నియంతల బలమెప్పడూ ప్రజల భయంలోనే ఉంటుంది. ఆ భయం వీడి ప్రజలు కన్నెర్ర చేస్తే ఆ కాగితపు పులి కాలిపోతుంది. ఇది చారిత్రక సత్యం. ఇప్పుడు ఆ సత్యం మరోసారి రుజువుకాబోతోందా? ముగిసిన మూడు విడతల పోలింగ్ సరళి అవుననే సంకేతమిస్తోంది. నిన్నటిదాకా ఈ సార్వత్రికంలో సైతం తమకు ఎదురేలేదని చెప్పుకున్న ఏలినవారి స్వరం మారుతోంది. ప్రధాని సహా ఇతర ప్రధాన నేతల ప్రసంగాలన్నీ తమకు ఎదురుగాలి వీస్తున్నదని తెలిసిపోయినట్టుగా సాగుతున్నాయి. వారి అసహనంలో కుర్చీ కదులుతోందన్న భయాందో ళనలు కనిపిస్తున్నాయి. బహుశా ఆ భయంతోనే కాబోలు… రాజ్యాంగాన్ని మార్చబోమని, రిజర్వే షన్ల జోలికే రామని స్వయంగా ప్రధానితో సహా పరివారమంతా ప్రకటిస్తోంది. ఇది నమ్మేవారికి కొంత ఊరట కలుగవచ్చేమో గానీ, సంఫ్‌ుపరివార్ వాగ్దాన మేదైనా అది ”అశ్వత్థామ హత: కుంజర:” వంటిదే! ఎందు కంటే… వీరి హిందూత్వ భావజాలానికి పురుడు పోసిన పూర్వీకులంతా నాజీలను ఆరాధించినవారే. ఆ నాజీల నమూనాలోనే ఈ దేశాన్ని హిందూరాజ్యంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నవారే. ఇది రహస్యమేమీ కాదు.
కాకపోతే వారు అధికారం కోసం ఎన్ని కట్టుకథలైనా అల్లగలరు. తమ గుజరాతీ దోస్తులైన అంబానీ, అదానీలకు స్వయంగా ఊడిగం చేస్తూ, దేశ సంపదను దోచిపెడుతూ కూడా ఆ నిందను ప్రత్యర్ధులపై మోపగలరు. నిత్యజీవిత వెతలు అజెండా మీదికి రాకుండా అసత్యాలకు విద్వేషాలను, ఉద్వేగాలను జోడించి ప్రజలను భావోద్వేగాలలో ముంచెత్తగలరు. కానీ ఇప్పుడా పప్పులేవీ ఉడికేటట్టు లేవు. రాముడి చెట్టుకు ఓటు పిందెలు కాసేలా లేవని తేలిపోయాక…. పూర్తిగా అసత్యాలు, అర్ధసత్యాలు, విభజన విద్వేష రాజకీయాల మీదే కేంద్రీకరించారు. సాక్షాత్తూ ప్రధానమంత్రే ప్రారంభించిన ఈ విష ప్రసంగాల పరంపర అంతకంతకూ తీవ్రమవుతోంది. దేశంలో పెచ్చరిల్లుతున్న ఈ ధోరణికి రాజకీయార్థిక పునాదులు ఉన్నట్లుగానే, దానికి సమ్మతిని కూడగట్టే ఒక సాంస్కృతిక పరమైన భావజాల నిర్మాణం కూడా చాలాకాలంగా కొనసాగుతున్నది. అది ”విశ్వగురువు” అనే పేరుతో విశ్వజనీనం కావాలని చూస్తున్నది. సమాజంలో ఒక చెదలు మాదిరిగా వ్యాపిస్తున్నది. మనుషుల్లో ఓ విచ్ఛిన్నకర మానసిక స్థితిని పాదుకొల్పుతున్నది.
ఈ ఎన్నికల కాలంలో ఆ సాంస్కృతికవాదం మరింత ముదిరి పాకాన పడింది. అది కమలనాథుల మాటల్లో మరింత స్పష్టమవుతున్నది. ఎప్పటిలాగే మోడీ తన ”బూచీ” సిద్ధాంతం వల్లించడం మొదలు పెట్టారు. సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగిపోవాలని కాంగ్రెస్ సూత్రప్రాయంగా తన మ్యానిఫెస్టోలో పేర్కొన్న విషయాన్ని వక్రీకరిస్తూ… కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులు కొల్లగొట్టి ముస్లింలకు ఇస్తుందని మెజారిటీ వర్గంలో ఒక అభద్రతను, భయాన్ని తయారుచేస్తున్నారు. చొరబాటుదారులు, అధిక సంతానం కలవారు అంటూ ఒక వర్గం ప్రజలను లక్ష్యంగా చేసుకుని విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారు. అంతే తప్ప ఈ పదేళ్లలో వారు చేసిందేమిటో, తిరిగి అధికారమిస్తే చేయబోయేదేమిటో చెప్పి ఓట్లు అడగలేకపోతున్నారు. తాము ఆర్భాటంగా ప్రకటించిన ‘మోడీకీ గ్యారంటీ సంకల్ప పత్రం’ గురించిన ప్రస్తావన దాదాపు మానేశారు. ఇదిలా సాగుతుండగానే మూడవ విడత పోలింగ్‌తో దాదాపు సగం స్థానాలకు ఎన్నిక పూర్తయింది. పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదైంది. ఇది సహజంగానే పాలకపక్షానికి ప్రతికూల సంకేతం. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అంచనా వేసిన అధికారపక్షం… ఎదురవబోయే ఓటమిని అధిగమించడానికి ఇంకెన్ని పన్నాగాలకు ఒడిగడుతుందో అన్నది చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో గెలుపోటములపై పలు ఊహా గానాలు, ఈవీఎంలపై అనుమానాలతోపాటు ఆసక్తికర మైన అభిప్రాయాలనేకం వ్యక్తమవుతున్నాయి. ఇందులో అధికారం పోతుందేమో అని ఆందోళన చెందేవారు కొందరైతే… ”వాళ్లు మళ్లీ గెలిస్తే…” అంటూ భయాలను వెల్లడించేవారు చాలామంది. వారి భయాలకు కారణా లున్నా… అలాంటి నిరాశ అవసరం లేనిది. ఈ భయాలన్నీ కొన్ని దశాబ్దాలుగా ప్రజలు చేస్తున్న పోరాటాలు అర్థం కాకపోవడం, వాటిలో భాగం కాకపోవడం మూలంగా కలిగేవి మాత్రమే. వాళ్లు మళ్లీ వస్తే భూమి బద్ధలేమీ కాదు. ఒకవేళ అయితే గియితే ”ఇదంతా మాకెందుకులే.. మాదాకా వస్తారా.. వచ్చిన ప్పుడు చూద్దాంలే” అనుకునే మధ్య తరగతి భద్రజీవుల భ్రమలు బద్ధలవుతాయి. అలాగని వాళ్లు మళ్లీ గెలిస్తే దేశానికి జరిగే ప్రమాదాన్ని తక్కువ అంచనా వేయలేం. కానీ ఆ ప్రమాదం ఎంత నష్టం చేస్తుందో, సమాజాన్ని అంత చలనంలోకి తెస్తుంది. చీకటిలో చూపు నిశితమవుతుంది. అణచివేతకు సమాధా నంగా ప్రతిఘటన పదునెక్కుతుంది.
అయితే ఈ సార్వత్రిక ఎన్నికలు ఆ ప్రమాద నివారణకు ఓ సదవకాశం.