గళమెత్తనున్న టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకుని 12 ఏండ్లు గడిచిన తర్వాత కూడా కష్ణా జలాల వినియోగంలో తెలంగాణ వెనుకబడి ఉండటానికి పాలకుల లోపభూయిష్ట విధానాలే కారణమని తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) అధినేత కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఈ అంశంపై ఈ మేరకు సోమవారం పోస్టర్‌ను విడుదల చేశారు. పాలమూరు గడ్డ మీది నుంచే రాజకీయంగా మొదటి అడుగు వేయనున్నామని తెలిపారు. ఈనెల 8న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి కష్ణా జలాల సాధనకు శంఖారావం పూరించనున్నారు. పాలమూరు — రంగారెడ్డి ప్రాజెక్టులో ప్రతిపాదించిన కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సమీపంలోని చౌదరిగూడెం వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. టీఆర్‌ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత తన మొదటి ప్రాధాన్యతగా కష్ణా జలాల సాధనకు శ్రీకారం చుట్టారు. కష్ణా, గోదావరి నీళ్లను సమర్థవంతంగా వినియోగించుకుంటూ మన బీళ్లకు మళ్లించుకునేందుకు తమ వద్ద స్పష్టమైన విధానాలు ఉన్నాయని కూడా ప్రకటించారు. ఈ క్రమంలోనే కష్ణా నీళ్ల సాధన కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించే దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదట శంకుస్థాపన చేసిన పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు 11 ఏండ్లు గడిచినా సగం పనులు కూడా పూర్తి చేయకపోవడంపై ”జనంబాట” కార్యక్రమంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచి ప్రాజెక్టుకు సత్వర అనుమతులు సాధించడంతో పాటు పనులు వేగంగా పూర్తి చేయించడానికి ఉద్యమ ప్రణాళిక ప్రకటించే దిశగా కవిత అడుగులు వేస్తున్నారు. తెలంగాణకు హక్కుగా దక్కే ప్రతి చుక్క నీటిని బీడు భూములకు మళ్లించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన సీనియర్ నాయకులు నవీన్ ఆచారి, గొంగళ్ల రంజిత్ కుమార్, సయ్యద్ ఇస్మాయిల్, నరేశ్ ప్రజాపతి, ఎదురుగట్ల సంపత్ గౌడ్, సీమ రమేశ్, బుచ్చిబాబు, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



