గ్లోబల్‌ జెండర్‌ ఇండెక్స్‌లో భారత్‌కు 127వ ర్యాంకు

–  పాక్‌ మినహా పొరుగు దేశాల ప్రదర్శన మనకంటే మెరుగు : డబ్ల్యూఈఎఫ్‌ నివేదిక
న్యూఢిల్లీ : భారత్‌ లింగ సమానత్వం పరంగా ప్రపంచవ్యాప్తంగా 146 దేశాలకు గానూ 127వ ర్యాంకును పొందింది. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ (డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక లింగ వ్యత్యాస నివేదిక, 2023లో ఈ విషయం వెల్లడైంది. గతేడాది భారత ర్యాంకు 135గా ఉన్నది. ఆర్థిక భాగస్వామ్యం, అవకాశాలపై భారత్‌ కేవలం 36.7 శాతం సమానత్వానికి చేరుకున్నదని నివే దిక నొక్కి చెప్పింది. లింగ సమానత్వం విషయంలో భారత్‌కు పొరుగు దేశా లైన చైనా (107వ ర్యాంకు), బంగ్లాదేశ్‌ (59), నేపాల్‌ (116), శ్రీలంక (115) , భూటాన్‌ (103)లు మనకంటే మంచి ర్యాంకులు సాధించి మెరుగైన ప్రదర్శ నను కనబర్చటం గమనార్హం. పాకిస్థాన్‌ ర్యాంకు మాత్రం 142గా ఉన్నది.
ఐస్‌ల్యాండ్‌లో అత్యధిక లింగ సమానత్వం
ఐస్‌ల్యాండ్‌ వరుసగా 14వ సంవత్సరం ప్రపంచంలో అత్యధిక లింగ సమానత్వం కలిగిన దేశంగా నిలిచింది. 90 శాతం కంటే ఎక్కువ లింగ వ్యత్యాసానికి ఇది ముగింపు పలికింది. భారత్‌లో వేతనాలు, ఆదాయాలలో సమానత్వం ఉన్నప్పటికీ.. సీనియర్‌ స్థానాలు, సాంకేతిక పాత్రలలో మహిళల సంఖ్య గతం నుంచి కొద్దిగా పడిపోయిందని నివేదిక ఎత్తి చూపింది. రాజకీయ సాధికారతపై భారత్‌ 25.3 శాతం సమానత్వాన్ని నమోదు చేసింది. మహిళలు 15.1 శాతం మంది పార్లమెంటేరియన్‌లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొత్తమ్మీద దక్షిణాసియా ప్రాంతం 63.4 శాతం లింగ సమానత్వాన్ని సాధించింది.
భారత్‌లో మహిళా మంత్రుల సంఖ్య ఏడు శాతం కంటే తక్కువ
భారత్‌లో మహిళా మంత్రుల సంఖ్య ఏడు శాతం కంటే తక్కువగా ఉన్నది. అజర్‌బైజాన్‌, సౌదీ అరేబియా, లెబనాన్‌ వంటి దేశాల్లో ఎవరూ లేకపోవట గమనార్హం. మొత్తమ్మీద ప్రపంచవ్యాప్తంగా లింగ సమానత్వం కోవిడ్‌ పూర్వస్థాయికి పుంజుకున్నదని నివేదిక పేర్కొన్నది. ఏ దేశమూ ఇంకా పూర్తి లింగ సమానత్వాన్ని సాధించనప్పటికీ.. మొదటి తొమ్మిది దేశాలు తమ అంతరాన్ని కనీసం 80 శాతం తగ్గించుకున్నాయి. ఆర్థిక భాగస్వామ్యం మరియు అవకాశం, విద్యా సంబంధమైన నైపుణ్యం, ఆరోగ్యం మరియు మనుగడ, రాజకీయ సాధికారత అనే నాలుగు రంగాలలో లింగ ఆధారిత అంతరాల పరిణామాన్ని గ్లోబల్‌ జెండర్‌ గ్యాప్‌ రిపోర్టు ప్రస్తుత 17వ ఎడిషన్‌లో పరిగణలోకి తీసుకున్నది.

Spread the love