ఇస్రో ఘన విజయం

– మార్క్‌3-ఎం3 రాకెట్‌ ప్రయోగం సక్సెస్‌
– మరోసారి కక్ష్యలోకి దూసుకెళ్లిన 36 ఉపగ్రహాలు
శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. జీఎస్‌ఎల్‌వీ మార్క్‌ 3 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశామని ఇస్రో చైర్మెన్‌ సోమనాథ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఇస్రో పంపిన 36 ఉపగ్రహాలను ఎల్వీఎం-3 రాకెట్‌ కక్ష్యలోకి చేర్చినట్టు తెలిపారు. ఆదివారం ఉదయం శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (షార్‌) లో ఎల్వీఎం-3 రాకెట్‌ ప్రయోగం జరిగింది. షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 9 గంటలకు షార్‌ ప్రయోగ వేదిక నుంచి ఎల్వీఎం-3 రాకెట్‌ వన్‌ వెబ్‌కు చెందిన మొత్తం 36 ఉపగ్రహాలతో నింగిలోకి దూసుకెళ్లింది. దాదాపు 20 నిమిషాల ప్రయాణం తర్వాత భూమి ఉపరితలం నుంచి 450 కి.మి. చేరుకుంది. మోసుకెళ్లిన ఉపగ్రహాలను ఒక్కొక్కటిగా లియో ఆర్బిటల్‌ వృత్తాకార కక్ష్యలోకి రాకెట్‌ ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహాల బరువు 5.8 టన్నులుగా శాస్త్రవేత్తలు తెలిపారు. ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ రెండు దశల్లో 72 ఉపగ్రహాలను ప్రయోగించడానికి వన్‌వెబ్‌తో ఒప్పందం చేసుకున్నది. దీనిలో భాగంగా మొదటి 36 ఉపగ్రహాలను గతేడాది అక్టోబరు 23న ఇస్రో విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. తాజాగా రెండో విడత 36 ఉపగ్రహాలను పంపింది.

Spread the love