– నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలు
– సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన రెజ్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్ఐ) అధ్యక్షులు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపు నిస్తున్నది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, బ్రిజ్ భూషణ్ దిష్టి బొమ్మలు దహనం చేయాలని కోరింది. ఈమేరకు బుధవారం ఎస్కేఎం రాష్ట్ర కన్వీనర్లు టి.సాగర్, పశ్యపద్మ,పి.ప్రభాకర్, పెద్ధారపు రమేష్, మండల వెంకన్న, జక్కుల వెంకటయ్య, మామిడాల బిక్షపతి ఒక ప్రకటన విడుదల చేశారు. అంతర్జాతీయంగా పతకాలు సాధించి దేశానికి గౌరవాన్ని, ప్రతిష్టను తెచ్చిపెడుతున్న ఒలింపిక్ పతక విజేతలతోసహా మన అగ్రశ్రేణి క్రీడాకారులు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న మల్లయోధులను రోడ్లపై ఈడ్చుకుంటూ అరెస్టు చేయడం హేయమైన చర్య అని ఖండించారు. మన భవిష్యత్తు అథ్లెట్లు వారి కలలను సాకారం చేసుకునేందుకు ఇలాంటి ఘటనలు కారణం కాకూడదని తెలిపారు. నిరసన కార్యక్రమంలో ప్రజాసంఘాలు, ప్రజాస్వామిక వాదులు, ప్రజలందరు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.
బీజేపీ ఎంపీ బ్రిజ్భూషన్ను తొలగించాలి
వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్
రెజ్లర్లను లైంగికంగా వేధింపులకు గురి చేసిన బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషన్ శరణ్‌సింగ్‌ను పదవి నుంచి తొలగించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. రెజ్లర్ల ఆందోళనకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో నిరసనలు చేయాలని పిలుపునిచ్చింది. ఈమేరకు బుధవారం ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి నాగయ్య, ఆర్ వెంకట్రాములు ఒక ప్రకటనలో కోరారు.