గాలివాటమేనా?

– ఎంఐఎం 50సీట్లలో పోటీ చేస్తుందా?
– పాత బస్తీకే పరిమితమవుతుందా?
– అక్బరుద్దీన్‌ మాటల వెనుక అంతర్యమేంటి?
– బీఆర్‌ఎస్‌తో ఒప్పందం కుదరినట్టేనా?
– ముస్లిం ఓటర్లు ఎటువైపు…
– చర్చనీయాంశంగా తాజా రాజకీయాలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో మైనార్టీలు బలంగా ఉన్న 50 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ఆ పార్టీ నేత అక్బరుద్దీన్‌ గంభీరంగా ప్రకటించారు. కానీ ఎంత ధీమాగా ప్రకటించారో అంతే వేగంగా వెనక్కి వెళ్లిపోయినట్టు కనిపిస్తున్నది. ఆ పార్టీ తిరిగి ఒక ఎంపీ, 8 అసెంబ్లీ స్థానాలకే పరిమితమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నా యి. 50 సీట్లల్లో పోటీ చేస్తామన్న ఎంఐఎం అకస్మాత్తుగా ఎందుకు మౌనంగా ఉంటుందనేది వెయ్యి డాలర్ల ప్రశ్నగా మారింది. బీఆర్‌ఎస్‌ బలంగా ఉండి మైనార్టీ ఓట్లు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఎంఐఎం పోటీ చేయకూడదనే అభిప్రాయానికొచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌ బలంగా ఉండి మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉన్న చోట ఆ పార్టీని ఓడించేందుకు ఎంఐఎంను రంగంలో దించాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్టు సమాచారం. ఎన్నికల్లో పాత బస్తీకి పరిమితమై…బీఆర్‌ఎస్‌లో కలిసి పోవాలనే ఒప్పందం కుదిరింది కాబట్టే ఎంఐఎం వెనక్కి తగ్గిందనే ప్రచారం జరుగుతున్నది.
అధికార పార్టీకి ఎంఐఎం జై…జై
ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి జై కొట్టే ఎంఐఎం…తాజాగా శాసనసభలో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లను ఆకాశానికెత్తింది. ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసి ప్రయాణం చేయడం లాంఛనమేననే అభిప్రాయం నెలకొంది. రాష్ట్రంలో ఎంఐఎం అక్కడక్కడ పోటీ చేయడం మూలంగా ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే దిశగా చర్చలు జరుగుతున్నాయి. నాడు కాంగ్రెస్‌తో కలిసి ప్రయాణించినా, నేడు బీఆర్‌ఎస్‌తో ప్రయాణిస్తున్నా…పాతబస్తీలో అభివృద్ధి ఏం జరిగిందనేది బేరిజు వేస్తున్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా దూసుకుపోతుందంటూ అధికార పార్టీ చెబుతున్నా…వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కొత్త నగరం అభివృద్ధి అవుతున్నంతగా పాతబస్తీ అభివృధ్ది కావడం లేదనే విమర్శలున్నాయి. అందుకు ఎంఐఎం, అధికార పార్టీ అనుసరిస్తున్న వైఖరే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా ఇటీవల శాసనసభ సమావేశాల్లో కారు, గాలిపటం రానున్న ఎన్నికల్లో పరస్పర సహకారం ముందుకు పోతున్నాయనే సంకేతాలే ఇచ్చాయి. ఎంఐఎం శాసనసభ్యులు ఉన్నచోట బీఆర్‌ఎస్‌ బలహీనంగా ఉన్నది. అక్కడే ఎంఐఎం, అధికార పార్టీ కలిసి మెలిసి బాగానే ఉంటున్నాయి.
హైదరాబాద్‌ మినహా ఇతర జిల్లాల్లో ఘర్షణే
జిల్లాల్లో మాత్రం ఈ రెండు పార్టీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతున్నది. ముఖ్యంగా నిజామాబాద్‌ జిల్లా బోధన్‌, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, కామారెడ్డి, రాజేంద్రనగర్‌ తదితర నియోజకవర్గాల్లో ఆ రెండు పార్టీలు నిత్యం విమర్శించుకుంటున్నాయి. బోధన్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యే అభివృద్ధి చేయడం లేదంటూ ఎంఐఎం కార్పొరేటర్‌ బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. మిగతా నియోజకవర్గాల్లోనూ అవే పరిస్థితులున్నాయి.ఈ క్రమంలోనే 50 సీట్లలో పోటీ చేస్తామన్న ఎంఐఎం ప్రకటన కారును కలవరపెట్టిందని ఆ వర్గాలు చెబుతున్నాయి. అలా పోటీ చేస్తే ఓటు చీలిపోయి కాంగ్రెస్‌కు లబ్దిచేకూరుతుందని బీఆర్‌ఎస్‌ అంచనా వేస్తున్నది.
బీజేపీ తరహాలోనే ఎంఐఎం కూడా మతతత్వ పార్టీయే…
బీజేపీ తరహాలోనే ఎంఐఎం కూడా మతతత్వ పార్టీగా గుర్తింపుపొందిందనేది జగమెరిగిన సత్యం. మైనార్టీలను మోజార్టీ వర్గాలకు వ్యతిరేకంగా నిలబెట్టేందుకు రాజకీయ వేదికలను వాడుకుంటున్నది. హిందూ, ముస్లిం మధ్య ఐక్యతను సాధించడం కంటే దూరం పెంచేలా ఎంఐఎం వైఖరి ఉన్నది. గతంలో కొన్ని రాష్ట్రాల్లో ఇది అంతిమంగా బీజేపీ ప్రయోజనాలకే అవకాశమిస్తోంది. బీజేపీయే ఎంఐఎం రంగంలోకి దించడం ద్వారా మైనార్టీ ఓట్లు చీలిపోయి అక్కడ బీజేపీ విజయం సాధించిందనే కథనాలు వెలువడ్డాయి. అప్పట్లో ఇది ముస్లిం ప్రజలను సైతం ఆలోచింపజేసింది. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఆ పరిస్థితులు లేవనే చెప్పొచ్చు. ఎందుకంటే బీజేపీ బలహీనంగా ఉండటమే ఇందుకు కారణం. ఇదిలా ఉండగా బీఆర్‌ఎస్‌, ఎంఐఎం మైత్రి పట్ల కూడా ముస్లిం ప్రజల్లో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముస్లిం ప్రజలు ఎలా స్పందిస్తారో అనేది వేచిచూడాల్సిందే…

Spread the love