రఫా క్రాసింగ్‌ను స్వాధీనం చేసుకున్న ఇజ్రాయిల్‌ బలగాలు

Israeli forces capture the Rafah crossing– కీలకమైన సహాయక మార్గం మూసివేతతో ఆందోళనకర పరిస్థితులు
– గత రాత్రి దాడుల్లో 23మంది మృతి
– చర్చలను భగం చేసేందుకే ఈ చర్యలన్న హమాస్‌
గాజా : అంతర్జాతీయంగా ఎన్ని విజ్ఞప్తులు వచ్చినా వాటిని బేఖాతరు చేసి తను అనుకున్నట్లుగానే రఫా విషయంలో ఇజ్రాయిల్‌ తన దూకుడు చర్యలతో ముందుకెళుతోంది. గాజాలోని రఫా క్రాసింగ్‌ను మూసివేసి పూర్తిగా తన అదుపులోకి తెచ్చుకుంది. కీలకమైన సహాయ మార్గాన్ని మూసివేయడంతో సహాయం నిలిచిపోయింది. పైగా ఈ మార్గాన్ని తీవ్రవాదుల కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నట్లు తమకు సమాచారం అందిందని ఇజ్రాయిల్‌ పేర్కొంటోంది. ఇప్పటికే అరకొర సరఫరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే తాజాగా క్రాసింగ్‌ను మూసివేయడంతో మరింత విపత్తుకు దారితీసే ప్రమాదముందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. రఫా సరిహద్దును మూసివేయడమంటే ప్రజలు చనిపోవాలని ఇజ్రాయిల్‌ కోరుకుంటోందని అర్ధమవుతోందని పాలస్తీనియన్‌ నేషనల్‌ ఇనీషియేటివ్‌ సెక్రటరీ జనరల్‌ ముస్తఫా బర్గౌటి వ్యాఖ్యానించారు. పైగా గాయపడిన, అనారోగ్యంతో బాధ పడుతున్న వేలాదిమంది పాలస్తీనియన్లు బయటకు వెళ్లడానికి గల ఏకైక మార్గం కూడా ఇదేనని ఇప్పుడు ఇది మూసివేయడంతో ఇక మరణమే శరణ్యమవుతుందన్నారు. రఫాపై గత రాత్రంతా జరిగిన దాడుల్లో 23మంది మరణించారు. వీరిలో ఆరుగురు మహిళలు, ఐదుగురు పిల్లలు వున్నారు. సెంట్రల్‌ రఫాలోని బిజీగా వున్న మార్కెట్‌ ఏరియాలో మసీదుపై క్షిపణిని ప్రయోగించడంతో నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు బయటకు వచ్చినవారందరూ భయాందోళనలతో పరుగులు తీశారు. సెంట్రల్‌ గాజాలోని నుస్రత్‌ శిబిరంపై మిలటరీ దాడులు జరపడంతో పిల్లలతో సహా పలువురు గాయపడ్డారు.
తక్షణమే రఫా ఆపరేషన్‌ ఆపాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) పేర్కొంది. ఇజ్రాయిల్‌ తీసుకున్న ఈ చర్యతో ఆరు లక్షలమంది పిల్లలతో సహా 15లక్షల మంది ప్రజల ప్రాణాలు తీవ్ర ప్రమాదంలో పడ్డాయని తూర్పు మధ్యధరా ప్రాంత ప్రాంతీయ డైరెక్టర్‌ హనన్‌ బాల్కీ హెచ్చరించారు. ఎలాంటి అవరోధాలు లేకుండా సాయమందడానికి కీలకమైన క్రాసింగ్‌ను తక్షణమే తెరవాలని ఎక్స్‌ పోస్టులో కోరారు. రఫాపై మిలటరీ దాడితో తీవ్ర పర్యవసానాలు వుంటాయని ఐక్యరాజ్య సమితి సంస్థలు, సహాయక గ్రూపులు హెచ్చరించాయి, అయినా ఏ రీతిలోనైనా తాము సాయం అందచేయడానికే కట్టుబడి వున్నామని స్పష్టం చేశాయి.పైగా గాజా కాల్పుల విరమణ ప్రతిపాదనను హమాస్‌ అంగీకరించినప్పటికీ తాము రఫాపై మిలటరీ ఆపరేషన్‌ను కొనసాగిస్తామని ఇజ్రాయిల్‌ స్పష్టం చేసింది. ఆ నేపథ్యంలోనే తాజా దాడి ప్రారంభమైంది. కతార్‌, ఈజిప్ట్‌ మధ్యవర్తులు చేసిన ప్రతిపాదనకు ఇజ్రాయిల్‌ డిమాండ్లకు అసలు పొంతన లేదని, అయినా కూడా కైరో చర్చలకు ప్రతినిధి బృందాన్ని పంపిస్తామని నెతన్యాహు కార్యాలయం ప్రకటించింది. ఈ ప్రతిపాదన గురించి అమెరికాకు ముందే తెలుసునని, అయినా హమాస్‌ అంగీకరించేవరకు తమకు తెలియచేయలేదని ఇజ్రాయిల్‌ పేర్కొంది. మూడు దశల కాల్పుల విరమణ ప్రతిపాదనను హమాస్‌ సోమవారం అంగీకరించింది. ప్రస్తుతం కొనసాగుతున్న కాల్పుల విరమణ చర్చలను భగం చేసేందుకే రఫా దాడి ప్రారంభించిందని హమాస్‌ విమర్శించింది.
రఫా, కరీమ్‌ షలోమ్‌ సరిహద్దు క్రాసింగ్‌ను మూసివేయాలని నిర్ణయించడం ద్వారా ఈ ప్రాంతంలో కరువు కాటకాలను సృష్టించాలని, ప్రజలు ఆకలిదప్పులతో చనిపోయేలా చేయాలని ఇజ్రాయిల్‌ భావిస్తోందని విమర్శించింది. ఇటువంటి పరిస్థితుల్లో కాల్పుల విరమణకు ఇజ్రాయిల్‌ను ఒప్పించేలా అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని పాలస్తీనా గ్రూపు కోరింది. యుద్ధం ఇన్ని మాసాలుగా ఇలానే కొనసాగుతోందంటే అందుకు ప్రధాన బాధ్యత వహించాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, అంతర్జాతీయ సమాజమేనని స్పష్టం చేసింది.రఫా దాడిని ఆపేందుకు ఇజ్రాయిల్‌ తక్షణమే చర్యలు తీసుకునేలా చూడాలని పాలస్తీనా అథారిటీ (పిఎ) ప్రతినిధి నబిల్‌ అబూ రుడెనెV్‌ా అమెరికాను కోరారు. తాజా దాడులతో నిర్వాసితుల ఇబ్బందులు రెట్టింపు అవుతాయని హెచ్చరించారు. ఇజ్రాయిల్‌కు ఆయుధాలు, డబ్బు, రాజకీయ ఆశ్రయం ఇవ్వడం ద్వారా అమెరికా అనూహ్యమైన మానవతా విపత్తును సృష్టించిందని విమర్శించారు.

Spread the love