– న్యూ ఇయర్ వేడుకల వేళ..
– మందుబాబులపై కొరడా ఝళిపించిన పోలీసులు
– మూడు కమిషనరేట్ల పరిధిలో డ్రంకన్ డ్రైవ్‌లు… చిక్కిన 3,000 మందికిపైగా..
నవతెలంగాణ-సిటీబ్యూరో
సందర్భం ఏదైనా.. హంగామా ఒక్కటే.. 2023కి గుడ్‌బై చెబుతూ.. 2024 సంవత్సరానికి.. ప్రజలు గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పారు. అందులో భాగంగా హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధుల్లో వేడుకలు అట్టహాసంగా కొనసాగాయి. ఇదిలావుండగా వేడుకల్లో కొందరు మద్యం సేవించి హంగామా సృష్టిస్తారని గత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న పోలీస్ అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని చర్యలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడుపొద్దంటూ ముందు నుంచే అధికారులు హెచ్చరిస్తూ వచ్చారు. మద్యం సేవిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడంతో నియంత్రణ కోల్పోతారని, ఈ క్రమంలోనే అధిక శాతం రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పదేపదే చెప్పుతూ వచ్చారు. అయినా కొందరు వాహనదారులు పోలీసుల సూచనలను పట్టించుకోలేదు. పట్టుకున్నప్పుడు చూద్దాంలే అంటూ పీకలదాక మద్యం సేవించి వాహనాలపై దూసుకెళ్లారు. ఈ క్రమంలో హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 1760 మంది పోలీసులకు చిక్కారు.
1760 మందికిపైగా కేసులు
న్యూఇయర్ వేడుకల సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు నగరంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, నాంపల్లి, నారాయణగూడ, కాచిగూడ, మీర్‌చౌక్, అంబర్‌పేట్, చార్మినార్, నెక్లెస్ రోడ్‌తోపాటు మరో 31 ప్రాంతాల్లో ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి మందు బాబులపై కొరఢా ఝులిపించారు. డిసెంబర్ 31 అర్థరాత్రి నుంచి 1వ తేదీ తెల్లారే వరకు హైదరాబాద్, రాచకొండ రెండు కమిషనరేట్ల పరిధిల్లో 1760కి పైగా మద్యం ప్రియులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1243 మంది మద్యం ప్రియులు నగరంలో పోలీసులకు చిక్కారు. అందులో 1066 ద్విచక్రవాహనదారులు కాగా, 42 మంది ఆటో డ్రైవర్లు, 135 మంది కార్లు నడిపినవారు ఉన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్, వనస్థలిపురం, ఇబ్రాహీంపట్నం, ఉప్పల్, మల్కాజ్‌గిరి, కుషాయిగూడ, చౌటుప్పల్, భువనగరి, యాదాద్రి డివిజన్‌ల పరిధిలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 517 మంది వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు చిక్కారు. వీరిలో ద్విచక్రవాహనదారులు 431 మంది కాగా 10 మంది ఆటోవాలాలు, 76 మంది కారు నడిపిన వారు ఉన్నారు. వీరందరికి కౌన్సిలింగ్ నిర్వహించి, కోర్టులో ప్రవేశపెడతామని ఆయా కమిషనర్లు తెలిపారు.