మ్యానిఫెస్టో’ కమిటీని ఏర్పాటు చేసింది. ఆపార్టీ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు అమర్‌ కౌర్‌, డాక్టర్‌ బి.కె.కంగో, నాగేంద్రనాథ్‌ ఓజా, జాతీయ కార్యవర్గ సభ్యులు అనీరాజా, రాజ్యసభ సభ్యులు పి.సందోష్‌ కుమార్‌లను కమిటీ సభ్యులుగా నియమించారు.

Spread the love