తెలంగాణలో నేడు, రేపు భగభగలు..

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. ఉదయం 8 నుంచే సూరీడు భగభగమంటున్నాడు. ఇక మధ్యాహ్నం పూట సెగలు కక్కుతున్న సూర్యుడిని చూసి బయటకు వెళ్లాలంటే జనం జంకుతున్నారు. ఈ క్రమంలో రాబోయే రెండ్రోజులు రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. సోమ, మంగళవారాల్లో పలు ప్రాంతాల్లో పగలు 44 డిగ్రీల వరకూ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండటంతో వేడి పెరుగుతోంది. ఆదివారం అత్యధికంగా మంచిర్యాల జిల్లా కొండాపూర్‌లో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రిపూట కూడా వేడి ఎక్కువగా ఉంటుండటంతో ప్రజలు ఉక్కపోతతో నానా ఇబ్బందులు పడుతున్నారు.
పిల్లల బాధలు వర్ణనాతీతం. శనివారం రాత్రి ఖమ్మంలో 30 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణోగ్రతలు పెరగనుండటంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

Spread the love