క్రమం తప్పితే..?

If out of order..?జీవన శైలి మార్పులు మహిళలు, యువతుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. హార్మోన్ల అసమతుల్యత, అధిక బరువు, తక్కువ బరువు, జంక్‌ ఫుడ్‌, వ్యాయామం లేకపోవడం, పని ఒత్తిడి, నిద్ర లేకపోవడం, మానసిక సమస్యల కారణంగా మహిళల్లో రుతుచక్రం క్రమం తప్పుతుంది. ఈ ఇర్రెగ్యులర్‌ పీరియడ్స్‌ సమస్య ఇతర శారీరక, మానసిక సమస్యలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. రుతుచక్రం క్రమం తప్పితే బరువు పెరగడం, ముఖంపై అవాంఛిత రోమాలు, మూడ్‌ స్వింగ్స్‌, కడుపు ఉబ్బరం వంటి అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం, ఆరోగ్యకరమైన బరువు, పోషహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం… వంటి అలవాట్ల ద్వారా పిరియడ్స్‌ రెగ్యులర్‌గా వస్తాయి. వీటితో పాటు కొన్ని ఆహార పదార్థాలు రుతుక్రమ సమతుల్యతను ప్రేరేపిస్తాయి. అవేంటంటే..
విటమిన్‌ సి అధికంగా ఉండే పండ్లు : విటమిన్‌-సి అధికంగా ఉండే ఆహార పదార్థాలు రుతుక్రమం క్రమం తప్పకుండా కాపాడతాయి. బొప్పాయిలో ఉండే కెరోటిన్‌కు ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ను ప్రేరేపించగల సామర్థ్యం ఉంటుంది. ఇది పీరియడ్స్‌ ముందే వచ్చేలా చేయగలదు. సి విటమిన్‌ అధికంగా ఉండే మరో పండు పైనాపిల్‌. దీనికి కడుపులో మంటను నిరోధించగలిగే శక్తి ఉంటుంది. తద్వారా ఇది పీరియడ్స్‌ రెగ్యులర్‌గా వచ్చేలా చేయగలదు. నారింజ, నిమ్మ, కివి, మామిడి పండ్ల నుంచి కూడా విటమిన్‌ సి అధికంగా అందుతుంది. సీజన్‌ను బట్టి ఇలాంటి పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటే ఇర్రెగ్యులర్‌ పీరియడ్స్‌ సమస్య దరిచేరదు.
అల్లం : రుతుక్రమం అదుపు తప్పకుండా కాపాడే దివ్య ఔషధం అల్లం. ఆహారంలో అల్లంను క్రమం తప్పకుండా తీసుకుంటే ఇర్రెగ్యులర్‌ పీరియడ్స్‌ సమస్య ఎదురుకాదు. ఇప్పటికే సమస్య ఎదుర్కొంటున్న మహిళలు ఒక చెంచా తేనె, తురిమిన అల్లం మిశ్రమాన్ని రోజూ తీసుకోవాలి. దీనితో కొద్ది రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది. అల్లంను నేరుగా తీసుకోవడానికి ఇష్టపడనివారు వంటల్లో దాన్ని వాడుకోవచ్చు.
పసుపు : గర్భాశయం లోపలి భాగం, కటి ప్రాంతంలో రక్త ప్రసరణను పసుపు ఉత్తేజపరుస్తుంది. పసుపులో ఉండే యాంటిస్పాస్మోడిక్‌ గుణాలు శరీరంపై అత్యుత్తమ ప్రభావం చూపుతాయి. ఇది గర్భాశయాన్ని విస్తరిస్తూ, పీరియడ్స్‌ రెగ్యులర్‌గా వచ్చేలా ప్రేరేపిస్తుంది. రుతుక్రమానికి సంబంధించిన అవకతవకలను నిరోధించడానికి Vసుపు పాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి.
బెల్లం : బెల్లంలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. బెల్లంలో అల్లం, నువ్వులు, పసుపు వంటివి కలిపి ఒక మిశ్రమంలా తయారు చేసుకోవాలి. దీన్ని వేడి నీటిలో కలిపి టీ లాగా తాగొచ్చు. దీన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల రుతుక్రమానికి సంబంధించిన అన్ని రకాల అనారోగ్యాలు నయమవుతాయి. పీరియడ్స్‌ ముందే వచ్చేలా చేయగలిగే శక్తి ఈ పదార్థాలకు ఉంది.
బీట్‌రూట్‌ : బీట్‌రూట్‌లో ఐరన్‌, కాల్షియం, ఫోలిక్‌ యాసిడ్‌ వంటి సూక్ష పోషకాలు ఉంటాయి. శరీరం నీటిని సంగ్రహించే శక్తిని బీట్రూట్‌ మెరుగుపరుస్తుంది. ఇవన్నీ పీరియడ్స్‌ క్రమం తప్పకుండా కాపాడతాయి. ఆ సమయంలో వచ్చే కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం వంటి అసౌకర్యాలను బీట్రూట్‌ తగ్గించగలదు. ఇతర దుంప లతో పోలిస్తే ఇది మెరుగైన పోషక వనరు. అందుకే బీట్‌రూట్‌ను క్రమం తప్పకుండా తీసుకోవాలి. పచ్చి దుంపలను తినడానికి ఇష్టపడనివారు రసం తీసి తాగవచ్చు.
ఇర్రెగ్యులర్‌ పీరియడ్స్‌ సమస్యతో బాధపడే వారు ఈ సూపర్‌ఫుడ్‌లను తీసుకోవడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. కానీ సమస్య అధికంగా ఉన్నవారు గైనకాలజిస్ట్‌ సలహా తీసుకోవడమే ఉత్తమమైన మార్గం.

Spread the love