దళిత సంక్షేమం ఎక్కడీ

– 27 పథకాలు రద్దుచేశారు
– ఏడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని జగన్‌కు సవాల్‌ : అనంత ప్రజాగళం సభలో నారా చంద్రబాబునాయుడు
అనంతపురం: రాష్ట్రంలో దళిత సంక్షేమం ఎక్కడుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. . మదనపల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో గురువారం అనంతపురం విచ్చేసిన చంద్రబాబు మొదట రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు మండల కేంద్రంలో జరిగిన ప్రజాగళం సభలో పాల్గొన్నారు. అనంతరం శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో, కదిరి పట్టణంలో నిర్వహించిన సభల్లో పాల్గొన్నారు. ఆయా సభల్లో చంద్రబాబు ప్రసంగిస్తూ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేశానని చెప్పుకుంటున్న జగన్‌మోహన్‌రెడ్డి దళితుల సంక్షేమానిన విస్మరించారని చెప్పారు. 27 రకాల దళిత సంక్షేమ పథకాలను జగన్‌ రద్దు చేశారని అన్నారు. ఎస్‌సి సబ్‌ ప్లాన్‌ నిధులను సైతం దారి మళ్లించారని మండిపడ్డారు. ఆరు వేల మంది దళితులపై తప్పుడు కేసులు బనాయించారని, 180 మంది దళితులు వైసిపి హయాంలో హత్యకు గురయ్యారన్నారు. 90 శాతం హమీలు నెరవేర్చానని చెబుతున్న జగన్‌.. తన ఏడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్‌ విసిరారు. ప్రత్యేక హోదా, సిపిఎస్‌ రద్దు, మద్య నిషేధం, ఏటా జాబ్‌ క్యాలెండర్‌, మెగా డిఎస్‌సి, కరెంటు ఛార్జీల తగ్గింపు, పోలవరం పూర్తి తదితర హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే గోదావరి జలాలను రాయలసీమకు తీసుకువస్తామని చెప్పారు. వైఎస్‌ వివేకాను ఎవరో హత్య చేసి తనపై బనాయించే ప్రయత్నం చేస్తున్నారని సిఎం జగన్‌ మాయమాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. పెనుకొండ వద్ద తమ హయాంలో కియా పరిశ్రమను తీసుకొస్తే… జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో జాకీ పరిశ్రమ పక్క రాష్ట్రానికి తరలివెళ్లిందని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే తొలి సంతకం మెగా డిఎస్‌సిపైనే చేయనున్నట్టు హామీనిచ్చారు.

Spread the love