ప్ర‌పంచ‌ం పాస్‌పోర్ట్ ర్యాంకుల్లో భారత్ స్థానం ఎంతంటే ?

నవతెలంగాణ – న్యూఢిల్లీ: ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆరు దేశాల పాస్‌పోర్టులు అత్యంత శ‌క్తివంత‌మైన‌విగా హెన్లే పాస్‌పోర్ట్ ఇండెక్స్ పేర్కొన్న‌ది. టాప్ ర్యాంకులో ఫ్రాన్స్‌, జ‌ర్మ‌నీ, ఇట‌లీ, జ‌పాన్‌, సింగ‌పూర్‌, స్పెయిన్ దేశాలు ఉన్నాయి. ఈ పాస్‌పోర్టులు ఉన్న‌వాళ్లు 194 దేశాల‌కు వీసా లేకుండానే ఎంట్రీ ఇవ్వొచ్చు. ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేష‌న్ ఇచ్చిన డేటా ఆధారంగా ఈ ర్యాంక్‌ల‌ను ప్ర‌క‌టించారు. గ‌త అయిదేళ్ల నుంచి జ‌పాన్‌, సింగ‌పూర్ దేశాల మ‌ధ్య‌ నెంబ‌ర్ వ‌న్ స్థానం కోసం పోటీ ఉండేది. అయితే ఈసారి యురోపియ‌న్ దేశాలు ర్యాంకుల్లో మెరుగైన‌ట్లు తెలుస్తోంది. ఫిన్‌ల్యాండ్, స్వీడెన్‌, సౌత్ కొరియా దేశాలు సంయుక్తంగా రెండో ర్యాంక్‌లో ఉన్నాయి. ఈ దేశ పాస్‌పోర్టులు ఉంటే 193 దేశాల‌కు వీసా లేకుండా వెళ్ల‌వ‌చ్చు. ఆస్ట్రియా, డెన్మార్క్‌, ఐర్లాండ్‌, నెద‌ర్లాండ్స్ దేశాలు మూడ‌వ స్థానంలో ఉన్నాయి. ఈ దేశాల పాస్‌పోర్ట్ ఉంటే 192 దేశాల‌కు వీసా లేకుండా వెళ్ల‌వ‌చ్చు. తాజా ర్యాంకుల్లో ఇండియా పాస్‌పోర్ట్ 80వ స్థానంలో ఉన్న‌ది. ఇండియా పాస్‌పోర్ట్ ఉన్న‌వాళ్లు 62 దేశాల‌కు వీసా లేకుండానే వెళ్ల‌వ‌చ్చు. ర్యాంకింగ్‌లో పొరుగు దేశం పాకిస్థాన్ 101వ స్థానంలో ఉన్న‌ది.

Spread the love