వృద్ధులకు ఆరోగ్య బీమాలో భారత్‌ వెనుకబాటు

– ఆసియా పసిఫిక్‌ దేశాల్లో పేలవ ప్రదర్శన .ఏడీబీ నివేదిక
త్బిల్లిసి(జార్జియా): వృద్ధులకు ఆరోగ్య బీమా విషయంలో భారత్‌ వెనుకబడి ఉందని, ఆసియా పసిఫిక్‌ దేశాల్లోనే అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తుందని ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ (ఏడీబీ) గురువారం తన నివేదికలో విమర్శించింది. భారత్‌లో వృద్ధులకు ఆరోగ్య బీమాను మరింత విస్తరించాలని, అలాగే.. వేగంగా పెరుగుతున్న వృద్ధుల అవసరాలను తీర్చడానికి స్థిరమైన వృద్దిని కొనసాగించాల్సిన అవసరం ఉందని ఏడీబీ నివేదిక స్పష్టం చేసింది. ‘ఏజింగ్‌ వెల్‌ ఇన్‌ ఆసియా’ పేరుతో విడుదల చేసిన నివేదికలో ఏడీబీ ఈ విషయాలను వెల్లడించింది. ఒకవైపు దక్షిణ కొరియా, థాయిలాండ్‌ దేశాలు అందరికీ ఆరోగ్య బీమాను సాధించగా, మరొకవైపు భారత్‌ వృద్దుల్లో 21 శాతం మందికి మాత్రమే ఆరోగ్య బీమాతో దిగువ స్థానంలో ఉందని నివేదిక విమర్శించింది. ఆయుష్మాన్‌ భారత్‌ వంటి పథకాలు అట్టడుగు ప్రజలకు నగదు రహిత ఆరోగ్య సంరక్షణను అందించడం ప్రారంభించి ఆరోగ్య కవరేజ్‌ను కొంత మెరుగు పరిచాయని ఏడీబీ సీనియర్‌ ఆర్థికవేత్త ఐకో కిక్కావా అన్నారు. అయితే ఇలాంటి పథకాలను మరింతగా విస్తరించాలని చెప్పారు. అలాగే, 60 ఏండ్లు దాటిన వారిని ఉత్పాదకలో భాగం చేసిన దేశాలకు మంచి ప్రయోజనం కనిపిస్తుందని చెప్పారు. అయితే దీనిని సాధించడానికి వృద్ధుల శారీరక, క్రియాత్మక సామర్థ్యాన్ని మెరుగుపర్చే సేవలను విస్తరించడం చాలా కీలకమని అన్నారు.2031-40లో వృద్ధాప్య జనాభా కారణంగా భారత దేశ ఆర్థిక వృద్ధి ఎలాంటి ప్రభావానికి గురికాదని, ఎందుకంటే అప్పటికే దేశంలో తగినంత యువ జనాభా ఉంటుందని నివేదిక స్పష్టం చేసింది. నివేదిక ప్రకారం 2050 నాటికి ఆసియా పసిఫిక్‌లో 60 ఏండ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారి జనాభా సుమారు 200 కోట్లుకు చేరుకుంటుంది (ఇప్పుడు ఉన్న జనాభాకు రెట్టింపు). లేదా మొత్తం జనాభాలో నాలుగింట ఒక వంతు. దీంతో పెన్షన్‌, సంక్షేమ కార్యక్రమాలు, ఆరోగ్య సంరక్షణ సేవలను గణనీయంగా పెంచాల్సి ఉంటుంది. అలాగే ఇదే సమయంలో ఆయా దేశాలు వృద్ధుల ఉత్పాదక శక్తి కారణంగా స్థూల జాతీ యోత్పత్తి సగటను 0.9 శాతం పెంచుతుందని ఏసీబీ ప్రధాన ఆర్థిక వేత్త ఆల్బర్ట్‌ పార్క్‌ చెప్పారు. ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం, పదవీ విరమణ తరువాత వచ్చే ప్రయోజనాలు వినియోగ అవసరాలను తీర్చగలిగితే ఒక వ్యక్తిని వృద్ధాప్యానికి ఆర్థికంగా సిద్ధంగా ఉన్నట్లు పరిగణిస్తారు.

Spread the love