తులసీ చందుపై మతోన్మాదుల బెదిరింపులను ఖండించండి,కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే

–  సీఐటీయూ, డీవైఎఫ్‌ఐ పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
స్వతంత్ర జర్నలిస్టు, సామాజిక విశ్లేషకురాలు తులసీచందును చంపేస్తామని ఫోన్లు చేసి బెదిరిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ మతోన్మాదుల చర్యలను ప్రతిఒక్కరూ ఖండించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్‌, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట రమేశ్‌, ఎ.వెంకటేశ్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక వ్యక్తి భావవ్యక్తీకరణను అడ్డుకోవడం రాజ్యాంగ ప్రజాస్వామిక హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు. మతోన్మాదం, మనువాద ఆగడాలు అరాచకాలను ప్రశ్నిస్తూ దేశంలో శాంతి మతసామరస్యాలను పెంపొందించాలనే దృఢ సంకల్పంతో సామాజిక మాధ్యమాలలో విశ్లేషణలు చేస్తున్న తులసీచంద్‌పై బెదిరింపులకు పాల్పడటం అప్రజాస్వామికమనీ, ఆటవిక చర్య అని పేర్కొన్నారు. గతంలో బీజేపీ – మతోన్మాదుల ఆగడాలను ప్రశ్నించినందుకు గౌరీ లంకేష్‌, కల్బుర్గి, ఫన్సారే, ధబోల్కర్‌ను హతమార్చిన ఈ మతోన్మాద గుండాలు ఇప్పుడు తులసీ చందును హత్య చేస్తామంటూ బెదిరించటం దారుణమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తులసీచందుకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఆమెకి ఏమైనా జరిగితే రాష్ట్రంలోని ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ నేతలు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
మతోన్మాదుల ఆగడాలను అడ్డుకుందాం : కేవీపీఎస్‌
స్వతంత్ర జర్నలిస్టు తులసి చందును ఆర్‌ఎస్‌ఎస్‌ మూకలు చంపుతామని ఫోన్లు చేసి బెదిరించడాన్ని మానుకోవాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్‌) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాన్‌ వెస్లీ టి స్కైలాబ్‌ బాబు ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. మతోన్మాదం, మనువాద ఆగడాలను ప్రశ్నిస్తున్నందుకే ఆమెపై బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. శాంతి మతసామరస్యాలను పెంపొందించాలనే సంకల్పంతో సామాజిక మాధ్యమాలలో ఆమె విశ్లేషణలు చేస్తున్నారని తెలిపారు. ఆమెపై బెదిరింపులకు పాల్పడటం ప్రజాస్వామిక హక్కును కాలరాయడమేనని పేర్కొన్నారు. ఆమెకి ఎలాంటి హాని జరిగినా రాష్ట్రంలోని ఆర్‌ఎస్‌ఎస్‌ బీజేపీి నేతలు బాధ్యత వహించాలని హెచ్చరించారు. ప్రభుత్వం ఆమెకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. బెదిరింపులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి: సీపీఐ(ఎంఎల్‌)ప్రజాపంథా
స్వతంత్ర జర్నలిస్టు తులసి చందును ఆర్‌ఎస్‌ఎస్‌ మూకలు చంపుతామని ఫోన్లు చేసి బెదిరించడాన్ని మానుకోవాలని సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. మతోన్మాదం, మనువాద ఆగడాలను ప్రశ్నిస్తున్నందుకే ఆమెపై బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. శాంతి మతసామరస్యాలను పెంపొందించాలనే సంకల్పంతో సామాజిక మాధ్యమాలలో ఆమె విశ్లేషణలు చేస్తున్నారని తెలిపారు. ఆమెపై బెదిరింపులకు పాల్పడటం ప్రజాస్వామిక హక్కును కాలరాయడమేనని పేర్కొన్నారు. ఆమెకి ఎలాంటి హాని జరిగినా రాష్ట్రంలోని ఆర్‌ఎస్‌ఎస్‌ బీజేపీి నేతలు బాధ్యత వహించాలని హెచ్చరించారు. ప్రభుత్వం ఆమెకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. బెదిరింపులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
 సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విధానాలను సామాజిక మాధ్యమాల ద్వారా ఎండగడుతున్న స్వంతంత్ర జర్నలిస్టు తులసి చందుపై వేధింపులు, ట్రోలింగ్‌, ప్రాణహాని దాడుల బెదిరింపులను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తీవ్రంగా ఖండించారు. ఇది ఫాసిస్టు దోరణికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. తమ విధానాలను ప్రశ్నించే వ్యక్తులు, శక్తులపై దాడి చేయడం బీజేపీ అధికారంలోకి వచ్చాక పరిపాటిగా మారిందని విమర్శించారు. గతంలో సల్మాన్‌ రష్మీ, అరుంధతిరారు, తస్లీమానస్రీన్‌ తదితరులపై ఇదే పద్ధతులలో మతశక్తులు వారి భావాలను అంగీకరించనటువంటి కొన్ని ముస్లీం ఉగ్రవాద సంస్థలు, ఇతర సంస్థలు ఫత్వా తదితర పద్ధతుల ద్వారా వారి ప్రాణాలు తీయడానికి పిలుపునివ్వడం జరిగిందని గుర్తుచేశారు. కల్బుర్గి, గోవింద్‌ పన్సారే, గౌరిలంఖేష్‌, దబోల్కర్‌ తదితర మేధావులు, సామాజిక ఉద్యమకారులను బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, సంఫ్‌పరివార్‌ మతోన్మాద మూకలే హత్యచేసినటువంటి ఘటనలు మరచిపోకముందే ఆ దాడుల పరంపర కొనసాగింపే తులసి చందును బెదిరిస్తున్నారని తెలిపారు. ఆమెకు అన్నివిధాల రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నదని పేర్కొన్నారు. ఆమెకు ఎటువంటి హాని జరిగినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సివుంటుందని హెచ్చరించారు. సామాజిక ఉద్యమకారులు, హేతువాదులు, లౌకికవాదులు, కవులు, కళాకారులు, పాత్రికేయులు తదితర ప్రశ్నించేవారిని, సత్యశోధన చేసేవారిని సమాజమేలు కోరేవారిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, ప్రజలపైన ఉన్నదని కూనంనేని అన్నారు.

Spread the love