జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇస్తామనడం సంతోషం

– సీఎం కేసీఆర్‌కు ఫెడరేషన్‌ కృతజ్ఞతలు
– పాములతో పోల్చడం సరైంది కాదని వ్యాఖ్య
నవతెలంగాణ-హైదరాబాద్‌
జర్నలిస్టులకు ఇండ్లస్థలాల ఇచ్చే విషయమై సీఎం కేసీఆర్‌ గతంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తామని బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటన సందర్భంగా చెప్పడం పట్ల తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌(టీడబ్ల్యూజేఎఫ్‌) రాష్ట్ర కమిటీ హర్షం వ్యక్తం చేసింది. దీర్ఘకాలికంగా జర్నలిస్టులు స్థలాల కోసం ఎదురుచూస్తున్నారని గుర్తు చేసింది. ఇండ్లస్థలాలు మంజూరు చేసే వ్యవహారం ఫైనల్‌ స్టేజ్‌కు వచ్చిందని సీఎం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. అదే సందర్భంలో జర్నలిస్టులను పాములతో పోల్చడం సమంజసం కాదని అభిప్రాయపడింది. ఆయా పత్రికలు, ఛానళ్ల యాజమాన్యాల విధానాల ప్రకారం జర్నలిస్టులు విధులు నిర్వహించాల్సి వస్తుందన్న విషయం ప్రభుత్వానికి తెలియనిది కాదని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య తెలిపారు. జర్నలిస్టులు పనిచేసేది ప్రజలు, ప్రభుత్వం కోసమేనని చెప్పారు. ప్రతిక్షణం ప్రజలపక్షాన బాధ్యతలు నిర్వహించే జర్నలిస్టులను పాములతో పోల్చడాన్ని ఖండించారు. న్యూట్రల్‌గా ఉండే జర్నలిస్టులకే ఇండ్లస్థలాలు ఇస్తామనడం, వ్యతిరేకంగా రాసేవారికి ఇవ్వమని చెప్పడం న్యాయం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో మీడియా పాత్రను ఎవరూ శంకించలేరని వ్యాఖ్యానించారు. మీడియాను రాజ్యాంగం ఫోర్త్‌ ఎస్టేట్‌గా గుర్తించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి, సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఏదీఏమైనా జర్నలిస్టులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వెంటనే అమలుచేయాలని విజ్ఞప్తి చేశారు.
24న తలపెట్టిన సెమినార్‌ వాయిదా
జర్నలిస్టుల ఇండ్లస్థలాల కోసం ఈనెల 24న హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సీనియర్‌ జర్నలిస్టులు, సంపాదకులు, బ్యూరో చీఫ్‌లు, రాజకీయపార్టీలతో ఫెడరేషన్‌ తలపెట్టిన సెమినార్‌ను సీఎం ప్రకటన నేపథ్యంలో తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఇండ్ల స్థలాల జారీ ప్రక్రియ పైనల్‌ స్టేజ్‌కు వచ్చిందని సీఎం చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అభిప్రాయపడింది. త్వరితగతిన ఇండ్లస్థలాల మంజూరు కోసం కొత్త విధానాన్ని రూపొందించి అమలుచేయాలని విజ్ఞప్తి చేసింది. లేనిపక్షంలో ఆందోళన కొనసాగిస్తామని ప్రకటించింది.

Spread the love