– ఎన్నికల వేళ ప్రతిపక్షాలే లక్ష్యంగా దాడులు, అరెస్టులు
– దర్యాప్తు సంస్థల ద్వారా అణచివేతలు
– దేశాన్ని హిందూత్వ రాష్ట్రంగా మార్చే ప్రయత్నం
– వైస్రారుల పాత్ర పోషిస్తున్న గవర్నర్లు: సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ ఆగ్రహం
– మదురైలో పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం
మదురై : కేంద్రంలో నరేంద్ర మోడీ, బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యమే ఉండదని సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కరత్ చెప్పారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయని ఆయన అన్నారు. తమిళనాడులోని మదురై లోక్‌సభ నియోజకవర్గం నుండి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెంకటేశన్‌కు మద్దతుగా శనివారం జరిగిన బహిరంగ సభలో కరత్ ప్రసంగించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్ష నేతలను బీజేపీ లక్ష్యంగా ఎంచుకున్నదని ఆయన ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సొరేన్‌ను అరెస్ట్ చేశారని, ఓ వైపు ఎన్నికల ప్రచారం జరుగుతుంటే మరోవైపు ప్రతిపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తూనే ఉన్నాయని విమర్శించారు.
ఇవేం చర్యలు?
ప్రతిపక్షాలతో బీజేపీ ప్రజాస్వామిక పద్ధతిలో పోరాడడం లేదని, వాటిని అణచివేస్తోందని కరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతాలను ఆదాయపన్ను శాఖ స్తంభింపజేసిందని, ఆ పార్టీకి నోటీసులు జారీ చేసిందని గుర్తు చేశారు. కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో సీపీఐ (ఎం) బ్యాంక్ ఖాతాను సైతం ఐటీ శాఖ ఫ్రీజ్ చేసిందని చెప్పారు. ఈడీ, సీబీఐ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా ప్రతిపక్షాలను అణగదొక్కేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ‘బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ప్రతిపక్ష నేతలను పార్లమెంట్ నుండి సస్పెండ్ చేశారు. పాత్రికేయులు, పౌర హక్కుల కార్యకర్తలను కూడా కటకటాల వెనక్కి నెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామిక స్వేచ్ఛ కోసం పోరాడుతున్న సంస్థలు ఈ చర్యలను విమర్శించాయి’ అని ఆయన అన్నారు.
మందిర నిర్మాణం ఘనకార్యమా?
అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని ఓ ఘనకార్యంగా బీజేపీ, మోడీ ఎన్నికల ప్రచారంలో చెప్పుకుంటున్నారని కరత్ ఎద్దేవా చేశారు. అది ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమమని, మోడీ పురోహితుడిగా వ్యవహరించారని చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరు కానందుకు ప్రతిపక్షాలను బీజేపీ విమర్శించిందని, అది ఒక రాజకీయ ప్రాజెక్ట్ అయినందునే ప్రతిపక్షాలు ఆ ఆహ్వానాన్ని తిరస్కరించాయని తెలిపారు. మతతత్వ అజెండా కోసం మతాన్ని, రాజకీయాన్ని కలగలిపారని విమర్శించారు. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, దేశాన్ని హిందూత్వ రాష్ట్రంగా మార్చేసే ఉద్దేశంతో మనువాద సిద్ధాంతాన్ని అమలు చేస్తోందని ధ్వజమెత్తారు.
బీజేపీయే అవినీతి పార్టీ
‘ఇండియా కూటమిని అవినీతి పార్టీల కలయికగా బీజేపీ, మోడీ పిలుస్తున్నారు. బీజేపీయే అత్యంత అవినీతి పార్టీ అని ఎన్నికల బాండ్ల ఉదంతం నిరూపించింది. చట్టాలను సవరించి బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టారు. విరాళాల కోసం ఖాతాలు తెరిచేందుకు సీపీఐ (ఎం) నిరాకరించింది. బాండ్ల పథకాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమని ఆరు సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. బాండ్లలో సగానికి పైగా బీజేపీ ఖాతాలోకే చేరాయి. ప్రజలను బెదిరించేందుకు ఆ డబ్బును బీజేపీ ఉపయోగించింది. ఎన్నికల బాండ్ల ద్వారా జరిగిన మనీ లాండరింగ్, అవినీతిపై విచారణ జరపాలి. దానిని సుప్రీంకోర్టు పర్యవేక్షించాలి’ అని కోరారు.
వరదల సమయంలోనూ నిధులివ్వరు
దేశం రాష్ట్రాల సమాఖ్యగా ఉండాలా, దేశంలో ఫెడరలిజం ఉండాలా అనే అంశాలను రాబోయే ఎన్నికలు నిర్ణయిస్తాయని కరత్ చెప్పారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు ‘ఒకే దేశం…ఒకే భాష…ఒకే సంస్కృతి’ విధానాన్ని కోరుకుంటున్నాయని తెలిపారు. ఆ పార్టీ నాయకులు దేశంలో ఒకే ఎన్నికలు ఉండాలని కూడా భావిస్తున్నారని, ఇది ఫెడరల్ నిర్మాణాన్ని నాశనం చేస్తుందని అన్నారు. పాలకులు గవర్నర్లను వాడుకుంటున్నారని, వారేమో వైస్రారుల మాదిరిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వరదల సమయంలో సైతం తమిళనాడుకు బీజేపీ ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని కరత్ మండిపడ్డారు.