ఐపీఎల్‌ పండగొచ్చె!

IPL festival!– నేటి నుంచి ఐపీఎల్‌ 17 షురూ
– ఆరంభ మ్యాచ్‌లో చెన్నై, బెంగళూర్‌ ఢీ
అతిపెద్ద వేసవి వినోదం, అభిమానులు ఏడాది పాటు ఎదురుచూసే పరుగుల పండుగ వచ్చేసింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 17వ సీజన్‌ క్రికెట్‌ ప్రపంచాన్ని ఉర్రూతలూగించేందుకు సిద్ధమైంది. పది జట్లు పోటీపడే పాపులర్‌ గ్లోబల్‌ టీ20 లీగ్‌ ఐపీఎల్‌ నేటి నుంచి ఆరంభం కానుంది. చెన్నై చెపాక్‌ స్టేడియంలో సూపర్‌కింగ్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ ఆరంభ మ్యాచ్‌లో ఢీకొీట్టనున్నారు.
10 జట్లు, 74 మ్యాచులు, ఓ టైటిల్‌. పొట్టి ఫార్మాట్‌లో టీ20 ప్రపంచకప్‌ మేనియాను మించిపోతున్న ఐపీఎల్‌ టైటిల్‌ను అందుకునేందుకు ఈ సీజన్‌లో సైతం పది జట్లు పోటీపడుతున్నాయి. మరోసారి ఐపీఎల్‌ విజేతగా నిలిచేందుకు ఆరు జట్లు సిద్ధమవుతుండగా… కనీసం ఒక్కసారైనా ఆ టైటిల్‌ను ముద్దాడాలని నాలుగు జట్లు తపన పడుతున్నాయి.
నవతెలంగాణ-చెన్నై
ధనాధన్‌కు వేళాయే. పరుగుల పండుగ వచ్చేసింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 17వ సీజన్‌ నేటి నుంచి ఆరంభం. చెన్నైలోని ఎం.ఏ చిదంబరం స్టేడియంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ సీజన్‌ తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఆరంభ మ్యాచ్‌ రాత్రి 8 గంటలకు ఆరంభం కానుండగా.. మిగతా మ్యాచులు 7.30 గంటలకే షురూ అవుతాయి. ఐపీఎల్‌ సీజన్‌కు ఆరంభ వేడుకలు ఆది నుంచి ప్రత్యేకం. ఈ సీజన్‌కు సైతం బీసీసీఐ ఆరంభ వేడుకలను ఘనంగా ప్రణాళిక చేసింది. దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ బాణీలు, బాలీవుడ్‌ నటులు అక్షరు కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌ నృత్య ప్రదర్శన ఆరంభ వేడుకలకు ప్రధాన ఆకర్షణగా నిలువనుంది. ప్రముఖ బాలీవుడు గాయకులు, దక్షిణాది గాయకులు నేడు చెపాక్‌లో ఆటపాటలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
కప్పు కల తీరేనా?
ఐసీసీ ప్రపంచకప్‌ సాధించాలని ప్రతి క్రికెటర్‌ కలలు కంటాడు. ఇప్పుడు ఆ స్థాయిలో ప్రతి క్రికెటర్‌ ఐపీఎల్‌ టైటిల్‌ అందుకోవాలని స్వప్నిస్తున్నాడు. భారత క్రికెట్‌ కింగ్‌ విరాట్‌ కోహ్లి సైతం ఈ జాబితాలోనే ఉన్నాడు. 16 సీజన్లుగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విరాట్‌ కోహ్లి ఇప్పటివరకు ఒక్క టైటిల్‌ అందుకోలేదు. 16 ఏండ్ల ఐపీఎల్‌ చరిత్రలో నాలుగు జట్లు ఇప్పటివరకు టైటిల్‌ను తాకలేదు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌, లక్నో సూపర్‌జెయింట్స్‌ తొలి కప్పు వేటలో ఉన్నాయి. ఇందులో లక్నో సూపర్‌జెయింట్స్‌ మాత్రమే రెండు సీజన్ల నుంచి ఐపీఎల్‌లో పోటీపడుతుండగా.. మిగతా మూడు జట్లు ఐపీఎల్‌ ఆరంభం నుంచి టైటిల్‌ కోసం పోరాడుతున్నాయి. నాయకత్వ బాధ్యతల నుంచి విరాట్‌ కోహ్లి తప్పుకున్నా.. ఆ జట్టు టైటిల్‌ ఆశల భారం అతడే మోస్తున్నాడు. ఈ ఏడాది మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో ఆర్సీబీ మహిళల జట్టు చాంపియన్‌గా నిలిచింది. ఆ స్ఫూర్తితో కోహ్లి అండ్‌ కో సైతం టైటిల్‌ సాధిస్తారనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తుంది. ఇక పలుమార్లు గ్రూప్‌ దశలో అగ్రజట్టుగా నిలిచినా టైటిల్‌కు ఆమడ దూరంలో నిలిచిన జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌. నాయకత్వంతో పాటు జట్టు పేరులో మార్పు చేసినా.. కప్పు మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది. అసమాన పునరాగమనం చేస్తున్న రిషబ్‌ పంత్‌.. ఈ ప్రయాణంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు తొలి టైటిల్‌ అందిస్తాడనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌, రిషబ్‌ పంత్‌ అభిమానుల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. పంజాబ్‌ కింగ్‌ కథ ఓ వ్యథ. చీఫ్‌ కోచ్‌ నుంచి కెప్టెన్సీ బాధ్యతల వరకు ఆ జట్టు చేయని ప్రయోగం లేదు. ఆఖరుకు కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ నుంచి పంజాబ్‌ కింగ్స్‌గా పేరు మార్చుకున్నారు. అయినా, ఎటువంటి ఫలితం లేదు. ప్రతీ జింటా జట్టు ఈసారైనా టైటిల్‌ కొడుతుందేమో చూడాలి. కొత్త జట్టు లక్నో సూపర్‌జెయింట్స్‌ రెండు సీజన్లలో ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. కెఎల్‌ రాహుల్‌, గౌతం గంభీర్‌ ద్వయం సూపర్‌ జెయింట్స్‌ను లీగ్‌లో ఆకర్షణీయ జట్టుగా నిలిపారు. ఈ సీజన్‌లో గౌతం గంభీర్‌ దూరమయ్యాడు. గతంలో పుణె సూపర్‌ జెయింట్స్‌ జట్టుతో టైటిల్‌ వేటలో ఆఖరు అడుగులో బోల్తాపడిన యాజమాన్యం ఇప్పుడు లక్నో సూపర్‌జెయింట్స్‌తోనైనా ఆ కల తీర్చుకుంటారేమో చూడాలి.
మరోసారి కొట్టాలని..!
ఐపీఎల్‌లో ఓ కప్పు నెగ్గినా చాలు అనుకునే జట్లు ఓ వైపు ఉండగా.. వరుసగా టైటిళ్లు సాధిస్తూ వెళ్తున్న జట్లు మరోవైపు ఉన్నాయి. ఐపీఎల్‌ టైటిల్‌ వేటలో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్‌కింగ్స్‌, ముంబయి ఇండియన్స్‌ ముందువరుసలో ఉంటాయి. చెన్నై సూపర్‌కింగ్స్‌ 14 సీజన్లలో ఏకంగా ఐదు టైటిళ్లు సాధించగా, ముంబయి ఇండియన్స్‌ 16 సీజన్లలో ఐదు ట్రోఫీలు సొంతం చేసుకుంది. చెన్నై సూపర్‌కింగ్స్‌ ఎం.ఎస్‌ ధోని నాయకత్వంలో ఐదు ట్రోఫీలు నెగ్గగా.. ముంబయి ఇండియన్స్‌ రోహిత్‌ శర్మ సారథ్యంలో ఆ ఘనత సాధించింది. ఐపీఎల్‌ 17లో ఎం.ఎస్‌ ధోని, రోహిత్‌ శర్మలు నాయకత్వ బాధ్యతలకు దూరమైనా.. ఆ రెండు జట్లు టైటిల్‌ వేటకు చేరువగానే ఉన్నాయి. ఈ సీజన్‌ టైటిల్‌ రేసులో చెన్నై సూపర్‌కింగ్స్‌, ముంబయి ఇండియన్స్‌ సహజంగానే హాట్‌ ఫేవరేట్లుగా ఉన్నాయి. కోల్‌కత నైట్‌రైడర్స్‌ ఐపీఎల్‌లో రెండు టైటిళ్లు సాధించింది. గౌతం గంభీర్‌ సారథ్యంలో నైట్‌రైడర్స్‌ చాంపియన్‌గా నిలిచింది. ఇటీవల యువ నాయకత్వంతో ప్రయోగం చేసిన కోల్‌కత నైట్‌రైడర్స్‌ ఆశించిన ఫలితాలు సాధించలేదు. దీంతో గౌతం గంభీర్‌ను నైట్‌రైడర్స్‌ చీఫ్‌ మెంటార్‌గా తీసుకుంది. రెండు ట్రోఫీలు అందించిన సారథి ఇప్పుడు తెరవెనుక రథ సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు. దీంతో కోల్‌కత నైట్‌రైడర్స్‌ శిబిరం మరోసారి టైటిల్‌పై కన్నేసింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ ఐపీఎల్‌ మాజీ చాంపియన్లు. ఐపీఎల్‌ ట్రోఫీ సాధించినా.. ఈ రెండు జట్లు ఎన్నడూ ఓ సీజన్‌ను టైటిల్‌ ఫేవరేట్‌గా మొదలుపెట్టలేదు. అందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈ సీజన్‌ అందుకు మినహాయింపు కాదు. సంజు శాంసన్‌ సారథ్యంలో రాయల్స్‌ గత రెండు సీజన్లుగా ఆకట్టుకునే ప్రదర్శన చేస్తుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో విశేష విజయాలు సాధించిన పాట్‌ కమిన్స్‌కు కెప్టెన్సీ అప్పగించిన సన్‌రైజర్స్‌.. ఈ సీజన్‌లో మళ్లీ కప్పు కొట్టాలని తపిస్తోంది. ఎస్‌ఏ20 లీగ్‌లో వరుసగా రెండు సీజన్లుగా చాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్‌ ప్రాంఛైజీ.. ఐపీఎల్‌లోనూ ఆ గెలుపు మంత్ర అమలు చేయాలని చూస్తోంది. గుజరాత్‌ టైటాన్స్‌ తొలి రెండు సీజన్లలోనే తడాఖా చూపించింది. హార్దిక్‌ పాండ్య సారథ్యంలో టైటాన్స్‌ అంచనాలను మించి రాణించింది. అరంగేట్ర సీజన్లోనే చాంపియన్‌గా నిలిచి, రెండో సీజన్లో రన్నరప్‌గా నిలిచింది. ఈ సీజన్‌కు హార్దిక్‌ పాండ్య నాయకత్వ సేవలు దూరమయ్యాయి. తెరవెనుక యంత్రాంగం కొనసాగుతుండగా.. శుభ్‌మన్‌ గిల్‌ కెప్టెన్‌గా వచ్చాడు. ఈ సీజన్లో టైటాన్స్‌కు కఠిన పరీక్ష ఎదురుకానుంది.
ఈగల్స్‌ వేట 23 నుంచి!
నేడు చెపాక్‌లో చెన్నై, బెంగళూర్‌ మ్యాచ్‌తో ఐపీఎల్‌ 17వ సీజన్‌ టైటిల్‌ వేట షురూ కానుండగా.. ఆరెంజ్‌ ఆర్మీ మరుసటి రోజు తన టైటిల్‌ వేటను మొదలెట్టనుంది. ఈగల్స్‌ ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌ను శనివారం ఆడనుంది. కోల్‌కత ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. సొంత గడ్డపై ఈనెల 27న ముంబయి ఇండియన్స్‌తో తలపడనుంది. హైదరాబాద్‌ వేదికగా జరిగే ముంబయి ఇండియన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌ టికెట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయి. తొలి దశ షెడ్యూల్‌లోనే ఏప్రిల్‌ 5న చెన్నై సూపర్‌కింగ్స్‌తో సన్‌రైజర్స్‌ ఉప్పల్‌ వేదికగా తలపడనుంది. తొలి నాలుగు మ్యాచుల్లో వరుసగా కోల్‌కత నైట్‌రైడర్స్‌, ముంబయి ఇండియన్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ వంటి అగ్రజట్లతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఢకొీట్టనుంది.

Spread the love