గీత దాటావో…జీతం కట్‌

‘అరిటాక మీద ముల్లు పడ్డా…ముల్లొచ్చి అరిటాకు మీద పడ్డా…ప్రమాదమైతే అరిటాకుకే’ అన్నట్టు ఆర్టీసీ ఉద్యోగులు ఏం చేసినా అది వారికి ఉనికే ప్రమాదకరంగా పరిణమించింది. వాహనదారులను క్రమశిక్షణలో పెట్టేందుకు ట్రాఫిక్‌ పోలీసులు చేపడుతున్న చర్యలు బాధాకరంగా మారుతున్నాయి. కర్ణుణి చావుకు వెయ్యి కారణాలన్నట్టు… హెల్మెట్‌, త్రిబుల్‌ రైడింగ్‌, లైసెన్స్‌, ఆర్‌సీ, నెంబర్‌ప్లేట్‌ ఇవేవీ లేకపోయినా ఫైన్ల మీద ఫైన్లు బాదుతున్నారు. రాంగ్‌ సైడ్‌ పార్కింగ్‌, లైన్‌ క్రాస్‌, లైన్‌ జంపింగ్‌ ఇలా బాదుడే బాదుడు. అందులో వాహన దారులే సమిధలౌతున్నారు.అయితే ఆర్టీసీ డ్రైవర్లు కూడా ఇలాంటి నిబంధనలు అతిక్రమిస్తే వారి జీతం నుంచి కట్‌ చేస్తున్నారు.చంద్రాయణగుట్ట బ్రిడ్జి కింద ఆర్టీసీ బస్సు సిగల్‌ లైన్‌ క్రాస్‌ చేసినట్టు గుర్తించి ఆయన జీతం నుంచి రూ 8వేల కట్‌ చేసింది. ఆ డబ్బును ఫైన్ల కింద ఫైన్లు చెల్లిస్తున్నది. ఇలా ఎందుకు చేస్తున్నారంటే, ఆర్టీసీ డ్రైవర్లను క్రమశిక్షణ పెట్టేందుకు, వారిని జాగ్రత్తగా ఉంచేందుకు అని చెబుతున్నారు. కానీ సిగలింగ్‌ వ్యవస్థ లోపాలను గుర్తించడం లేదు. ఆటోమేటింగ్‌ సిగలింగ్‌ వ్యవస్థ నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ట్రాఫిక్‌ పోలీసులు చలాన్ల మీద పెట్టిన దృష్టి ట్రాఫిక్‌ నియంత్రణపై పెట్టడం లేదు. దీంతో వాహనదారుల నుంచి ఏ చిన్న పొరపాటు జరిగినా వందలకు వందలు చెల్లించాల్సి వస్తుంది. ఆర్టీసీ డ్రైవర్లు గీత దాటారో వారి జీతం కట్‌ అవుతున్నది. అరకొర జీతాలతో బతుకీడుస్తున్న ఆర్టీసీ డ్రైవర్లకు ఈ నిర్ణయం గుదిబండగా మారింది. ప్రతి రోజు ఏదో ఒక చోట లైన్‌ క్రాస్‌ కావడం, జీతాలు కట్‌ కావడం…తక్కువ జీతాలు ఇంటికి తీసుకెెళ్తే ఇంట్లో రచ్చ రచ్చే.. అని బాధపడుతున్నారు డ్రైవరన్నలు.
– గుడిగ రఘు

Spread the love