జి-20 ఢిల్లీ ప్రకటన, ప్రస్తావించని అంశాలు

G-20 Delhi Declaration, points not mentionedప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపధ్యంలో జి-20 దేశాల ఢిల్లీ సమావేశం జరిగింది. సంపన్న పెట్టుబడిదారీ దేశాల ఆర్థిక వ్యవస్థల వృద్ధి రేటు 2022లో 2.7శాతం ఉన్నది కాస్తా 2023లో 1.3శాతానికి పడిపోవచ్చునని ఐఎంఎఫ్‌ అంచనాలు చెపుతున్నాయి. ఐఎంఎఫ్‌ వేసిన మరొక ప్రత్యామ్నాయ అంచనా ప్రకారం వృద్ధి రేటు 1శాతం కన్నా తక్కువగానే ఉండవచ్చు. ఇదే కాలంలో కార్మిక ఉత్పాదకతలో పెరుగుదల రేటు ఇంతకన్నా ఎక్కువగానే ఉంటుంది. అందువలన సంపన్న పెట్టుబడిదారీ దేశాలలో నిరుద్యోగం పెరుగుదల గణనీయంగా ఉండబోతోంది (వృద్ధిరేటు తగ్గడం అంటే ఉత్పత్తిలో వృద్ధిరేటు తగ్గడం. అదే సమయంలో ఉత్పాదకత రేటు అంతకన్నా ఎక్కువగా వృద్ధి చెందితే అంతకు మునుపు అవసరమైనంతమంది కార్మికులు ఇప్పుడు అవసరం ఉండరు. అందువలన నిరుద్యోగం పెరుగుతుంది). యూరోపియన్‌ యూనియన్‌ దేశాలలోకి తూర్పు యూరప్‌ దేశాల నుండి వలసలు భారీగా కొనసాగుతూనే ఉన్నాయి. అదనంగా ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ నుండి కూడా వలసలు సాగుతున్నాయి. వీటి ఫలితంగా ఇయు దేశాలలో నిరుద్యోగం ఇంకా ఎక్కువగా పెరగనుంది.
ఈ నిరుద్యోగం పెరిగేకొద్దీ శరణార్థులకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టే ధోరణులు ఇప్పటికే అక్కడ బలపడుతున్న ఫాసిజాన్ని ఇంకా బలపరుస్తాయి. ”ఆల్టర్నేటివ్‌ ఫర్‌ డేయిష్‌ ల్యాండ్‌” (ఎఎఫ్‌డి) అనే నయా నాజీ పార్టీ జర్మనీలో 20శాతం ఓట్లను సాధించేందుకు చేరువలో ఉంది. అదే జరిగితే అప్పుడు అక్కడ అధికారాన్ని పంచుకోడానికి ఇతర పార్టీలతో ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంటుంది. అ పరిస్థితి కనీసం అక్కడ రాష్ట్రాల ప్రభుత్వాల ఏర్పాటులో వ్యక్తం అవుతుంది. ఇంతవరకూ ఆ పార్టీని దూరంగా ఉంచిన తక్కిన పార్టీలు కూడా ఇప్పుడు ఎఎఫ్‌డితో ఒప్పందాలకు రాక తప్పదు. ఇక ఫ్రాన్స్‌లో ఇమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ కన్నా ఫాసిస్టు నేత లి పెన్‌ కే ఎక్కువమంది ఓటర్లు మొగ్గు చూపుతున్నట్టు నివేదికలు వస్తున్నాయి. స్పెయిన్‌లోనూ అటువంటి పరిస్థితే ఉంది. ఎటొచ్చీ ఇటీవలి ఎన్నికలు స్పష్టమైన తీర్పు ఇవ్వనందున అక్కడ తాత్కాలికంగా ఫాసిస్టు ముప్పు నుండి ఊరట లభించింది. పెరిగే నిరుద్యోగం ఈ దేశాలన్నింట్లోనూ ఫాసిస్టు శక్తుల పెరుగుదలకు ఊతం ఇస్తుంది.
సంపన్న పెట్టుబడిదారీ దేశాలు కనీవినీ ఎరుగని రీతిలో ఎదుర్కొంటున్న సంక్షోభపు ప్రకంపనలు మూడవ ప్రపంచ దేశాలలోనూ ప్రభావాన్ని చూపిస్తాయి. జీడీపీ వృద్ధిరేటు తగ్గిపోవడం, నిరుద్యోగం పెరిగిపోవడం, రుణ సంక్షోభం తీవ్రం కావడం. ఫాసిస్టు ధోరణులు బలపడటం తదితర రూపాలలో ఆ ప్రభావం ఉంటుంది. అన్ని రకాల సంక్షేమ పథకాలనూ రద్దు చేస్తానని ప్రకటించిన వ్యక్తి ఇప్పుడు అర్జెంటీనాలో జరగనున్న ఎన్నికల్లో దేశాధ్యక్షుడిగా గెలుపొందే పరిస్థితులు ఉన్నాయి. ఇంతవరకూ ఆ దిశగా అడుగులు వేయని దేశాలలో కూడా అటువైపే అడుగులు పడే ప్రమాదం ఉంది.
ఇటువంటి నేపధ్యంలో జరిగిన జి-20 దేశాల సమావేశంలో ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించే చర్యల గురించి చర్చ జరుగుతుంది అని ఎవరైనా ఆశిస్తారు. గతంలో అమెరికాలో హౌసింగ్‌ బుడగ పేలిపోయి ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు నిర్వహించిన జి-20 సమావేశంలో ఆ విధంగానే చర్చించారు. ఇప్పుడూ అటువంటి చర్చ జరుగుతుందని ఆశించడం సహజం. జి-20 దేశాలకు తాను నాయకత్వం వహించడం వలన మూడో ప్రపంచదేశాలకు ఎంతో ప్రయోజనకారిగా జి-20 వేదిక ఉంటుందని భారత ప్రభుత్వం చెప్పుకుంటోంది. అందుచేత ఆ మూడో ప్రపంచ దేశాల రుణ సమస్య ఈ సమావేశాలలో చర్చకు వస్తుందని ఎవరైనా భావిస్తారు. నిజానికి కొందరు భారత ప్రభుత్వ అధికార ప్రతినిధులు ఆ అంశం ఎజెండాలో ఉంటుందని సూచించారు కూడా.
కాని ఢిల్లీ సమావేశాలలో అటువంటి చర్చ జరగనేలేదు. జి-20 ఢిల్లీ శిఖరాగ్ర సమావేశం ప్రస్తుతం చాలా తీవ్రంగా ఉన్న ఆర్థికాంశాలగురించి ఏమీ ప్రస్తావించ లేదు. భద్రతా సమస్యలకన్నా ఆర్థికాంశాలపైనే జి-20 ఎక్కువగా దృష్టి సారించడం మంచిదని చైనా, రష్యా దేశాల ప్రతినిధులు ముందునుంచీ చెపుతూనేవున్నారు. ఇంతకు ముందు ఇండోనేసియాలోని బాలిలో జరిగిన జి-20 సమావేశ ప్రకటనలో ఉక్రెయిన్‌ యుద్ధానికి కారణం రష్యాయేనంటూ బాహాటంగానే విమర్శించారు. ఢిల్లీ ప్రకటనలో ఆ విధంగా రష్యాను నిందించే విధంగా ఏమీ లేదు. అక్కడ తక్షణమే శాంతి స్థాపన జరగాలన్న వాంఛను మాత్రం వ్యక్తం చేశారు. ఇదే జి-20 వైరిలో కనిపించిన స్వల్పమైన మార్పు. అయితే అటువంటి ప్రకటనల వలన కలిగే ప్రభావం ఏమీ ఉండదు.
ఉక్రెయిన్‌ను అడ్డం పెట్టుకుని రష్యామీద పరోక్షయుద్ధాన్ని సాగిస్తున్న నాటో కూటమిదేశాలు అక్కడ శాంతిని స్థాపించే దిశగా ఎటువంటి ప్రయత్నాలూ ముందుకు సాగకుండా అడ్డు పడుతూనే ఉన్నారు. గతంలో ఉక్రెయిన్‌, రష్యా దేశాల నడుమ మిన్క్స్‌లో కుదిరి ఒప్పందాన్ని చెడగొట్టినది అమెరికా, బ్రిటన్‌ దేశాలే. రష్యా సైనిక చర్యలు ప్రారంభించిన అనంతరం శాంతి స్థాపన కోసం మొదలైన సంప్రదింపులను చెడగొట్టినదీ ఆ దేశాలే. ఇప్పుడు కూడా యుద్ధంలో కొనసాగాలని ఉక్రెయిన్‌పై ఒత్తిడి తెస్తున్నది ఆ దేశాలే. నాటో కూటమి ఎంతకాలంపాటు ఈ యుద్ధం కొనసాగాలని కోరుకుంటోందో అంతకాలమూ ఆ యుద్ధం సాగుతూనేవుంటుంది. నాటో సభ్యదేశాలు డిల్లీ ప్రకటనలో ఉపయోగించిన పదజాలం తమకు అంత అనుకూలం కాకపోయినా, దానితో ఏకీభవించివుండొచ్చు. కాని యుద్ధాన్ని ముగించే విషయంలో నాటో నిర్ణయాన్ని జి-20 దేశాల ప్రకటన ఏ విధంగానూ ప్రభావితం చేయలేదు.
ఢిల్లీ ప్రకటన ఆర్థికాంశాల గురించి అసలు ఏమీ ప్రస్తావించనేలేదా అంటే ప్రస్తావనలైతే ఉన్నాయి. కాని అవి చాలా పైపైన మాత్రమే ఉన్నాయి. ఒక్క నిర్దిష్ట ప్రతిపాదన కూడా అందులో లేదు. పేద దేశాలకు రుణసహాయం అందించే విషయాన్ని చర్చించేందుకు ఒక అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించాలన్న సూచన కూడా అందులో లేదు. పోనీ నిలకడైన వృద్ధి సాధించేవిషయంలోనైనా ఒకటైనా సూచన వచ్చిందా అంటే అదీ లేదు. ప్రకటనలో అటువంటివి ఎలా చోటు చేసుకుంటాయని కొందరు ప్రశ్నించవచ్చు. కాని, కనీసం చర్చైనా జరిగిన దాఖలాలు ఉన్నాయా అంటే అదేమీ లేదు.
ఇలా ఎందుకు జరిగింది అని ఆశ్చర్యపడవలసిదేమీ లేదు. సదస్సుకు ఆతిధ్యం ఇస్తున్న మనదేశ ప్రభుత్వం దానినుండి గరిష్టంగా ప్రచార లబ్ధి పొందాలని మాత్రమే చూసింది. ఆ విధంగానే ప్రచారం చేసుకోగలిగింది కూడా. ఇక ప్రస్తుత సంక్షోభానికి ప్రధానంగా బలవుతున్నదీ, ఐఎంఎఫ్‌ రుద్దిన ”పొదుపు చర్యల” కింద నలిగిపోతున్నదీ పేద దేశాలు. వాటికి ఈ సమావేశంలో ప్రాతినిధ్యమే లేదు. ఇక అభివృద్ధి చెందిన దేశాలైతే అసలు సంక్షోభం ఎక్కడుందని అంటూ దబాయిస్తున్నాయి (మరోపక్క ఆ దేశాలలో ప్రభుత్వానుకూల ఆర్థిక వేత్తలు మాత్రం సంక్షోభం ఉందని అంగీకరిస్తున్నారు). అందుచేత జి-20 సమావేశాల్లో ఆయా దేశాలు తమ తమ కారణాల రీత్యా పాల్గొన్నాయే తప్ప ప్రపంచాన్ని ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం గురించి అవి పెద్దగా పట్టించుకోలేదు.
ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఈ సంపన్న పెట్టుబడిదారీ దేశాలు ప్రస్తుత ఆర్థిక సంక్షోభం గురించి పట్టనట్టు ఎలా ఉండగలుగుతున్నాయి? గతంలో పెట్టుబడిదారీ ప్రభుత్వాలకు నిరుద్యోగ సమస్య పట్ల చాలా ఆందోళన ఉండేది. పెట్టుబడిదారీ వ్యవస్థను రక్షించేందుకు కంకణం కట్టుకున్న ఆర్థికవేత్త జాన్‌ మేనార్డ్‌ కీన్స్‌ ”పెట్టుబడిదారులలో ఉండే వ్యక్తిగతపోకడల ఫలితంగా తలెత్తే నిరుద్యోగాన్ని ఈ ప్రపంచం సహిస్తూ ఉండడం ఇంకెంతమాత్రమూ సాధ్యం కాదు” అని ప్రకటించాడు. ఆ కాలంలో నిరుద్యోగం ఆర్థిక మాంద్యం పర్యవసానంగా ఉండేది. ఆర్థిక మాంద్యంలో పెట్టుబడిదారుల లాభాలు కూడా పడిపోతాయి. ఇటు పెట్టుబడిదారులు, అటు కార్మికులు, ఇరుపక్షాలూ సంక్షోభం వలన నష్టపోయే పరిస్థితి ఉండేది. కాని ప్రస్తుత పెట్టుబడిదారీ సమాజంలో ఆవిధంగా లేదు. ఉత్పత్తిని పెంచడం ద్వారా మాత్రమే లాభాలను పెంచుకోగలం అనే పరిస్థితి ఇప్పుడు లేదు. ద్రవ్య పెట్టుబడి లావాదేవీల ద్వారా లాభాలలో గణనీయమైన భాగం సమకూరుతోంది. అందుచేత సంక్షోభ కాలంలో కూడా పెట్టుబడిదారుల లాభాలు బాగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ ద్రవ్య పెట్టుబడి లావాదేవీలలో ఏ విధమైన అదనపు విలువా ఉత్పత్తి కాదు. అందుచేత ద్రవ్య పెట్టుబడి వనరులను చేజిక్కించుకోడం మీద దృష్టి పెడుతుంది. అందుచేత ఒకపక్కన ఉత్పత్తిలో పెరుగుదల లేకపోయినా, ప్రభుత్వరంగ ఆస్థులపైన, చిన్న పెట్టుబడి దారుల ఆస్థులపైన, సహజ వనరులపైన దృష్టి పెట్టి వాటిని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం మీద బడా కార్పొరేట్లు కేంద్రీకరిస్తారు. అంటే, అదనపు విలువను చేజిక్కించుకోడంతోబాటు నేరుగా ఆస్తులను కూడా స్వాధీనం చేసుకోడానికి సిద్ధపడతారు. ఇంతవరకూ సరుకులుగా పరిగణింపబడని వాటిని కూడా సరుకులుగా మార్చివేస్తారు (పెట్టుబడి కేంద్రీకరణ అనేది కొల్లగొట్టి పోగేసుకోవడం ద్వారా జరుగుతుంది). అందుచేత ఆర్థిక మాంద్యం అనేది ప్రస్తుత పెట్టుబడిదారీ సమాజంలో ఆధిపత్యస్థాయిలో ఉన్న కార్పొరేట్ల ప్రయోజనాలకు అంతగా ఆటంకంగా పరిగణించబడదు.
కాని పెద్ద స్థాయిలో పెరిగిపోయే నిరుద్యోగానికి, పేదరికానికి కారణమయే ఈ విధానాల వలన సంభవించే సామాజిక అస్థిరత్వం మాటేమిటి? నిరుద్యోగం గురించి, దానిని అదుపు చేయడంలో పెట్టుబడిదారీ వర్గం తీసుకోవలసిన బాధ్యత గురించి ఆనాడు కీన్స్‌ చెప్పిన సందర్భానికి, నేడు పెట్టుబడిదారీ వర్గం నిరుద్యోగం పట్ల నిర్లిప్తంగా ఉంటున్న సందర్భానికి మధ్య తేడాను మనం చూడాలి. బోల్షివిక్‌ విప్లవం విజయవంతం కావడం, సోషలిజం అనేది సమీప కాలంలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తూండటం కీన్స్‌ సిద్ధాంతాన్ని బలంగా ప్రభావితం చేశాయి. ఆ కాలంలో నిరుద్యోగాన్ని పరిష్కరించే చర్యలు వెంటనే గనుక చేపట్టకపోతే కార్మికవర్గానికి పెట్టుబడిదారీ వ్యవస్థ పట్ల విముఖత బాగా పెరిగి వ్యవస్థనే మార్చే దిశగా కార్యాచరణకు వారు సిద్ధపడే అవకాశం ఉంది. కాని ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు. ఉనికిలో ఉన్న సోషలిజం దెబ్బతినడంతో సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు సోషలిజం వచ్చేస్తుందేమో అన్న భయం ఏమాత్రమూ లేదు. ఆ దేశాల ఆధిపత్యాన్ని కొనసాగించే విషయంలో అవి కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటున్నమాట వాస్తవమే. కాని ఆ సవాళ్ళు పెట్టుబడిదారీ వ్యవస్థనే సైద్ధాంతికంగా సవాలు చేసే స్థాయిలో లేవు. కీన్స్‌ కాలంలో అటువంటి సైద్ధాంతిక సవాలు కూడా ఉంది. ఇప్పుడు కార్మికవర్గం నుంచి ఎదురయే ఎటువంటి సవాలునైనా ఫాసిస్టు శక్తుల సహాయంతో దెబ్బ తీయవచ్చునని అవి భావిస్తున్నాయి.
అయితే అవన్నీ పిచ్చి భ్రమలే. ప్రస్తుతం సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లో భారీ స్థాయిలో కార్మికవర్గ పోరాటాలు చెలరేగుతున్నాయి. బోల్షివిక్‌ విప్లవం వస్తుందని ఆనాడు పెట్టుబడిదారీ వర్గం ఊహించిందా? వాళ్ళ ఊహలకు అందని రీతిలో ఆనాడు విప్లవం జయప్రదం కాలేదా?
ప్రభాత్‌ పట్నాయక్‌

Spread the love