పొద్దస్తమానం వానే

– కరీంనగర్‌ జిల్లా గుండిలో 15.8 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షం
– వికారాబాద్‌, రంగారెడ్డి, కరీంనగర్‌, మేడ్చల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు
– 923 ప్రాంతాల్లో వర్షపాతం నమోదు
– వచ్చే మూడ్రోజులూ ఇలాగే.. పలు జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గురువారం పొద్దస్తమానం వాన పడింది. రాష్ట్రంలో గురువారం రాత్రి 10:30 గంటల వరకు 933 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. 9 ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షం(12 సెంటీమీటర్లకుపైగా), 150 ప్రాంతాల్లో భారీ వర్షం(6.5 నుంచి 11.5 సెంటీమీటర్ల వరకు) కురిసింది. కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం గుండిలో అత్యంత భారీ వర్షం పడింది. అక్కడ 15.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా ఇదే అత్యధికం. గురువారం వికారాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో ఎక్కువ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వచ్చే మూడ్రోజులు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు.
ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. బంగాళాఖాతంలో ఒడిశా తీరంలో అల్పపీడనం ఏర్పడింది. దానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణ వైపు వంగి ఉందని తెలిపారు. 21వ తేదీకి సంబంధించి కొమ్రంభీమ్‌ అసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికను, పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికను వాతావరణ శాఖ జారీ చేసింది.
గురువారం అత్యధిక వర్షపాతం నమోదైన ఐదు జిల్లాలివే గుండి (కరీంనగర్‌ జిల్లా) 15.8 సెంటీమీటర్లు ముజాహిద్‌పూర్‌
(వికారాబాద్‌ జిల్లా) 13.6 సెంటీమీటర్లు పుట్టపహాడ్‌
(వికారాబాద్‌ జిల్లా) 13.1 సెంటీమీటర్లు
కందువాడ(రంగారెడ్డి) 12.5 సెంటీమీటర్లు
కేతిరెడ్డిపల్లి(రంగారెడ్డి) 12.5 సెంటీమీటర్లు
చందనవల్లి(రంగారెడ్డి) 12.1 సెంటీమీటర్లు 

Spread the love