ఇది ప్రజా ప్రభుత్వం

It is a public government– మా పార్టీలోకి వస్తేనే ఇల్లు ఇస్తామని బెదిరించం
– రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ప్రజాపాలన ప్రారంభం
– రాష్ట్ర సంపదను ప్రజలకు అంకితం చేస్తా
– పథకాల అమల్లో రాజకీయ వివక్ష పాటించం అందరికీ ఆరు గ్యారంటీలు ఇస్తాం : డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క
– తెలంగాణ బిడ్డలై ఉండి అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ 6 గ్యారంటీలు పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు : భట్టి

నవతెలంగాణ-రంగారెడ్డి
ప్రాంతీయ ప్రతినిధి/ అబ్దుల్లాపూర్‌మెట్‌
‘తమది ఒక వర్గానికో, ఒక వ్యక్తికో సంబంధించిన ప్రభుత్వం కాదు. దొరల ప్రభుత్వం కాదు. మా పార్టీలోకి వస్తేనే ఇల్లు ఇస్తామని బెదిరించే ప్రభుత్వం కాదు. ప్రజల చేత.. ప్రజల కోసం అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం ఇది. రాష్ట్ర సంపదను ప్రజలకు అంకితం చేస్తాం. సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి రాజకీయ పక్షపాతమూ పాటించబోం. అర్హులైన ప్రతి ఒక్కరికీ 6 గ్యారెంటీలు కచ్ఛితంగా అందిస్తాం’ అని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్‌మెట్‌ గ్రామపంచాయతీ వద్ద కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ”ప్రజాపాలన అభయ హస్తం” ఆరు గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాష్ట్ర సంపదను ప్రజలకు అంకితం చేసి తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించడమే ప్రజాపాలన ఉద్దేశమని చెప్పారు. గడిచిన దశాబ్ద కాలంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఒక్క రేషన్‌ కార్డు కూడా మంజూరు కాలేదని అన్నారు. డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇస్తామని చెప్పి ఉన్న ఇందిరమ్మ ఇండ్లను కూడా ఇవ్వకుండా పేదలను మోసం చేసిందన్నారు. రెండు పడక గదుల ఇండ్ల కోసం పేదలు కండ్లు కాయలు కాచేలా, చెప్పులు అరిగేలా తిరిగారన్నారు. గడిచిన పదేండ్లలో రాష్ట్ర ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాలు పొందలేదని చెప్పారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడానికి తమ ప్రభుత్వం ప్రజల చెంతకే వెళ్లి ఆరు గ్యారంటీలు అమలు చేయడానికే ప్రజాపాలన కార్యక్రమం చేపట్టినట్టు చెప్పారు. తెలంగాణ బిడ్డలై ఉండి అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ 6 గ్యారంటీలు పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. పేద, మధ్యతరగతి ప్రజల ఆర్థిక స్థితిగతులు, జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ కర్తవ్యమన్నారు. జనవరి 6 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, వంద కుటుంబాలకు ఒక కౌంటర్‌ పెట్టి దరఖాస్తులను స్వీకరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. ప్రజల దగ్గరకే వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తున్న ప్రజాపాలన తెలంగాణలో మొదలైందన్నారు. కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలు కావొద్దని కోరుకుంటున్న బీఆర్‌ఎస్‌ కలలను నిజం కానివ్వబోమన్నారు.
దిగ్విజయంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
ఆదిలాబాద్‌ నుంచి ఖమ్మం వరకు పీపుల్స్‌ మార్చ్‌ పేరిట తాను పాదయాత్ర చేసిన సమయంలో మహిళలు సమస్యలు చెప్పుకున్నారని వివరించారు. రెవెన్యూ, పోలీస్‌ వ్యవస్థలతో పాటు ప్రతి సంస్థ, వ్యవస్థ తమ కోసమే ఉందన్న భావన ప్రతి పౌరుడిలో మెలిగే విధంగా ఇందిరమ్మ రాజ్యపాలన ఉంటుందన్నారు. నాడు పాదయాత్రలో భాగంగా అబ్దుల్లాపూర్‌మెట్‌కు వచ్చిన సందర్భంగా ఇండ్లు లేని పేద ప్రజలు తనను కలిశారని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి లబ్దిదారుడికీ ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తామని చెప్పామని, మాట ప్రకారం నేడు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేసుకునే వారికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్టు వెల్లడించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ముగిసిన గంట లోపులొనే అదే ప్రాంగణంలో రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించడానికి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించి దిగ్విజయంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ సాయాన్ని 10 లక్షల రూపాయలకు పెంచడం వల్ల పేద మధ్యతరగతి వర్గాలకు ఎంతో మేలు జరుగుతున్నదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా, పంచాయతీ రాజ్‌ శాఖ కమిషనర్‌ హన్మంతు, స్పెషల్‌ ఆఫీసర్‌ శృతి ఓజా, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు, జిల్లా పరిషత్‌ సీఈఓ దిలీప్‌ కుమార్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ప్రభాకర్‌, సీపీఓ సౌమ్య, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్‌రావు, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత రెడ్డి, ఎంపీడీఓ మమత బాయి, గ్రామ సర్పంచ్‌ కిరణ్‌, ఎంపిపి రేఖ మహేందర్‌, జెడ్పీటీసీ బింగిదాస్‌ పాల్గొన్నారు.
దరఖాస్తుదారులందరికీ రశీదు..నెంబర్‌
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. లబ్దిదారులు ఈ వారం రోజుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయా వార్డుల్లో అధికారులకు దరఖాస్తులు అందజేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్‌ గౌతమ్‌ పొట్రు మాట్లాడుతూ.. కుటుంబం నుంచి ఒకే దరఖాస్తు సమర్పించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో దరఖాస్తులు సమర్పించి, రసీదు పొందాలని చెప్పారు. రేషన్‌ కార్డు ఉంటేనే దరఖాస్తు చేయాలనే నిబంధన లేదు, ఆధార్‌ కార్డ్‌ జీరాక్స్‌ పెట్టి కూడా అప్లై చేసుకోవచ్చని, వదంతులు నమ్మొద్దని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ రశీదు, దరఖాస్తు నెంబర్‌ భద్రపరచుకోవాలని సూచించారు.

Spread the love