”ఇజ్రాయెల్‌ పెద్ద తప్పు చేసింది” – ట్రంప్‌

జెరుసలేం: ఇజ్రాయెల్‌ అంతర్జాతీయ సమాజం మద్దతును చాలా కోల్పోతోంది, దాని ప్రతిష్ట మరింత దిగజారడానికి ముందే అది గాజాలో యుద్ధాన్ని ముగించాలని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించాడు. ఈ వ్యాఖ్యలు యూదు రాజ్యంపై ట్రంప్‌ చేసిన అరుదైన విమర్శగా భావిస్తున్నారు. అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి చేసినట్లుగా యుఎస్‌పై దాడి చేస్తే తాను మీరు చేసిన విధంగానే ప్రవర్తిస్తానని సోమవారం పాక్షికంగా ప్రచురించబడిన ఇజ్రాయెల్‌ హయోమ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ అన్నాడు. అయినప్పటికీ, గాజాలోని పౌరుల ఇళ్లను ఇజ్రాయెల్‌ సామూహికంగా ధ్వంసం చేయడం చాలా పెద్ద తప్పు అని ట్రంప్‌ అన్నాడు.
అమెరికా అధ్యక్షుడిగా వున్న కాలంలో ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి బెంజమిన్‌ నెతన్యాహుకు ట్రంప్‌ సన్నిహిత మిత్రుడు. చరిత్రలో అత్యంత ఇజ్రాయెల్‌ అనుకూల అమెరికా అధ్యక్షుడు అని ఆయన తనను తాను అభివర్ణించుకున్నాడు. నెతన్యాహు అభ్యర్థనపై ట్రంప్‌ ఇరాన్‌పై ఆంక్షలు విధించాడు. ఇజ్రాయెల్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని పశ్చిమ జెరూసలేంకు తరలించాడు. బహ్రెయిన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, మొరాకో, సూడాన్‌లతో ఇజ్రాయెల్‌కు సంబంధాలను సాధారణీకరించిన అబ్రహం ఒప్పందాల వెనుక ఆయన కృషి ఉంది. అయితే, 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికలో ట్రంప్‌పై విజయం సాధించినందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను నెతన్యాహు అభినందించిన తర్వాత ఈ సంబంధం దెబ్బతింది. హమాస్‌ దాడికి నెతన్యాహు సిద్ధంగా లేరని అక్టోబర్‌లో ఫాక్స్‌ న్యూస్‌తో మాట్లాడుతూ ట్రంప్‌ పేర్కొన్నాడు. ఆ రోజు తర్వాత జరిగిన ప్రచార కార్యక్రమంలో, నెతన్యాహు తన గూఢచార యంత్రాంగాన్ని ‘ప్రక్షాళన’ చేయాల్సిన అవసరం ఉందని ట్రంప్‌ ప్రకటించాడు. గాజాలో యుద్ధం ఆరవ నెలకు చేరుకున్నందున ఆ యుద్ధాన్ని వెంటనే ముగించాలని ట్రంప్‌ నెతన్యాహును కోరాడు. అంతర్జాతీయంగా మీరు చాలా మద్దతును కోల్పోతున్నారు అని తనను ఇంటర్వ్యూ చేసిన ఇజ్రాయెలీలకు ఆయన చెప్పాడు. ఇజ్రాయెల్‌ హమాస్‌పై పూర్తి విజయం సాధించే వరకు పోరాటం కొనసాగిస్తానని నెతాన్యాహు ప్రతిజ్ఞ చేశాడు. అమెరికా ప్రభుత్వ అభ్యర్ధనలను ధిక్కరిస్తూ ప్రస్తుతం పది లక్షల కంటే ఎక్కువ మంది స్థానభ్రంశం చెందిన గాజా పౌరులకు నివాసంగా వున్న రఫా నగరంపై దాడి చేస్తానని వాగ్దానం చేశాడు.
గాజాలో తక్షణ కాల్పుల విరమణను డిమాండ్‌ చేస్తూ ఐక్య రాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాన్ని ఆమోదించిన తరువాత, ప్రణాళికాబద్ధమైన రఫా ఆపరేషన్‌ గురించి చర్చించడానికి ఇజ్రాయెల్‌ ప్రతినిధి వర్గం సోమవారంనాడు చేయవలసిన వాషింగ్టన్‌ పర్యటనను ఇజ్రాయెల్‌ రద్దు చేసుకుంది. ఎల్లవేళలా వెనుకాముందు చూడకుండా ఇజ్రాయెల్‌కు మద్దతునిచ్చే అమెరికా తన వీటో హక్కును వినియోగించకుండా ఓటింగ్‌కు దూరంగా ఉన్నందువల్లనే ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్‌ పైన చేసిన తీర్మానం ఆమోదించబడింది. గాజాలో నెతన్యాహు ప్రవర్తనపై అమెరికా అసంతృప్తికి నిదర్శనంగా ఇది ఉందని నిష్ణాతులు భావిస్తున్నారు.

Spread the love