ఎన్నికల్లో అక్రమాలను అరికట్టాలి

Irregularities in elections should be stopped– పారదర్శకంగా నిర్వహించాలి: ఈసీకి సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం డిమాండ్‌ చేసింది. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీని అరికట్టాలని కోరింది. మంగళవారం హైదరాబాద్‌లో కేంద్ర ఎన్నికల కమిషన్‌ రాజకీయ పార్టీలతో సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి జ్యోతి, డిజి నరసింహారావు, సీనియర్‌ నాయకులు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి పాల్గొన్నారు. వివిధ అంశాలపై వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో నంద్యాల నర్సింహారెడ్డి, డిజి నరసింహారావు మాట్లాడుతూ 2018లో అసెంబ్లీ, 2019లో పార్లమెంటు ఎన్నికల్లో ఉత్పన్నమైన సమస్యలు పునరావృతం కాకుండా ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లో ఓటరు జాబితాలో ఇబ్బందులొచ్చాయని చెప్పారు. అదే సమయంలో ఇక్కడ పోలింగ్‌ తక్కువగా నమోదైందని అన్నారు. ఎన్నికల సందర్భంగా డబ్బును జప్తు చేశారని వివరించారు. వాటిపై ఏం చర్యలు తీసుకున్నారో ఈసీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఓటరు జాబితాను సమగ్రంగా రూపొందించాలని కోరారు. ఒక్కొక్కరికీ రెండు, మూడు ఓట్లు లేకుండా చూడాలని సూచించారు.
ఒక మనిషికి ఒక ఓటు ఉండాలన్నారు. దీంతో శాంతిభద్రతల సమస్య లేకుండా ఉంటుందని చెప్పారు. హైదరాబాద్‌లో పోలింగ్‌ తగ్గడానికి ఇక్కడ ఉంటే వారికి రెండు చోట్ల ఓట్లుండడం, పోలింగ్‌ బూత్‌లపై అవగాహన లేకపోవడమే కారణమని అన్నారు. క్రిమినల్‌ కేసు ఉండనే పేరుతో ఎన్నికల ఏజెంట్‌, లెక్కింపు ఏజెంట్‌గా ఉండనివ్వడం లేదన్నారు. నిబంధనల ప్రకారం క్రిమినల్‌ కేసు రుజువై శిక్ష పడిన వారినే ఏజెంట్‌గా నియమించడానికి వీల్లేదని చెప్పారు. కేసు ఉన్నంత మాత్రాన నేరస్తులు కాదనీ, దీన్ని ఈసీ గుర్తించాలని కోరారు. ఎన్నికల సమయంలో అవినీతి, డబ్బు, మద్యం పంపిణీ విచ్చలవిడిగా సాగుతున్నదని విమర్శించారు. నిబంధనలను ఉల్లంఘించి పలు రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఖర్చు చేస్తున్నారని అన్నారు. వాటిమీద ఈసీ చర్యలు తీసుకోవడం లేదన్నారు. సాంకేతికంగా న్యాయం చేస్తున్నామంటూ అధికారులు చెప్తున్నారని వివరించారు. ఇప్పటికే కొందరు అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ రూపాల్లో ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు.
దుబ్బాకలో ఓ పార్టీకి చెందిన అభ్యర్థి చీరలు పంచారని గుర్తు చేశారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అధికారం, డబ్బు, మద్యంను నియంత్రించాలని కోరారు. అధికారులు పక్షపాతంతో కాకుండా నిష్పక్షపాతంతో వ్యవహరించాలని చెప్పారు. ఆస్తులు, క్రిమినల్‌ కేసులకు సంబంధించిన వివరాలను అభ్యర్థులతోపాటు ఈసీ కూడా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. 80 ఏండ్లు దాటిన వృద్ధుల ఇంటివద్దకే వెళ్లి ఓటును తీసుకోవాలని ఈసీ నిర్ణయించడాన్ని స్వాగతించామని అన్నారు. వికలాంగులు వరుసక్రమంలో నిలబడకుండా నేరుగా వెళ్లి ఓటేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ అంశాలపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషన్‌ అధికారులు సమాధానమిచ్చారని చెప్పారు.

Spread the love