– ఓవైపు ఎండ..మరోవైపు వర్షం
– నాగల్‌గిద్దెలో 6.7 సెంటీమీటర్ల వాన
– మహదేవ్‌పూర్‌లో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత
– నాలుగైదు రోజుల్లో ఉష్ణోగ్రతలు,వడగాల్పులు పెరిగే అవకాశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పర్యావరణ సమతుల్యత దెబ్బతింటున్న ఎఫెక్టేమోగానీ రాష్ట్రంలో విభిన్న వాతావరణం నెలకొంది. ఎండకు ఎండే..వానకు వానే..ఉక్కపోతకు ఉక్కపోతే అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఆదివారం వాతావరణం కూల్‌గా ఉన్నప్పటికీ ఉక్కపోత మాత్రం తీవ్రస్థాయిలో ఉంది. ‘హా..ఏం ఉక్కపోత రా? బాబూ’ అనకుండా ఉండలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ఆదివారం రాత్రి పది గంటల వరకకు 250కిపైగా ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. అందులో 50 ప్రాంతాల్లో మోస్తారు వర్షం పడింది. సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్దెలో 6.7 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ 45.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో వచ్చే నాలుగైదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందనీ, అదే సమయంలో పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కొమ్రం భీమ్ అసిఫాబాద్, నిర్మల్, మహబూబాబాద్, నల్లగొండ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. అదే సమయంలో రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే సూచనలున్నాయి. అక్కడక్కడా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చు.