ఓయూలో పెంచిన పీజీ, పీహెచ్‌డీ ఫీజులను తగ్గించాలి

– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) పరిధిలో పీజీ, పీహెచ్‌డీ కోర్సు ఫీజులను రూ.నాలుగు వేల నుంచి రూ.14 వేలకు పెంచడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తీవ్రంగా ఖండించారు. ఇంజినీరింగ్‌ పీహెచ్‌డీ కోర్సులకు రూ.రెండు వేల నుంచి రూ.20 వేలకు, మరికొన్ని కోర్సులకు రూ.25 వేలు పెంచడం సరైంది కాదని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెంచిన ఫీజులను తక్షణమే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. పేద విద్యార్థులు ఫీజులు కడితే తప్ప పీజీ, పీహెచ్‌డీ విద్యను చదివే పరిస్థితి లేదని తెలిపారు. ఈ ఫీజుల పెరుగుదలకు ఎలాంటి శాస్త్రీయత లేదని విమర్శించారు. దీంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఓయూ నిర్వహించిన పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకులతో అడ్మిషన్‌ పొందిన విద్యార్థులకు పరిశోధన చేయడానికి అవకాశం కల్పించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రయివేటు రీసెర్చ్‌ సెంటర్లను రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

Spread the love