రష్యా ఆస్తులను అమెరికా స్వాధీనం చేసుకుంటే

రష్యా ఆస్తులను అమెరికా స్వాధీనం చేసుకుంటే– డీ-డాలరైజేషన్‌ వేగవంతం అవుతుంది:మాజీ ఐఎమ్‌ఎఫ్‌ అధికారి
అమెరికా డాలర్‌ను ”ఆయుధీకరించటం” ద్వారా స్తంభింపచేసిన రష్యన్‌ ఆస్తులను స్వాధీనం చేసుకోవడం జరిగితే అది ప్రపంచాన్ని డాలర్‌ నుంచి దూరం అయ్యేలా చేస్తుందని ఒక మాజీ అంతర్జాతీయ ద్రవ్య నిధి అధికారిని ఉటంకిస్తూ బ్లూమ్‌బెర్గ్‌ బుధవారంనాడు రిపోర్ట్‌ చేసింది. అమెరికాలోవున్న రష్యన్‌ ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు అనుమతించే బిల్లుపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ ఈ వారం సంతకం చేశాడు. మాస్కోకు వ్యతిరేకంగా ఉక్రెయిన్కు సహాయం చేయడానికి పశ్చిమ దేశాలలో స్తంభింపజేసిన రష్యా నిధులను జప్తు చేయాలని వాషింగ్టన్‌ చాలా కాలంగా పట్టుబడుతోంది. అమెరికా, దాని మిత్రదేశాలు దాదాపు 300 బిలియన్ల రష్యన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆస్తులను స్తంభింపజేసాయి. వీటిలో సుమారు 5 బిలియన్లు ఉక్రెయిన్‌ సంబంధిత ఆంక్షలలో భాగంగా అమెరికా బ్యాంకుల్లో ఉన్నాయి.
”డాలర్‌ నిల్వలను స్వాధీనం చేసుకోవడం ద్వారా అమెరికా తన కరెన్సీని సూపర్ఛార్జ్‌ చేసిన ఆయుధీకరణ ఖచ్చితంగా అమెరికా ప్రత్యర్థులను డీ-డాలరైజేషన్‌ వైపు చూడడానికి పురికొల్పుతుంది” అని మాజీ ఐఎమ్‌ఎఫ్‌ అధికారి ఈశ్వర్‌ ప్రసాద్‌ హెచ్చరించినట్టు బ్లూమ్‌బెర్గ్‌ ఉల్లేఖించింది. బుధవారం నాడు బిడెన్‌ సంతకం చేసిన రెపో చట్టం ఉక్రెయిన్‌ కోసం 61 బిలియన్ల సైనిక సహాయ ప్యాకేజీతో పాటు, అమెరికన్‌ బ్యాంకులలో ఉన్న రష్యన్‌ ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకుని వాటిని ఉక్రెయిన్‌ పునర్నిర్మాణ నిధికి బదిలీ చేయడానికి అమెరికా అధ్యక్షుడికి అధికారం ఇచ్చింది. ”స్తంభింపజేసిన రష్యన్‌ సార్వభౌమ ఆస్తుల విలువను అన్‌లాక్‌ చేయడం మా అంతర్జాతీయ సంకీర్ణానికి అవసరం, అత్యవసరం” అని అమెరికా ట్రెజరీ కార్యదర్శి జానెట్‌ యెల్లెన్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
అమెరికా ట్రెజరీ బాండ్లకుగల విదేశీ డిమాండ్‌, డాలర్‌ వినియోగ సంభావ్య పరిణామాలపై చర్చను రెపో నిబంధన తీవ్రతరం చేస్తుందని బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొంది. జి-7 దేశాల, యూరోపియన్‌ యూనియన్‌ దేశాల సమ్మతిలేకుండా రష్యా ఆస్తులను అమెరికా స్వాధీనం చేసుకునే అవకాశం లేదని కూడా బ్లూమ్‌బెర్గ్‌ రాసింది. ”డి-డాలరైజేషన్‌ ప్రక్రియను చైనా వేగవంతం చేయవచ్చు” అని జెపి మోర్గాన్‌ విశ్లేషకురాలు కేథరీన్‌ లీ అన్నది. జెపి మోర్గాన్‌ అంచనాల ప్రకారం చైనీస్‌ అంతర్జాతీయ వాణిజ్యంలో 70% ఇప్పటికీ డాలర్లలో ఉంది.
”అంతర్జాతీయ వాణిజ్యం, ఫైనాన్స్ల కోసం డాలర్‌ను ఉపయోగించే దేశాలు తమ ఆస్తులను అమెరికా ఇష్టానుసారం స్వాధీనం చేసుకోకుండా చూసుకోవాలి” అని ది కాస్ట్‌ ఆఫ్‌ ఫ్రీ మనీ రచయిత పావోలా సుబాచి బ్లూమ్‌బెర్గ్‌ తో అన్నాడు. స్తంభింపచేసిన రష్యా నిధులను అమెరికా స్వాధీనం చేసుకుంటే మాస్కో వాషింగ్టన్‌తో దౌత్య సంబంధాలను తగ్గించుకోవచ్చని రష్యా ఉప విదేశాంగ మంత్రి సెర్గీ ర్యాబ్కోవ్‌ గురువారం హెచ్చరించాడు. రష్యా ఆస్తుల స్వాధీనంపై మాస్కో ప్రతిస్పందన ఆర్థిక, దౌత్యపరమైన ప్రతిఘటనల రూపంలో ఉంటుందని ఆయన చెప్పాడు.

Spread the love