అభివృద్ధి – సంక్షేమం చేసి చూపించాం

– అధర్మంపై ధర్మ యుద్ధానికి సిద్ధం కండి : నంద్యాల సభలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి
కర్నూలు: ఐదేళ్ల తమ పాలనలో ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి, సంక్షేమం చేసి చూపించామని రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. ‘మేమంతా సిద్ధం’ పేరుతో ఆయన చెప్పట్టిన బస్సు యాత్ర రెండో రోజు నంద్యాల జిల్లాలో సాగింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో గురువారం బస్సు యాత్ర ప్రారంభమైంది. సిరివెళ్ళ మండలం ఎర్రగుంట్లలో గ్రామస్తులతో జగన్‌ ముఖాముఖి నిర్వహించారు. గ్రామానికి వైసిపి ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. అనంతరం యాత్ర నంద్యాలకు చేరుకుంది. నంద్యాల డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో జగన్‌ మాట్లాడుతూ . ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్‌ ఇస్తున్నామని, లంచాలు, వివక్ష లేకుండా పాలన అందిస్తున్నామని తెలిపారు. నాడు-నేడుతో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చామని గుర్తు చేశారు. ఇన్ని చేస్తున్న ఒక్క జగన్‌ను ఎదుర్కునేందుకు ఎన్నో కుట్రలు సాగుతున్నాయ చెప్పారు. కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధం కావాలన్నారు. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు సాధించి డబుల్‌ సెంచరీ సర్కారును ఏర్పాటు చేయాలన్నారు. అధర్మంపై ధర్మ యుద్ధానికి సిద్ధం కావాల్సిన సమయం వచ్చిందన్నారు.

Spread the love