ఐక్యంగా పోరాడాల్సిన సమయమిది

To fight unitedly
It's time– ఇండియా కూటమికి పలు చిన్న పార్టీలు, ఉద్యమవేదికలు, ప్రజా సంఘాల మద్దతు
– ‘జీతేగా ఇండియా’ సదస్సులో నిర్ణయం
– దేశవ్యాప్తంగా అక్టోబర్‌ 2 నుంచి 1.25 లక్షల మంది వాలంటీర్ల ప్రచారం
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాల ఇండియా కూటమికి మద్దతిస్తామని చిన్న పార్టీలు, ప్రజా ఉద్యమ వేదికలు, ప్రజా సంఘాల వేదిక ప్రకటించాయి. ‘జీతేగా ఇండియా – బనేగా ఇండియా’ పేరుతో దేశవ్యాప్తంగా 1.25 లక్షల మంది వాలంటీర్లు ప్రచారం చేయనున్నారు. ఈ ప్రచార కార్యక్రమం అక్టోబర్‌ 2న వార్ధాలోని సేవాగ్రామ్‌, ఇతర ప్రదేశాల్లో ప్రారంభమవుతుంది. భారత్‌ జోడో అభియాన్‌, కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ కమ్యూనిస్టులు, డెమోక్రటిక్‌ సోషలిస్టులతో రూపొందించబడిన ‘జీతేగా ఇండియా’ వేదిక ప్రతిపక్షాల ఇండియా కూటమికి మద్దతు తెలిపింది. ఇది ‘సత్య సైన్యాల’తో బీజేపీ ట్రోల్‌ ఆర్మీలను కూడా ఎదుర్కొంటుంది. వారు ప్రతిపక్ష కూటమి నుంచి సీట్లు కోరలేదు. ఇండియా కూటమికి బీజేపీ మధ్య ఓట్ల వ్యత్యాసం తక్కువ ఉన్న 125-150 సీట్లను ఈ వేదిక గుర్తిస్తుందని పేర్కొంది. అయితే వేదిక గుర్తించిన స్థానాల్లో ఇండియా కూటమి పార్టీలు, బీజేపీ సులభంగా గెలిచే స్థానాలు ఉండవు.
న్యూఢిల్లీ : ‘జీతేగా ఇండియా’- ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం పేరుతో ఢిల్లీలోని కాన్ట్సిట్యూషన్‌ క్లబ్‌లో జరిగిన జాతీయ సదస్సులో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. దీనికి 18 చిన్న ప్రతిపక్ష పార్టీలు, 20 రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ప్రజా ఉద్యమాల సంఘాలు, పౌర సమాజ సంస్థల నుంచి దాదాపు 500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ, దాని మిత్రపక్షాల (బహిరంగ, రహస్య)ను ఓడించడమే లక్ష్యంగా తీర్మానం ఆమోదించారు.
ఈ జాతీయ సదస్సులో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, కాంగ్రెస్‌ నేత దిగ్విజరు సింగ్‌, ఎస్పీ నేత జావేద్‌ అలీ ఖాన్‌, ఆర్‌ఎల్‌డీ నేత త్రిలోక్‌ త్యాగి తదితర నేతలు ప్రసంగించారు. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ ఐక్య పోరాటమే బీజేపీ ఓటమికి దారి తీస్తుందని ఉద్ఘాటించారు. భారతదేశాన్ని రక్షించాలంటే, బీజేపీని సాగనంపాలన్నది ప్రతి దేశభక్తుడి లక్ష్యం కావాలని అన్నారు. ”ఇండియా గెలుస్తుంది. కానీ మనమందరం మన ప్రయత్నం చేస్తేనే అది గెలుస్తుంది. దేశం పునాదులపై దాడి జరుగుతుంది. దేశ మూల స్తంభాలపై లెక్కలేనన్ని దాడులు జరిగాయి. దేశంలో 28 పార్టీలు భారత దేశాన్ని రక్షించడం, ఉత్తమ రేపటికి భరోసా ఇవ్వడమే లక్ష్యాలను కలిగి ఉన్నాయి” అన్నారు.
ఎస్పీ నేత జావేద్‌ అలీ ఖాన్‌ మాట్లాడుతూ ‘బీజేపీ దాదాపు జాతీయవాదాన్ని, దేశభక్తిని కూడా గుత్తాధిపత్యం చేసింది. ఈ తప్పుడు గుత్తాధిపత్యాన్ని అధిగమించి వారికి తమ స్థానాన్ని చూపించడమే మన కర్తవ్యం. బీజేపీకి వ్యతిరేకంగా మనం ఒక్కటైతే విజయం సాధించగలం’ అన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, మన భవిష్యత్తుకు ముప్పు పొంచి ఉందని, ఆర్‌ఎస్‌ఎస్‌కు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజరు సింగ్‌ విమర్శించారు. ‘దాదాపు 100 ఏండ్లుగా ఆర్‌ఎస్‌ఎస్‌ తన కేంద్ర లక్ష్యాల నుంచి కదలలేదు. ముసుగు మారుతుంది. కానీ లక్షణం కాదు. ఆర్‌ఎస్‌ఎస్‌తో ఎప్పుడూ రాజీపడని పార్టీ కాంగ్రెస్‌’ అని ఆయన అన్నారు. సదస్సులో చర్చలను వివరిస్తూ సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్‌ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయ సాధనకు కృషిచేయాలని తాము నిర్ణయించుకున్నామని అన్నారు. ‘మేము వాలంటీర్లను రిక్రూట్‌ చేస్తాము. శిక్షణ ఇస్తాము. పర్యవేక్షిస్తాము. డిసెంబరు నాటికి వాలంటీర్లను ఏర్పాటు చేస్తాం’ అని చెప్పారు. కమ్యూనిస్ట్‌ మార్క్సిస్ట్‌ పార్టీ (సీఎంపీ) నాయకుడు సీపీ జాన్‌ మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య ధర్మాలను ధ్వంసం చేసిన శక్తులపై పోరాడాల్సిన సమయం ఇదేనని తీర్మానం స్పష్టం చేసిందన్నారు.

Spread the love