” రైతుభరోసా ”ను వేసినట్టు ఎందుకీ అబద్ధాలు..?

– ట్విట్టర్‌లో రాహుల్‌పై కేటీఆర్‌ ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలోని రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులను వేసినట్టు రాహుల్‌గాంధీ ఎందుకు అబద్దాలు చెబుతున్నారనీ ట్విట్టర్‌ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్‌ నిలదీశారు. ఆయన .. భ్రమలో ఉన్నారా…? తెలంగాణ ప్రజలతో.. డ్రామా ఆడుతున్నారా..? అని అడిగారు. ఎంతకాలం ఈ అసత్యాలు..?? అని నిలదీశారు. ఎకరానికి రూ.7,500 ఒక్క రైతుకైనా వచ్చిందా? అని ప్రశ్నించారు. నాట్ల నాడు.. ఇయ్యాల్సిన పెట్టుబడి సాయాన్ని పార్లమెంట్‌ ఓట్ల దాకా.. డైలీ సీరియల్‌ లా సాగదీశారని పేర్కొన్నారు. చివరికి పాత ” రైతుబంధు ” కూడా పూర్తిగా అందలేదని గుర్తు చేశారు. ” రైతు భరోసా ”కైతే అసలు అడ్రస్సే లేదని తెలిపారు. నాడు.. రూ.15 లక్షలు వేస్తానన్న బడాభారు వేయలేదనీ, నేడు.. రూ.15 వేలు ఇస్తానన్న ఛోటాబారు ఇయ్యలేదని గుర్తు చేశారు. మరి రైతు భరోసా వేసినట్టు ఎందుకీ ఫోజులు ? అసత్యాలపై కాంగ్రెస్‌ స్వారీ.. ఇంకెన్ని రోజులు ?? అని విమర్శించారు. డిసెంబర్‌ 9న చేస్తానన్న రెండు లక్షల రుణమాఫీ జాడేది ? అని నిలదీశారు. కౌలు రైతులకు, కూలీలకు చేస్తామన్న సాయం సంగతేదని ? ప్రశ్నించారు. ఇదేనా మీరు చెప్పిన ప్రజాపాలన.., నమ్మి ఓటేసిన పాపానికి ఏంటి ఈ నయవంచన అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రజాపాలన కాదు.., ముమ్మాటికీ ఇది ప్రజా వ్యతిరేక పాలన పేర్కొన్నారు. 420 మోసపూరిత వాగ్దానాలతో..,నాలుగుకోట్ల ప్రజలను వంచించిన పాలన ఇదని తెలిపారు. ఒక్క మాట మాత్రం నిజం.., గాలిమాటల గ్యారెంటీలను నమ్మి..,అసెంబ్లీ ఎన్నికల్లో ఆగమైంది తెలంగాణ..అనీ, కానీ.. పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజాచైతన్యం వెల్లివిరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకున్న ఏకైక గొంతుక బీఆర్‌ఎస్‌ వైపే ప్రజాతీర్పు ప్రతిధ్వనిస్తుందని తెలిపారు.

Spread the love