వివిధ దేశాల ప్రతినిధులకు ఆహ్వానం
ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల సందర్శన : సమీక్షలో మంత్రి దామోదర రాజనర్సింహా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రపంచ వైద్య పర్యాటక కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడంలో భాగంగా జూన్‌లో ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం ఈవెంట్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. ఈవెంట్ నిర్వాహణ కోసం పర్యాటకశాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఆరోగ్య, పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అందులో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, డాక్టర్ సంగీత సత్యానారాయణ, టీజీఎంఎస్‌ఐడీసీ ఎమ్‌డీ డాక్టర్ గౌరవ్ ఉప్పల్, ఆరోగ్యశాఖ, పర్యాటక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ..
సీఎం సూచనల మేరకు ఇక నుంచి ఏటా ఒక మెడికల్ టూరిజం ఈవెంట్ నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈవెంట్‌లో దేశ, విదేశీ వైద్య, ఫార్మా రంగ ప్రముఖులను భాగస్వాములను చేయాలని సూచించారు. మెడికల్ టూరిజంలో ఉన్న ప్రయివేటు సంస్థలను సైతం భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు. ఆఫ్రికా, ఆసియా, మిడిల్ ఈస్ట్ తదితర దేశాల నుంచి ప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. హైదరాబాద్‌లోని నిమ్స్, టిమ్స్, ఉస్మానియా, గాంధీ వంటి ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రయివేటు, కార్పొరేటు ఆస్పత్రులను సందర్శిం చేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న మూడు టిమ్స్ ఆస్పత్రుల్లో 50 బెడ్ల చొప్పున ఇంటర్నేషనల్ పేషెంట్ సర్వీసెస్ విభాగాలను ఏర్పాటు చేయాలన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో 2322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన వారికి మే 12న ఇంటర్నేషన్ నర్సెస్‌డే సందర్భంగా నియామక పత్రాలు అందజేసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రయివేటు మెడికల్ కాలేజీల్లో జరుగుతున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీపైనా చర్చించారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో భర్తీ చేస్తున్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో భర్తీ చేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, ఫార్మసిస్ట్ పోస్టులు, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ ప్రక్రియపై మంత్రి ఆరా తీశారు. వచ్చే నెల 15 నాటికి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసి, ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు మంత్రికి హామీనిచ్చారు. ఫార్మసిస్ట్, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో నెలకొన్న లీగల్ చిక్కులను పరిష్కరించి, భర్తీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
జూన్‌లో ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం ఈవెంట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



