ప్రజలు చస్తుంటే, మహారాష్ట్రలో రాజకీయాలా?

If people are dying, politics in Maharashtra?– తెలంగాణతో కేసీఆర్‌ పేగు బంధం తెగిపోయింది
– మృతుల కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి : రేవంత్‌ రెడ్డి
– ఢిల్లీ తెలంగాణ భవన్‌లో ఎంపీ కోమటి రెడ్డితో కలిసి నిరసన
రైతులను ఆదుకోకపోతే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తాం : కోమటిరెడ్డి
న్యూఢిల్లీ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావుకు తెలంగాణతో పేగుబంధం తెగిపోయిందని టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్‌ రెడ్డి విమర్శించారు. భారీ వర్షాలతో రాష్ట్రంలో రైతులు కష్టాలు, కన్నీళ్లలో ఉంటే రైతులను పరామర్శించాల్సిన కేసీఆర్‌, రాజకీయాల కోసం మహారాష్ట్రలోని కొల్లాపూర్‌ వెళ్లారని విమర్శించారు. ఇది రాజకీయాలు చేయాల్సిన సమయమా? అని ప్రశ్నించారు. మానవత్వం ఉన్న వారు ఇలాంటి రాజకీయాలు చేస్తారా? అని నిలదీశారు. వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లకుండా మహారాష్ట్రకి వెళ్లి పార్టీ ఫిరాయించిన వారికి కండువాలు కప్పుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజాధనంతో ప్రత్యేక విమానంలో రాజకీయాలు చేయడానికి సిగ్గుండాలని విమర్శించారు. కేసీఆర్‌ను గన్‌ పార్క్‌ వద్ద ఉరేసి, రాళ్లతో కొట్టాలన్నారు. కేసీఆర్‌ మహారాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ మంగళవారం నాడిక్కడ తెలంగాణ భవన్‌లో అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఎంపీలు ఎ. రేవంత్‌, కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి, కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఎర్రటి ఎండలో దాదాపు 40 నిమిషాల పాటు నిరసన తెలిపారు. కేసీఆర్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రేవంత్‌ మాట్లాడుతూ… కెసిఆర్‌ ప్రజల ప్రాణాలు గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. తాజాగా కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలో రూ. 5 వేల కోట్ల నష్టం జరిగిందని చెబుతున్న కేసీఆర్‌, కేవలం రోడ్లకు రూ. 500 కోట్లు విడుదల చేశారని విమర్శించారు. మరి చనిపోయిన కుటుంబాలకు, నీట మునిగిన పంటకు రూపాయి ఇవ్వవా? రైతుల ప్రాణాలంటే లెక్క లేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో 40 మంది చనిపోయారని, 20 లక్షల ఎకరాలు పంట నష్టం జరిగిందని అన్నారు. అలాగే లక్షలాది ఎకరాల్లో ఇసుక మేట నిండిందన్నారు. అందువల్ల చనిపోయిన కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. నష్టపోయిన ఎకరానికి రూ. 25 వేలు, ఇసుక మేట పేరిన ఎకరానికి రూ. 20 వేల పరిహారం ఇవ్వాలన్నారు. కేసీఆర్‌కు చిత్తశుద్ది ఉంటే.. ప్రధాని, హోం శాఖకు వరద నష్టంపై నివేదికలు సమర్పించాలన్నారు. తెలంగాణను కూడా మరో గుజరాత్‌లా భావించి ప్రత్యేక సాయం కోరాలని సూచించారు. 2016, 2020 లో రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయని, కానీ కేసీఆర్‌ మాత్రం కేంద్రానికి వరద నష్ట నివేదికలు పంపి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంట్‌కు గాడిదల్లా వస్తున్నారని రేవంత్‌ విమర్శించారు.
కేసీఆర్‌కు మానవత్వం లేదు: కోమటి రెడ్డి
కేసీఆర్‌ పాలనలో బంగారు తెలంగాణ కాదు, బతుకులేని తెలంగాణ గా మారిందని ఎంపీ కోమటి రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌ తెచ్చిన రైతుబంధు, మైనార్టీ బంధు, బీసీ బంధులుజజజ బీఆర్‌ఎస్‌ బందయ్యేందుకే అన్నారు. ఇలాంటి బంధులను రైతులు, తెలంగాణ ప్రజలు నమ్మి మోసపోవద్దని కోరారు. దేశ రాజకీయాలపై నిజంగా అంత ప్రేమే ఉంటే… ఎందుకు కర్నాటక ఎన్నికల్లో పోటీ చేయలేదని ప్రశ్నించారు. రైతులను ఆదుకోకపోతే త్వరలో ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

Spread the love