ఒలింపిక్‌ డే రన్‌ జెర్సీ ఆవిష్కరణ

హైదరాబాద్‌ : అంతర్జాతీయ ఒలింపిక్‌ డే రన్‌ (జూన్‌ 23) ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్‌) చైర్మెన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ తెలిపారు. శుక్రవారం జరుగనున్న ఒలింపిక్‌ డే రన్‌లో భాగంగా 15 కేంద్రాల నుంచి 10 వేలకు పైగా క్రీడాకారులు ఒలింపిక్‌ స్ఫూర్తి చాటుతూ ఎల్బీ స్టేడియం వద్దకు పరుగు తీస్తారని ఈ సందర్భంగా వెల్లడించారు. ఒలింపిక్‌ డే రన్‌ను విజయవంతం చేసేందుకు ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పని చేసేలా చర్యలు తీసుకోవాలని శాట్స్‌ ఉన్నతాధికారులను మంత్రి, చైర్మెన్‌ ఆదేశించారు. బుధవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఒలింపిక్‌ డే రన్‌ జెర్సీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఒలింపిక్‌ డే రన్‌ కమిటీ సభ్యులు, తెలంగాణ ఒలింపిక్‌ సంఘం ఆఫీస్‌ బేరర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇక చలో మైదాన్‌!
బడి బాట తరహాలోనే స్వచ్ఛందంగా చలో మైదాన్‌ కార్యక్రమం చేపట్టాలని శాట్స్‌ చైర్మెన్‌ ఆంజనేయ గౌడ్‌ పిలుపునిచ్చారు. సిఎం కెసిఆర్‌ స్ఫూర్తితో బడి, గుడి మాదిరిగానే మైదానాలనూ గౌరవిద్దాం. ప్రతి రోజు గ్రౌండ్‌కు వెళ్లటం దినచర్యలో భాగంగా చేసుకుందామని ఆంజనేయ గౌడ్‌ అన్నారు. రంగారెడ్డి జిల్లా ఒలింపిక్‌ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 37వ ఒలింపిక్‌ డే రన్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఆంజనేయ గౌడ్‌ సరూర్‌ నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు.

Spread the love