ఇజ్రాయిల్‌ మారణకాండకు ముగింపు పలకాలి

Israel must end the carnage– ఐరాస ఆమోదించిన కాల్పుల విరమణను అమలుచేయాలి
– పాలస్తీనా సంఘీభావ సభలో వామపక్ష నేతల డిమాండ్‌
– మారణహౌమానికి అమెరికా ఆర్థిక, సైనిక మద్దతు : సీతారాం ఏచూరి
న్యూఢిల్లీ : గాజాలో ఇజ్రాయెల్‌ సాగిస్తున్న మారణకాండకు స్వస్తి పలకాలని, చిక్కుకున్న మహిళలు, చిన్నారులను తక్షణమే ఆదుకోవాలని వామపక్షాల ఉమ్మడి సమావేశం డిమాండ్‌ చేసింది. ఐక్యరాజ్యసమితి ఆమోదించిన మానవతావాద కాల్పుల విరమణను వెంటనే అమలుచేయాలని పిలుపునిచ్చింది. ఆత్మరక్షణ ముసుగులో జియోనిస్ట్‌ రాజ్యం సాగిస్తున్న మారణహౌమాన్ని ఈ సమావేశం తీవ్రంగా ఖండించింది. మంగళవారం నాడిక్కడ హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ భవన్‌లో సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ ఎంఎల్‌, ఆర్‌ఎస్‌పీ, ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీల ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు భారత్‌లోని పాలస్తీనా రాయబారి అద్నాన్‌ అబు అల్హైజా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ గాజాలో ఇజ్రాయిల్‌ ఏకపక్షంగా మారణహౌమం చేస్తున్నదని, రెండు సైన్యాల మధ్య యుద్ధం కాదని, కనీవినీ ఎరుగని మారణకాండ అని ఆరోపించారు. శరణార్థి శిబిరాలు, ఆస్పత్రుల్లోనూ అంతర్జాతీయ చట్టాలు ఉల్లంఘించబడ్డాయన్నారు. బాంబులు దాడి జరుగుతుందని తెలిపారు. హమాస్‌ ఉనికి లేని వెస్ట్‌ బ్యాంక్‌లో ఇజ్రాయెల్‌ ఎందుకు బాంబులు వేస్తోంది? అమెరికా, దాని మిత్రదేశాలు వారి మారణహౌమానికి ఆర్థిక, సైనిక మద్దతును అందిస్తున్నాయని విమర్శించారు. కాల్పుల విరమణ కోసం ఒత్తిడిని తీవ్రతరం చేసే పోరాటంలో భారతీయులందరూ పాల్గొనాలని ఏచూరి పిలుపునిచ్చారు. వామపక్షాల మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ, పాలస్తీనా రాష్ట్రానికి చెందిన 73శాతం భూమిని ఇజ్రాయిల్‌ స్వాధీనం చేసుకున్నదని రాయబారి అద్నాన్‌ అబు అల్హైజా తెలిపారు. బెంజమిన్‌ నెతన్యాహు, ఒక వలసదారు, రెండు దేశాల సిద్ధాంతాన్ని కూడా ధ్వంసం చేశారని విమర్శించారు. తమ సొంత ఇంటిలోని ఒక్క గదిలోకెళ్లడానికి కూడా ఆక్రమిత బలగాలు అనుమతించవని అన్నారు. వారికి ఆత్మరక్షణ అంటే నరమేధమని అన్నారు. అల్‌-అక్సా మసీదును విభజించేందుకు జియోనిస్టులు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.
అక్రమ వలసలే ప్రాథమిక సమస్య అని పేర్కొంటూ, 1967 సరిహద్దుల్లో తూర్పు జెరూసలేం కేంద్రంగా పాలస్తీనా రాష్ట్రాన్ని ఏర్పాటుచేయాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా పిలుపునిచ్చారు.
సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌ కరత్‌, సీపీఐ ఎంఎల్‌ ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య, ఫార్వర్డ్‌ బ్లాక్‌ ప్రధాన కార్యదర్శి జి.దేవరాజన్‌, ఆర్‌ఎస్‌పీ నేత ప్రకాశరావు మాట్లాడారు. సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందా కరత్‌ తదితరులు పాల్గొన్నారు. జననాట్య మంచ్‌ కళాకారులు కళారూపాలు ప్రదర్శించారు.

Spread the love