నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనడం అర్థరహితం : పుతిన్‌

మాస్కో: అమెరికా నేతృత్వంలోని నాటో కూటమితో ఘర్షణ పడాలని రష్యా కోరుకోవటం లేదని, తూర్పు ఐరోపాలోని అమెరికా సామంతులతో తలపడాలనే ఉద్దేశం రష్యాకు లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ బుధవారం వ్యాఖ్యానించారు. యుద్ధభూమిలో ఉక్రెయిన్‌ ఓడిపోతే రష్యా అక్కడితో ఆగదని చెబుతూ అనేక పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతునిస్తున్నాయని ట్వెర్‌ ప్రాంతంలోని టోర్జోక్‌ ఎయిర్‌బేస్‌ను సందర్శించిన సందర్భంగా పుతిన్‌ ఈ వాదనలను ప్రస్తావించాడు. ఇది పూర్తిగా అర్థరహితం అని రష్యా అధ్యక్షుడు అన్నాడు. ఈ సందర్భంగా రష్యా రక్షణ వ్యయం, నాటో దేశాల సైనిక బడ్జెట్ల మధ్య గల అసమానతను గమనించాలని ఆయన కోరాడు. ‘మేము ఉక్రెయిన్‌ తర్వాత ఐరోపాపై దాడి చేయబోతున్నామనే వాదన పూర్తిగా అర్ధంలేనిది. వారి స్వంత జనాభాను బెదిరించి వారి నుండి డబ్బును కొట్టడానికి ఆడుతున్న నాటకం ఇది. తూర్పు ఐరోపాలోని అమెరికా తొత్తులు భయపడటానికి ఎటువంటి కారణం లేదని, పోలాండ్‌, చెక్‌ రిపబ్లిక్‌ లేదా బాల్టిక్‌ దేశాలపై రష్యా దాడికి అవకాశం ఉందని మాట్లాడటం ఆయా దేశాల ప్రభుత్వాలు చేస్తున్న దుష్ప్రచారం మాత్రమేనని, అలా తమ పౌరులను భయపెట్టి, ప్రజల నుండి అదనపు ఖర్చును సేకరించేందుకు, ఈ భారాన్ని వారి భుజాలపై వేయడానికి చేస్తున్న ప్రయత్నంగా దీనిని చూడాలని పుతిన్‌ అన్నాడు. నాటో కూటమి రష్యా సరిహద్దుల వైపు విస్తరిస్తోంది తప్ప రష్యా నాటో దేశాల వైపు విస్తరించటం లేదని, రష్యా కేవలం తన చారిత్రక భూభాగాల్లో తన ప్రజలను రక్షిస్తోందని పుతిన్‌ పేర్కొన్నాడు. ”వారు మా సరిహద్దుల వరకు వచ్చారు… మేము సముద్రం దాటి అమెరికా సరిహద్దుల వరకు వెళ్లామా? లేదే. వారు మా సరిహద్దుల దగ్గరికి వస్తున్నారు. వారు చాలా దగ్గరగా వచ్చారు” అని ఆయన వెల్లడించాడు. ఉక్రెయిన్‌ యుద్ధంలో పాల్గొనడానికి శిక్షణ పొందుతున్న సిబ్బందితో సహా రష్యా యుద్ధ పైలట్‌ల కోసం ఏర్పాటైన 344వ శిక్షణా కేంద్రం టోర్జోక్‌లో ఉంది.

Spread the love